నొసుముద్దీన్ ఏడుస్తున్నాడు. అతను మొదటిసారిగా అతని స్వంత ఇంటి నుంచి 10-12 కిలోమీటర్లు దూరంగా, తల్లితండ్రులని వదిలి వెళ్తున్నాడు. ఏడేళ్ళ పిల్లాడికి ఇలా ఇంటిని వదిలి దూరంగా వెళ్లపోవడమంటే కష్టమే. “నాకు చాలా బాధ అనిపించి నేను ఏడ్చాను. ఇల్లు వదలడం, కుటుంబాన్ని వదిలి వెళ్లడం అంటే కన్నీళ్ళొచ్చేశాయి నాకు”, అని గుర్తుచేసుకున్నాడు.
అతనిని రాఖాల్ గా (గొడ్లుకాయడానికి) పంపిస్తున్నారు. “మా కుటుంబం చాలా పెద్దది, మా తల్లితండ్రులకి మరి అంతకన్నా దిక్కుతోచలేదు.” అంటాడు 41 ఏళ్ళ నొసుముద్దీన్ షేక్. “మాకు సరిపడా తిండి ఉండేది కాదు. చాలాసార్లు మేము రోజుకు ఒక్క పూటే తినేవాళ్ళము, అది కూడా పొలంలో పిచ్చిగా ఎదిగినది ఏదైనా ఉంటే అదే దిక్కు. ఆ రోజుల్లో ఊర్లో కొందరికి మాత్రమే రోజుకు రెండు పూటలా తిండి దొరికేది.” చదువు అయితే అతని ఊహకు కూడా అందే విషయం కాదు. “అసలు బడి గురించి ఆలోచించే పరిస్థితే లేదు. మా కుటుంబ పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే, ఇక బడి గురించి ఎవరు ఆలోచిస్తారు?”
అందుకని అతను తన గుడిసెని వదిలేసి అప్పటి అస్సాంలో ధుబ్రీ జిల్లాలోని మానుల్లాపరా గ్రామానికి, బస్సులో మూడు రూపాయిల టికెట్టుకు, తన ఊరు ఉరర్భుయిని వదిలి, ఏడు ఆవులు, 12 భీఘాల (దగ్గరగా నాలుగు ఎకరాలు) యజమాని వద్ద పనికి చేరాడు. “నేను ఆ వయసులో చాలా గంటలు పని చేయవలసి వచ్చేది. కొన్నిసార్లు నాకు సరిపడా భోజనం కూడా పెట్టేవారు కాదు. పాచిపోయిన తిండి పెట్టేవారు. నేను ఆకలితో ఏడ్చేవాడిని.” అని నొసుముద్దీన్ గుర్తుచేసుకున్నాడు. “మొదట్లో నాకు ఏమి జీతం ఉండేది కాదు. భోజనం పెట్టి, నిద్రపోవడానికి చోటిచ్చారు అంతే. నా యజమాని మార్చ్ నుండి నవంబర్ వరకు- అంటే ఆ వ్యవసాయ కాలం చివరలో సంవత్సరానికి, 100-120 మోన్ బియ్యం ఇచ్చేవాడు. ఆ తరవాత నాలుగేళ్లకు రెండు మోన్లు ఇచ్చేవారు - అంటే దగ్గరగా 80 కిలోల బియ్యం.”
కొన్ని దశాబ్దాల క్రితం వరకు అస్సాం, మేఘాలయలో ఇలా పిల్లలను రఖాలుగా మార్చి పంపడం, ఒక రివాజుగా నడిచేది. పేదకుటుంబాల నుంచి వారి తల్లితండ్రులు ధనిక రైతులకు ఇలా పిల్లలను “ఇవ్వడం”, తద్వారా వారిని గొడ్లను కాయడానికి “పనికి పెట్టుకోవడం” రివాజు. ఈ పద్ధతిని పేఠ్భట్టి(అంటే అన్నం పెట్టి కడుపు నింపడం అని అర్థం) అనేవారు.











