“బళ్ళో రెండుసార్లు భోజనం పెడితే బాగుండు.”
ఏడేళ్ళ బసవరాజు తెలంగాణలోని శేరిలింగంపల్ల్కి మండలంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్నాడు. ఈ బడి రంగారెడ్డి జిల్లాలో ఉంది. దేశవ్యాప్తంగా బడి పిల్లలకు మధ్యాహ్నభోజనంగా వేడివేడి భోజనాన్ని అందించే 11.2 లక్షల పాఠశాలల్లో ఇదీ ఒకటి. బసవరాజు చదివే బడిలోనే చదువుతున్న పదేళ్ళ అంబిక - బడికి వచ్చేముందు కేవలం ఒక గ్లాసు గంజి తాగి వస్తుంది - వంటి పిల్లలకు కూడా బడిలో పెట్టే ఈ భోజనమే ఆ రోజుకు మొదటి భోజనమవుతుంది.
భారతదేశ మధ్యాహ్న భోజన పథకం ప్రభుత్వ, ప్రభుత్వ-సహాయక పాఠశాలలు, సర్వశిక్షా అభియాన్ మద్దతు ద్వారా నడిచే ప్రభుత్వ-అభ్యాస కేంద్రాలలో 1 నుండి 8వ తరగతి వరకు చదువుతున్న సుమారు 118 మిలియన్ల మంది విద్యార్థులకు- పని దినాలలో ఆహారాన్ని అందజేస్తుంది. ఇందుకు ఎటువంటి డబ్బు చెల్లించనవసరం లేదు. నిండుగా ఉన్న పొట్ట గణిత శాస్త్రపు లెక్కలు చేయడాన్ని సులభతరం చేస్తుందని, అక్షరగుణితంతో కుస్తీ పట్టనవసరం లేదనే విషయాన్నిఎవరూ కాదని వాదించలేరు. అయితే ఈ మధ్యాహ్న భోజనం ప్రాథమికంగా పిల్లలను పాఠశాలకు తీసుకురావాలనే భావనతో మొదలయింది. (కనీసం 150 మిలియన్ల మంది పిల్లలు, యువత భారతదేశంలో అధికారిక విద్యా వ్యవస్థకు దూరంగా ఉన్నారని కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు.)
రాజస్థాన్ రాష్టం, భీల్వారా జిల్లాలోని జోధ్‌గఢ్ గ్రామంలో ఉన్న రాజకీయ ప్రాథమిక్ విద్యాలయలో పదేళ్ళ వయసున్న దక్ష్ భట్‌ను మేం కలిశాం. ఇంటినుంచి బడికి వచ్చేముందు అతను ఆహారంగా తీసుకున్నది కాసిని బిస్కెట్లు మాత్రమే. అక్కడికి వేలాది కిలోమీటర్ల దూరంలో ఉన్న అసోం రాష్ట్రం, నల్‌బారీ జిల్లాకు చెందిన అలీశా బేగమ్ తాను బడికి - నం. 858 నిజ్-ఖ-ఆగతా ఎల్‌పి స్కూల్ - వచ్చేముందు ఒక రోటీ తిని, పాలు కలపని టీ తాగివచ్చానని మాతో చెప్పింది. ఆమె తండ్రి ఒక వీధి వ్యాపారి, తల్లి గృహిణి.


































