"తలకి రంగు వేసుకోవడం వల్ల జుట్టు మరింత తెల్లబడుతుంది". ప్రకటించేసింది పుష్పవల్లి. "ఈ మాదిరిగా" తెలుపు నీలం రంగు చదరాల గచ్చును చూపిస్తూ అంది. అరవైల్లో ఉన్న ఆమె తల పై ఉన్న కొంచెం జుట్టు పూర్తిగా తెల్లబడిపోయింది. "కొబ్బరి నూనె, లైఫ్ బాయ్ సబ్బు ఓన్లీ". ఓన్లీ అనే పదాన్ని ఇంగ్లీషు లోనే ఒత్తి పలుకుతూ అంది.
ఆమె ఒక మధ్యాహ్నం టైల్స్ వేసిన గచ్చు నేల మీద కూర్చుని గతాన్ని, ప్రస్తుతాన్ని నెమరు వేసుకుంటొంది. " మా అమ్మ ఉండేటప్పుడు" అంటూ చెప్పటం మొదలెట్టింది. "మా అమ్మ అత్తగారు ఒక కొబ్బరిముక్కను అమ్మకు ఇచ్చేది. అమ్మ ఆ ముక్కను నమిలి తలకు రాసుకునేది. అదే ఆవిడకు కొబ్బరి నూనె".
వాసంతి పిళ్లై, పక్కనే కూర్చుని పుష్ప వేణి తో ఏకీభవించింది. ఇద్దరు ఆడవాళ్ళూ (దూరపు బంధువులు కూడా) ధారవి లో ఒకే సందులో ఒకే గది ఉండే ఇళ్లలో దాదాపు 50 ఏళ్ళు గడిపారు. గొంతులో అరుదైన సంతృప్తి ధ్వనిస్తూ వాళ్ల జీవితం గురించి చెప్పారు. ఇద్దరిదీ దశాబ్దాల స్నేహ బంధం. మారిపోయిన ప్రపంచం గురించిన జ్ఞాపకాలు ఇద్దరికీ ఉన్నాయి.
పుష్ప వేణి 14-15 ఏళ్ళ వయసులో కొత్త పెళ్ళికూతురుగా ధారవిలో అడుగు పెట్టింది. పెళ్ళికొడుకు ధారవిలో ఉండేవాడు. పెళ్లి అక్కడే ఉన్న ఖాళీ స్థలంలో మంటపంలో జరిగింది."అతనికి అప్పుడు 40 ఏళ్ళు" అంది పుష్ప వేణి. అంత పెద్దవాడా? "అవును. అయినా ఆ రోజుల్లో ఇవన్నీ ఎవరూ పట్టించుకునే వారు కాదు". పెళ్లి తర్వాత సాంబార్ అన్నం పెళ్లి భోజనంగా పెట్టారు, కేవలం శాఖాహారం". ఆవిడ గుర్తుచేసుకుంది.
పెళ్లి తర్వాత ఆవిడ, ఆవిడ భర్త చిన్నసామి ఒక గదిలోకి మారారు. చిన్నసామి ఆ గదిని 500 రూపాయలు పెట్టి కొన్నాడు. ఆ రోజుల్లో అది చాలా పెద్ద మొత్తం. అతను దగ్గర్లోని ఒక వర్క్ షాప్ లో పని చేసేవాడు. అందులో శస్త్ర చికిత్సలో వాడే దారం వగైరాలు తయారు చేసేవారు. అతని 60 రూపాయల నెల జీతం 1990లలో రిటైర్ అయ్యే నాటికి 25 వేల రూపాయలు అయ్యింది.







