“చాలూ, చాలూ (వస్తోంది, వస్తోంది), పుట్టబోయే బిడ్డ జనన కాలువ (యోని) వైపుకు వెళ్ళడానికి నేను సహాయం చేస్తున్నాను.”
ఒక దాయిగా (మంత్రసాని), పసి పిల్లలను ఈ ప్రపంచంలోకి తీసుకువచ్చిన రోజులను గుర్తుచేసుకున్నప్పుడు, గుణామాయ్ మనోహర్ కాంబ్లే కళ్ళు మెరిశాయి. ఎనభై ఆరు సంవత్సరాలు అలా గడిచిపోయాయి. మరోసారి ఒక అప్రమత్తమైన, శ్రద్ధగల మంత్రసానిగా ఆమె కనబడ్డారు. జనన కాలువ నుండి శిశువు బైటికొచ్చే ప్రక్రియను వివరిస్తూ, ఆమె ఇలా అన్నారు, “హాతాత్ కాకణఁ ఘాలతో నా, అగదీ తసఁ! (మనం గాజులు ఎలా వేసుకుంటామో, అలాగే!)." ఆమె సంజ్ఞలు చేస్తున్నప్పుడు, తన మణికట్టు మీద ఎర్రటి మట్టి గాజులు తళుక్కుమన్నాయి.
మహిళలకు ప్రసవంలో సహాయం చేయడం ప్రారంభించిన గత ఏడు దశాబ్దాలలో, వాగ్దరీ గ్రామంలో నివాసముండే దళిత మహిళ గుణామాయ్, ఉస్మానాబాద్ జిల్లాలో వందలాది మంది పిల్లలను వారి తల్లుల కడుపు నుండి సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. “ఇది తన చేతుల మాయాజాల”మని ఆ అనుభవజ్ఞురాలు తెలిపారు. ఆమె నాలుగేళ్ల క్రితం, తన 82వ ఏట, చివరిసారిగా ఒక బిడ్డకు జీవం పోశారు. “నేను ఎప్పుడూ విఫలం కాలేదు. దేవుడు నాతో ఉన్నాడు,” ఆవిడ గర్వపడ్డారు.
సోలాపూర్ సివిల్ హాస్పిటల్‌లో జరిగిన ఒక సంఘటనను గుణామాయ్ కూతురు వందన గుర్తుచేసుకున్నారు. సిజేరియన్ చేయాల్సిన అవసరం లేకుండా, ముగ్గురు పిల్లలను ఎలా బైటికి తీస్తానో చూడమని వైద్యులతో తన తల్లి అన్న సంఘటన అది. “మీరు మా కన్నా ఎక్కువ నేర్పు కలిగినవారు ఆజీ (అమ్మమ్మ)’ అన్నారు వాళ్ళు.” వారి ఆశ్చర్యాన్ని, విస్మయాన్ని గుర్తు చేసుకుంటూ గుణామాయ్ ముసిముసి నవ్వులు నవ్వారు.
సుఖ ప్రసవం చేసి బిడ్డకు జీవం పోయడంలో మాత్రమే ఆమె నైపుణ్యం లేదు. మహారాష్ట్రలోని సోలాపూర్, కొల్హాపూర్, పుణే వంటి ప్రాంతాల నుండి ఆమెకుపిలుపులు వచ్చేవి. “పిల్లల కళ్ళు, చెవులు లేదా ముక్కులో కొన్నిసార్లు ఇరుక్కుపోయే వస్తువులను తొలగించడంలో మా అమ్మమ్మ సిద్ధహస్తురాలు. విత్తనమైనా, పూస అయినా ఇరుక్కుపోతే, దానిని తీయడానికి జనం తమ బిడ్డలను మా అమ్మమ్మ వద్దకు తీసుకువస్తారు,” కొన్ని నెలల క్రితం వాళ్ళని కలిసినప్పుడు, గుణామాయ్ మనవరాలు శ్రీదేవి PARI తో గర్వంగా అన్నారు. కడుపు నొప్పులు, కామెర్లు, జలుబు, దగ్గు, జ్వరం లాంటి వాటికి మూలికా వైద్యం అందించడం కూడా ఒక దాయిగా తన పనిలో భాగంగా ఆవిడ భావించారు.









