"నేను చనిపోయినా ఫర్వాలేదు, కాని మనం బిల్లు మాత్రం భరించలేము" అని చనిపోయే రెండు రోజుల ముందు హరిశ్చంద్ర ధావరే తన భార్య జయశ్రీతో చెప్పారు. కోవిడ్ -19 కారణంగా 48 ఏళ్ల జర్నలిస్ట్ ఆరోగ్యం క్లిష్టంగా మారింది, అందుకని అతన్ని వెంటిలేటర్ మీద ఉంచారు.
అప్పుడు కూడా, అతని ఆందోళన తన సొంత జీవితం కోసం కాదు. ఆసుపత్రి బిల్లుల గురించే! "అతను నాతో దెబ్బలాడి కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇంటికి వెళ్ళిపోదామని పట్టుబట్టాడు." అని 38 ఏళ్ల జయశ్రీ గుర్తు చేసుకుంది.
2021 మార్చి చివరలో కరోనా వైరస్ హరిశ్చంద్రకు సోకినప్పుడు జర్నలిస్టుగా ఇరవై సంవత్సరాల అతని అనుభవం అతని అక్కరలోకి రాలేదు. పైగా అతని ఉద్యోగమే అతనిని ప్రమాదంలోకి తోసింది.
మహారాష్ట్రలోని ఉస్మానాబాద్ జిల్లాలో వార్తా సంస్థల కోసం 2001 ఆరంభం నుండి విలేకరిగా పనిచేస్తున్న హరిశ్చంద్ర చివరిగా మరాఠీ దినపత్రిక రాజధర్మ లో పనిచేశాడు. "అతను కోవిడ్ -19 యొక్క రెండవ తరంగంపై పై నివేదికలు పంపుతున్నాడు. తరచూ ప్రెస్ కాన్ఫరెన్స్ లకు వెళ్లడం, ఫీల్డ్ లో తిరగడం చేసేవాడు”అని జయశ్రీ చెప్పారు. "అతను ఇంటి నుంచి బయటికి అడుగుపెట్టిన ప్రతిసారీ మేము కంగారు పడుతూనే ఉన్నాము . అతనికి రక్తపోటు, చక్కెర వ్యాధి [డయాబెటిస్] ఉన్నాయి. కానీ తను పని చేయవలసి ఉంటుందని చెప్పాడు.”
మార్చి 22 న, ధావరే కు ఒళ్లు నొప్పులు, జ్వరం తోపాటు కోవిడ్ లక్షణాలు కనిపించడం మొదలయ్యాయి. "అతని ఆరోగ్యం మెరుగుపడకపోయేసరికి, మేము అతన్ని పట్టణంలోని సివిల్ ఆసుపత్రికి తీసుకువెళ్ళాము" అని జయశ్రీ చెప్పారు. పరీక్షలో కోవిడ్ పాజిటివ్ అని వచ్చాక అతనిని ఆసుపత్రిలో చేర్చుకున్నారు. "అక్కడ పెద్దగా సౌకర్యాలు లేవు, ఆరోగ్యం లో మార్పు కూడా ఏమీ లేదు" అని చెప్పింది జయశ్రీ. అందుకని మార్చి 31 న అతనిని 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న సోలాపూర్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించాలని అతని కుటుంబం నిర్ణయించింది.
అక్కడ ఆరు రోజుల ఉన్న తర్వాత , ఏప్రిల్ 6న ధావరే చనిపోయాడు.









