"కొన్నిసార్లు, కండోమ్ ప్యాకెట్ కోసం ఎవరో ఒక మహిళ నాకు కాల్ చేయటమో లేదా రాత్రివేళ ఎవరైనా మగ బంధువును నా ఇంటికి పంపటమో చేస్తుంది," అని కళావతి సోని చెప్పారు. మహిళలకు అవసరమైన వస్తువులను సరఫరా చేసే టిక్రీ గ్రామానికి చెందిన ఈ 54 ఏళ్ల ‘డిపో దీదీ’ని ఈ వేళ కాని వేళలో పిలిచే పిలుపులు ఏమాత్రం ఇబ్బంది పెట్టవు. "రాత్రిపూట కూడా నేను తెరిచే ఉంటాను" అని ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ జిల్లాలోఉండే ఈ గ్రామంలోని తన చిన్న ఇంటి వరండాలో చార్‌పాయ్(మంచం)పై కూర్చొని ఉన్న ఆమె సరదాగా చెప్పారు. "ఇత్నీ కోయి బడి బాత్ నహీ హై (ఇదేమంత పెద్ద విషయం కాదు)," అంటారు కళావతి తన పని గురించి చెప్తూ.
ఆ గ్రామంలో పనిచేస్తున్న ఒక ఎన్‌జిఒ(ప్రభుత్వేతర సంస్థ) ద్వారా ఈ'డిపో దీదీ' గురించి విన్న మేము కేవలం కుతూహలంతో ఆమె ఇంటికి చేరుకున్నాం. "ఏయ్, వెళ్ళి ఆ సంచి తీసుకురా," అని కళావతి తన మనవడిని పిలిచారు. కొన్ని క్షణాల్లోనే, ఆ రెండంతస్తుల పక్కా ఇంటి లోపల నుండి ఒక నిండుగా ఉన్న ప్లాస్టిక్ సంచీని పట్టుకుని పరుగెత్తుకుంటూ వచ్చాడు ఆ చిన్నోడు. కండోమ్‌లు, శానిటరీ నాప్‌కిన్‌లు, గర్భనిరోధక మాత్రలు, ఓరల్ రీహైడ్రేషన్ ప్యాకెట్లు- ఇవన్నీ ఆ సంచిలోనుండి కిందికి దొర్లాయి. ఆమె వాటిని ప్రదర్శనలో ఉంచుతున్నట్లుగా, ఆ మంచంపై వరుసగా పేరుస్తున్నారు.
"ఇత్నీ కోయి బడి బాత్ నహీ హై (ఇందులో పెద్ద విషయమేమీ లేదు)," అదేం పెద్ద విషయం కాదన్నట్టుగా ఆమె చెప్పారు. “మొదట నేను చిన్నగా ఇంటి విషయాల గురించి మాట్లాడేదాన్ని. మేం వాళ్ళ ఇంటి పరిస్థితిని గురించీ, అత్తగార్ల గురించి వచ్చే ఫిర్యాదుల గురించీ, పిల్లల గురించీ కాస్త చర్చించుకునేవాళ్ళం. నేను ఓపికగా వినేదాన్ని. ఈ సంభాషణల ద్వారా - మీరు చూస్తూనే వున్నారుకదా, నేను చాలా వాగుడుకాయని - మహిళలందరూ ఒకే రకం సమస్యలను ఎదుర్కొంటున్నారని నేను నెమ్మదిగా గ్రహించడం ప్రారంభించాను. అలాంటప్పుడు ఒకరికొకరు ఎందుకు సహాయం చేసుకోకూడదు? ఇంకంతే,” అంటూ, తాను టిక్రీ ‘డిపో దీదీ’ పాత్రను ఎలా పోషించవలసివచ్చిందో వివరించారామె.
అందరూ ఆమెను పిలిచే డిపో దీదీ అనే పేరు 'డిపో హోల్డర్' నుండి వచ్చింది. ఇది సమాజంలోని మహిళలకు అవసరమైన వస్తువులను పంపిణీ చేస్తూ, మంచి ఆరోగ్య పద్ధతులను అవలంబించేలా ప్రోత్సహించే ఆరోగ్య రంగానికి సంబంధించిన పదం. కానీ కళావతి గ్రామాల్లో అధికారికంగా డిపో హోల్డర్‌లుగా పనిచేస్తున్న అంగన్వాడీ వర్కర్, లేదా గుర్తింపు పొందిన సామాజిక ఆరోగ్య కార్యకర్త (ఆశా) కానీ కాదు. ఆమెఝోలా చాప్ (లైసెన్స్ లేకుండా వైద్యం చేసేవారు) కూడా కాదు. ప్రాథమిక పునరుత్పత్తి ఆరోగ్య సంరక్షణ అవసరాల కోసం మహిళలకు అవసరమయ్యే దాదాపు ప్రతిదానినీ ఆమె నిల్వ చేస్తారు; వారి లైంగిక, పునరుత్పత్తికి సంబంధించిన ఆందోళనల గురించి కూడా ఆమె వారితో మాట్లాడతారు.







