వృత్తిపరంగా, వ్యక్తిగతంగా, శారీరకంగా కూడా అబ్దుల్ రెహమాన్ ప్రపంచం అక్షరాలా కుంచించుకుపోయింది. నాలుగు ఖండాలలో కార్మిక సిబ్బందిలో పనిచేసిన ఈ వలస కార్మికుడు, ఇప్పుడు తన ఐదుగురు కుటుంబ సభ్యులతో పాటు 150 చదరపు అడుగుల గదికి పరిమితమయ్యారు.
ఈ ముంబై టాక్సీ డ్రైవర్ - ఈయన తండ్రి దశాబ్దాల క్రితం తమిళనాడు గ్రామీణ ప్రాంతం నుండి ఈ నగరానికి వచ్చారు - గతంలో సౌదీ అరేబియా, దుబాయ్, బ్రిటన్, కెనడా, ఇండోనేషియా, మలేషియా, ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాల్లో బుల్డోజర్లను, కార్లను నడిపారు. ఈ రోజు ఆయన్ని, మాహిమ్ స్లమ్ కాలనీలోని ఇరుకైన సందులోంచి సాయన్‌లోని ఆసుపత్రికి తీసుకెళ్ళే టాక్సీ దగ్గరకు, కుర్చీలో కూర్చోబెట్టి మళ్ళీ మళ్ళీ మోసుకునిపోవాలి.
ఆసుపత్రికి వెళ్లే సమయం వచ్చినప్పుడు, రెహమాన్ తన గది నుండి కిందికి దిగేందుకు సిద్ధమవుతారు. నిచ్చెన బయట తలుపు దగ్గర ఉంటుంది. నేలపై కూర్చుని ఉన్న ఆయన్ని కొడుకు కాళ్ళ క్రింద చేయివేసి పట్టుకుంటే, ఒక మేనల్లుడో లేదా పొరుగువాడో పై నుండి ఆయనకు ఆసరా ఇస్తారు. రెహమాన్ అప్పుడు తొమ్మిది ఏటవాలు మెట్ల మీదుగా ఒక్కొక్క అడుగే బాధాకరంగా వేస్తూ, నెమ్మదిగా క్రిందికి దిగుతారు.
దిగువనున్న ఇరుకైన సందులో, పెయింట్ మరకలు పడిన ఒక పాత ప్లాస్టిక్ కుర్చీ ఉంటుంది. పాదం తొలగించబడిన అతని కుడి కాలు ఆ కుర్చీ సీటుపై ఉండేలా ఆయన్ని కూర్చోపెడతారు. అప్పుడు అతని కొడుకు, మరో ఇద్దరు కలిసి ఆ కుర్చీని పొడవుగా, వంకరటింకర్లుగా ఉన్న ఆ సందు వెంట, మాహిమ్ బస్ డిపో సమీపంలోని రహదారి వైపుకు మోసుకువెళ్తారు. అక్కడ, రెహమాన్ కుర్చీలోంచి టాక్సీలోకి మారతారు.
కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న సాయన్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి టాక్సీ ఛార్జీలు ఆయన భరించగలిగే దానికంటే ఎక్కువే. అయినప్పటికీ, గత సంవత్సరంలో నెలల తరబడి ఆయన తన పాదాలకు కట్టు కట్టించుకోడానికి ప్రతి వారం అక్కడికి వెళ్లవలసి వచ్చింది. ఇప్పుడు గాయం కొంచెం మానిన తర్వాత, ఆసుపత్రికి వెళ్ళిరావడం కొంత తగ్గింది. అయినా అప్పుడప్పుడూ ఉత్తర ముంబైలోని మోరీ రోడ్‌కి దూరంగా, ఇరువైపులా రెండు-మూడు అంచెలుగా ఒకదానిపై ఒకటి ఎక్కినట్టున్న ఇరుకైన గదులున్న కాలనీలో నుంచి, సన్నని సందుగొందుల గుండా ఆ కుర్చీలో ఊరేగింపు జరుగుతూనే ఉంది.














