ఆదివాసీ ప్రజలకు తమ సొంత సమస్యలున్నాయి కానీ, వాళ్ళు ఒక సమూహంలోని సంస్కృతిలోకి ఎలా ప్రవేశించారన్నది గమనించడం ముఖ్యం. ఉదాహరణకు, ఆధునిక విద్య ఒక కొత్త పోకడను తీసుకువచ్చింది. మేం ఎదుర్కొంటున్న సంఘర్షణల్లో చాలా వరకు కొత్తగా అక్షరాస్యులైన వారి ద్వారానే వస్తున్నాయి. ఈనాడు మా వూళ్ళో ఒక ఉపాధ్యాయుడు ఈ ఊరి మట్టిమీద ఇల్లు నిర్మించుకోవడానికి వెనకాడతాడు. అతడు రాజ్ పీపలాలో స్థలం కొనుగోలు చేస్తాడు. యువతరం అభివృద్ధిగా భ్రమింపజేసే కొన్ని ఆకర్షణీయమైన భావనల పట్ల యిష్టం చూపుతోంది. తమ నేలలోంచి పెకిలించి వేరొక నేలలో నాటబడ్డ వీరు, సంప్రదాయ పద్దతిలో జీవించడం లేదు. వీరు ఎర్రబియ్యపన్నం తిని జీర్ణం చేసుకోలేరు. నగర ఉద్యోగం ద్వారా లభించే హోదాను రుచి చూడాలని కోరుకుంటున్నారు. యిట్లాంటి బానిస మనస్తత్వం మా సంస్కృతిలో ఎన్నడూ ఒక భాగంగా లేదు. వాళ్ళకిపుడు చదువూ ఉద్యోగమూ ఉన్నాకూడా నగరాలలో ఉండడానికి చోటు దొరకడం లేదు. అక్కడి ప్రజలు వీరిని వేరుగా చూస్తారు. కాబట్టి, యిట్లాంటి సంఘర్షణలు రాకుండా చూసుకునేందుకు వారు తమ గుర్తింపును దాచి పెడుతున్నారు. ఈనాడు ఆదివాసీ అస్తిత్వమే ఎన్నో సంఘర్షణలతో కూడి ఉన్నది.
అనాగరిక మహువా
ఉన్నతులనబడే నా దేశస్థులు కొందరు
మహూవా
ను అనాగరికమైనదిగా నిర్ధారించినందున
నావాళ్ళు కూడా తాము అనాగరికులమని
భావించడం మొదలుపెట్టారు.
అప్పట్నుంచి, అమ్మ
మహువా
పూలను
ముట్టుకోవడానికే భయపడుతోంది.
నాన్నయితే
మహువా
అన్న పేరునే ద్వేషిస్తున్నాడు.
పెరట్లో
మహూవా
కు బదులుగా ఒక
తులసి
మొక్కను నాటిన
నా సోదరుడు, సంస్కారవంతునిగా భావించుకొంటున్నాడు.
ఉన్నతులనబడే నా దేశస్థులు కొందరు
మహూవా
ను అనాగరికమైనదిగా నిర్ధారించినందున
నావాళ్ళు కూడా తాము అనాగరికులమని
భావించడం మొదలుపెట్టారు.
ఆధ్యాత్మికంగా జీవించే నావాళ్ళు
యిప్పుడు నదిని పవిత్రమైనదిగా ఎంచడానికి సిగ్గుపడుతున్నారు
పర్వతాలను పూజించడానికి
పూర్వీకుల అడుగుజాడల్లో నడవడానికి
ఆఖరుకు ఈ నేలను
అమ్మా
అని పిలవడానికీ సిగ్గుపడుతున్నారు.
తమ అనాగరికత నుంచి స్వేచ్ఛ పొందడానికి
తమ నిజమైన గుర్తింపును దాచేస్తూ
కొందరు క్రైస్తవం స్వీకరిస్తున్నారు
కొందరు హిందువులుగా మారుతున్నారు
కొందరు జైనులుగా మరికొందరు ముస్లిములుగా మారుతున్నారు.
ఉన్నతులనబడే నా దేశస్థులు కొందరు
మహూవా
ను అనాగరికమైనదిగా నిర్ధారించినందున
నావాళ్ళు కూడా తాము అనాగరికులమని
భావించడం మొదలుపెట్టారు.
ఒకప్పుడు మార్కెట్లను ద్వేషించిన నావాళ్ళు
యిప్పుడు వాటిని తమ ఇళ్ళలోకే తీసుకొస్తున్నారు
నాగరికమనిపించే ఏ ఒక్క వస్తువునీ వాళ్ళు చేజారనివ్వరు.
నాగరికత యొక్క అతిపెద్ద ఆవిష్కరణ - వ్యక్తివాదం.
ప్రతిఒక్కరూ ‘నేను’ అన్నది నేర్చుకుంటున్నారు
వాళ్ళకు ‘స్వ’ అంటే అర్థమవుతున్నది,
సమాజ ‘స్వ’ గా కాదు,
‘స్వార్థం’ స్వ గా.
ఉన్నతులనబడే నా దేశస్థులు కొందరు
మహూవా
ను అనాగరికమైనదిగా నిర్ధారించినందున
నావాళ్ళు కూడా తాము అనాగరికులమని
భావించడం మొదలుపెట్టారు.
కథలను గానం చేసి, సొంతంగా
ఇతిహాసాలు రచించే నావాళ్ళు,
యిప్పుడు తమ భాషనే మర్చిపోతున్నారు.
బదులుగా తమ పిల్లలకు ఆంగ్లాన్ని నేర్పిస్తున్నారు
వాళ్ళ పిల్లల కలలనిండా అమెరికానో లండనో ఉంటుందిగానీ,
ఈ నేలమీది మొక్కలకు, చెట్లకు, నదులకు, కొండలకూ వారి కలల్లోనయినా చోటులేదు
ఉన్నతులనబడే నా దేశస్థులు కొందరు
మహూవా
ను అనాగరికమైనదిగా నిర్ధారించినందున
నావాళ్ళు కూడా తాము అనాగరికులమని
భావించడం మొదలుపెట్టారు.
అనువాదం: కె. నవీన్ కుమార్