రామకుండ - ఇది బహుశా గోదావరి నది మీద వున్న అత్యంత పవిత్రమైన ఘాట్ (స్నానఘట్టం) కావొచ్చు. ఆ ఘాట్ అంచున అతను ప్రార్థిస్తున్నవాడి భంగిమలో నిలబడివున్నాడు. అలాగే ముందుకు వంగుతూ కిందికి వెళ్ళి, స్నానం చేశాడు- ట్యాంకర్‌లోని పవిత్ర జలాలతో.
పవిత్ర గోదావరి పురిటి గడ్డ మహారాష్ట్ర నీటి సంక్షోభానికి స్వాగతం
గడిచిన 139 ఏళ్లగా ఎండిపోని ఆ చారిత్రిక రామకుండ ఘాట్ మొట్టమొదటిసారిగా ఈ ఏప్రిల్‌లో ఎండిపోయింది. అప్పటి నుంచి రెండు నెలలుగా రోజుకి 60-90 ట్యాంకర్ల నీటిని ఆ కుండా (గుండం)లో పోసి దాంట్లో నీళ్లు వుండేట్టుగా చేస్తున్నారు. క్లుప్తంగా చెప్పాలంటే, మహారాష్ట్ర ట్యాంకర్లతో నీటిని తెచ్చి నదిలో పోస్తోంది. గోదావరి నది పరిస్థితి కష్టంగా వుంది. నది చాలా చోట్ల ఎండిపోయింది. గోదావరి నది ఇలా ఎండిపోవడం ఎన్నడూ విననిదీ చూడనిదీ. మే నెల వచ్చేసరికి, నాశిక్‌లోని త్రయంబక్ పట్టణానికి ఎగువన ఉన్న బ్రహ్మగిరి పర్వతాలలోని దాని మూలం వద్ద సన్నని ధారగా మాత్రమే మిగిలింది. (నది జన్మస్థలాన్ని పవిత్రం చేసే త్రయంబకేశ్వర్ ఆలయం పేరుతోనే ఆ ప్రాంతాన్ని పిలుస్తుంటారు.) రుతుపవనాల రాకతో పరిస్థితిలో మార్పు వస్తుందని స్థానిక ప్రజలు ఆశతో వున్నారు.






