వ్యవసాయ కూలీగా 70 సంవత్సరాలు పనిచేసిన తర్వాత, ఇప్పుడు 83 ఏళ్ల వయసున్న గంగప్ప తనను తాను మహాత్మా గాంధీగా మార్చుకున్నారు. ఆగస్టు 2016 నుండి అతను గాంధీలా వేషం వేసుకొని పశ్చిమ ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం పట్టణంలో బహిరంగ ప్రదేశాల్లో నిలబడుతున్నారు. ఈ విధంగా అతనికి లభించే భిక్ష అతను వ్యవసాయ కూలీగా సంపాదించిన దానికంటే మంచి ఆదాయాన్నిస్తోంది.

"నేను మీ వయసుకి చేరినప్పుడు, నేను కూడా మీలాగే దుస్తులు ధరిస్తాను స్వామీ," అని గాంధీజీ అనంతపురంను సందర్శించినపుడు చిన్నపిల్లవాడిగా ఉన్న తాను ఆయనతో చెప్పినట్లు గంగప్ప చెప్పుకుంటారు. "ఆ సమయంలో నేను పేరూరు చెరువు నిర్మాణంలో కూలీలుగా పనిచేస్తున్న నా తల్లితండ్రులతో ఉన్నాను." గంగప్ప పుట్టిన చెన్నంపల్లి పేరూరుకు ఎంతో దూరంలో లేదు. గాంధీకి ఉన్న అనుకున్నది సాధించగల శక్తి, గొప్ప వ్యక్తులను సైతం ఆజ్ఞాపించగల సామర్థ్యం యువ గంగప్పను ఆకట్టుకున్నాయి.

తాను మహాత్మా గాంధీని కలిసినట్టుగా గంగప్ప చెప్పిన విషయాన్ని ధృవీకరించడం గానీ, అది జరిగిన తేదీని పేర్కొనడం గానీ కష్టమే అయినప్పటికీ, గాంధీ గురించిన జ్ఞాపకమే గంగప్ప జీవితాన్ని నడిపించింది. గంగప్పకు ప్రయాణాలంటే ఇష్టం - గాంధీలా మారడానికి ప్రయాణాలు చేయడం, ఓర్పుగా ఉండటం చాలా అవసరమని గంగప్ప నమ్ముతారు.

ఇప్పుడు గంగప్ప (అసలు పేరు ఇదే) తన పేరును గంగులప్ప అని చెప్పుకుంటారు. ఎందుకంటే జనం పొరపాటున ఆయన్ని అదే పేరుతో పిలుస్తున్నారు. తన గాంధీ వేషధారణకు బలం ఇచ్చేందుకు ఆయన ఛాతీకి అడ్డంగా జంధ్యాన్ని వేసుకుంటారు. గాంధీ వేషధారణలో ఉన్నపుడు తన నుదిటి పైనా, పాదాల పైనా కుంకుమ పెట్టుకొని, అప్పుడప్పుడూ తన చేతిని ఎత్తి ప్రజలను దీవిస్తూ, 'పూజారి'లా వ్యవహరిస్తుంటారు.

PHOTO • Rahul M.

తన కుటుంబంతో- గంగప్పతో విడిపోయిన అతని భార్య మిద్ది అంజనమ్మ (ఎడమ నుంచి మూడవవారు)

కొత్తగా వచ్చిన కుల గుర్తింపు ద్వారా అతనికి స్థానికంగా ఉన్న ఒక గుడిలోకి ప్రవేశం లభించింది. పగటిపూట ఆ గుడి ఆవరణలోని రాతి బెంచీపై విశ్రాంతి తీసుకోవడానికి అనుమతించారు. అతను ఆ గుడిలోని కుళాయిల వద్ద స్నానం చేసి, తన మేకప్‌ను కడుక్కుంటుంటారు.

గంగప్పకు అతని భార్య మిద్ది అంజనమ్మతోనూ, ఆమె కుటుంబంతోనూ ఒక దశాబ్ద కాలంగా సరైన సంబంధ భాందవ్యాలు లేవు. అప్పుడే వాళ్ల పెద్ద కూతురు ఆత్మహత్య చేసుకుంది. “నేను కొల్లపల్లి అడవిలో గుంతలు తవ్వడానికి వెళ్లాను. ఇంటికి తిరిగి వచ్చేసరికి నా కూతురు చనిపోయింది,” అంటూ తన కూతురిని గుర్తు చేసుకుని ఆమె కన్నీళ్ళు పెట్టుకున్నారు. “నా కూతురు ఎందుకు చనిపోయిందో నాకు ఇప్పటికీ తెలియదు, ఆమె ఎందుకు చనిపోయిందో ఎవరూ చెప్పలేదు కూడా. ఇంక నేను ఆ కుటుంబంలోకి ఎలా తిరిగి వెళ్ళగలను?"

అంజనమ్మ రెండేళ్లుగా గంగప్పతో మాట్లాడకపోయినా, అతని అనూహ్యమైన తీరును అసహ్యించుకున్నప్పటికీ, అతను లేని లోటును అనుభవిస్తున్నారు. ఇప్పుడతను తిరిగి రావాలని ఆమె కోరుకుంటున్నారు. “దయచేసి అతన్ని తిరిగి రమ్మని చెప్పండి. నా దగ్గర మొబైల్ ఫోన్ గానీ, నెలకు కాఫీ పొడి కొనడానికి డబ్బులు గానీ లేవు. పిల్లలు (వారి చిన్న కూతురికి ఇద్దరు కొడుకులు) నన్నడిగినప్పుడు వాళ్ళకివ్వడానికి నా దగ్గర చిల్లర డబ్బులు కూడా ఉండటంలేదు." అన్నారు అంజనమ్మ, నేనామెను కలిసినప్పుడు. ప్రస్తుతం అంజనమ్మ అనంతపురం నుండి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న గోరంట్ల అనే పల్లెలో వారి చిన్న కూతురితో కలిసి నివసిస్తున్నారు.

PHOTO • Rahul M.

ఎడమ: డబ్బు సంపాదించడం కోసం గంగప్ప పల్లెల్లో పట్టణాలలో జరిగే జాతరలకూ, సంతలకూ వెళుతుంటారు. కుడి: అతను తన మేకప్‌ను, వేషధారణనూ చూసుకోవడానికి తనకు ఎక్కడో దొరికిన బైక్ అద్దాన్ని ఉపయోగిస్తారు

గంగప్ప ఇంటి నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా పొలాల్లో కూలి పనులు చేస్తూనే ఉన్నారు. అతను మరింత ఎక్కువగా మద్యం తాగడం మొదలుపెట్టారు. 2016లో పొలాల్లో పనిచేస్తుండగా స్పృహతప్పి పడిపోయారు. "మాల పున్నమి (సంవత్సరాది) తర్వాత నేను వ్యవసాయ కూలీ పనులు చేయడం మానేశాను" అని గంగప్ప గుర్తుచేసుకున్నారు. "కొద్ది రోజులు తాళ్ళు అల్లే పని చేశాను కానీ ఆ పని ద్వారా పెద్దగా డబ్బులు రాలేదు."

ఆ సమయంలోనే అతనికి గాంధీజీ గురించిన తన జ్ఞాపకం గుర్తుకువచ్చి తనను తాను కొత్తగా మార్చుకోవాలని నిర్ణయించుకున్నారు.

గంగప్ప తన గాంధీ వేషధారణను రోజువారీ వస్తువులను ఉపయోగించే చేసుకొనేవారు. తనను తాను మహాత్ముడిలా 'ప్రకాశించేలా' చూసుకునేందుకు 10 రూపాయలకు ఒక ప్లాస్టిక్ డబ్బాలో దొరికే పాండ్స్ పౌడర్‌ను ఉపయోగించేవారు. రోడ్డు పక్కనే ఉన్న దుకాణం నుండి కొనుగోలు చేసిన చవకరకం సన్ గ్లాసెస్ అతని గాంధీ కళ్ళద్దాలు. స్థానిక మార్కెట్ నుండి 10 రూపాయలకు కొన్న వెదురుకర్ర అతని చేతి కర్ర. అతను తన మేకప్‌ను, వేషధారణను సరిచూసుకోవడానికి ఎక్కడో దొరికిన మోటార్‌ బైక్ అద్దాన్ని ఉపయోగించేవారు.

పొలాల్లో పనిచేసేటప్పుడు గంగప్ప ఎక్కువగా కురచగా ఉండే చల్లాడము (shorts) వేసుకునేవారు. "ఇప్పుడు నేను ధోవతి కట్టుకుంటాను, మూడు లేదా నాలుగు రోజులకు ఒకసారి గుండు చేయించుకుంటాను," అని అతను చెప్పారు. పొగ తాగటం, మందు తాగే అలవాటు ఉన్నప్పటికీ, గాంధీ వేషం వేసుకున్నప్పుడు మాత్రం నిష్ఠగా ఉండేలా చూసుకుంటారు. చుట్టుపక్కల పల్లెల్లో, పట్టణాల్లో జరిగే జాతరలకు, నెలవారీ సంతలకు తిరుగుతూ రోజుకు 150-600 రూపాయల వరకూ సంపాదిస్తారు. "నేను ఇటీవల ఒక పరష (గ్రామ జాతర)లో ఒక్క రోజులో సుమారు 1,000 రూపాయలు సంపాదించాను," అని అతను గర్వంగా చెప్పారు.

a man refashioned as Mahatma Gandhi
PHOTO • Rahul M.
a man and a woman
PHOTO • Rahul M.

ఎడమ: గంగప్ప తన రూపాన్ని మార్చుకోవడం వల్ల అతనికి కొన్ని తలుపులు తెరుచుకున్నాయి. కుడి: నిలకడలేని అతని ప్రయాణాల సహచరి కురుబ పూజమ్మ, ఇప్పుడు తన దారి తాను చూసుకున్నారు

"ఈ రోజు కదిరి పున్నమి కాబట్టి నేను ఆరు గంటలపాటు అదేపనిగా నిలబడ్డాను," అని ఆయన చెప్పారు. ఈ పండుగను అనంతపురం జిల్లాలోని కదిరి ప్రాంతంలోని పల్లెల్లో సంవత్సరానికి ఒకసారి ఒక నిండు పౌర్ణమి నాడు జరుపుకుంటారు.

కొన్ని నెలల కిందట, సమీపంలోని పుట్టపర్తి పట్టణానికి వెళుతున్నప్పుడు, పుట్టపర్తికి పెనుకొండకి మధ్యనున్న 35 కిలోమీటర్ల మార్గంలో భిక్షం ఎత్తుకునే 70 ఏళ్ల ఒంటరి మహిళ కురుబ పూజమ్మను కలిశారు గంగప్ప. "ఒక రోజు  సాయంత్రం నేను ఇంటికి వెళుతున్నప్పుడు, అతను ఒంటరిగా కూర్చొనివుండటం చూశాను" అని ఆమె చెప్పారు. "ఏం చేస్తుంటావని నేనతన్ని అడిగాను. అతను చెప్పాడు, నాతో పాటు వస్తావా అని నన్ను అడిగాడు. నేను ఒప్పుకున్నాను. అతను, 'నాతో రా. మనం ఎక్కడికెళ్ళినా, దారిన కనపడే ప్రదేశాలన్నీ నీకు చూపిస్తా’నని అన్నాడు." అప్పటి నుండి పూజమ్మ గంగప్పతో పాటు ప్రయాణిస్తూ, అతని గాంధీ వేషధారణకు సహాయం చేస్తూ, అతని వెనుకభాగంలో పౌడర్ రాస్తూ, అతని బట్టలు ఉతుకుతూ, కాలిబాటన అతన్ని అనుసరిస్తున్నారు..

గంగప్పతో పూజమ్మ భాగస్వామ్యం అంత తేలికగా ఏంలేదు. "ఒక రాతిరి అతను ఎక్కడికో వెళ్ళాడు, చాలాసేపటి వరకు తిరిగి రాలేదు. నేను ఒంటరిగా ఉన్నాను, నిజంగా భయమేసింది. అక్కడకు దగ్గరలోనే జనం ఉన్నారు, నేనొక రేకుల కప్పు కింద కూర్చునివున్నాను. ఏం చేయాలో నాకు తోచలేదు. నాకంటూ ఎవరూ లేకపోవడంతో ఏడవాలనిపించింది. అతను చాలా సేపటికి రాత్రిభోజనంతో తిరిగి వచ్చాడు!”

PHOTO • Rahul M.

పల్లెలో జరిగే జాతరకి సిద్ధమవుతున్నారు: గంగప్పకు గాంధీ 'వేషధారణ'లో సహాయం చేస్తోన్న పూజమ్మ. అతని వీపుపై పౌడర్ రాస్తూ... కొంత మేకప్‌ని గంగప్ప స్వంతంగా చేసుకుంటారు

గంగప్ప, పూజమ్మలు కలిసి అనంతపురం పట్టణం శివారులో, హైవేకి సమీపంగా నివసిస్తున్నారు. గాంధీని ఆరాధించే ఒక వ్యక్తికి చెందిన ఫలాహారశాల బయట వీళ్ళు పడుకుంటారు. గంగప్ప సాధారణంగా ఉదయం 5 గంటలకు నిద్రలేచి, రాతిరి 9 గంటలకు పడుకుంటారు. పొలంపని చేసేటప్పటి నుండి అతనికి ఇదే అలవాటు.

కొన్నిసార్లు గంగప్పకు అతను పడుకునే ఫలాహారశాలవాళ్ళు భోజనం పెడుతుంటారు. అతను రోడ్డు పక్కన ఉన్న దుకాణాల నుండి అల్పాహారం కొనుక్కుని తింటారు, అలాంటప్పుడు మధ్యాహ్న భోజనం మానేస్తారు. పూజమ్మ కూడా చక్కగా తినేలా గంగప్ప చూసుకుంటారు. కడుపునిండా మంచి భోజనం తినాలని అనిపించినప్పుడు అతను రాగులు, బియ్యం, చికెన్ కొనితెస్తారు. పూజమ్మ రోడ్డుపై తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్న పొయ్యిపై రాగి ముద్ద (రాగి పిండి, బియ్యం కలిపి వండే సంగటి ముద్ద. ఇది రాయలసీమలో ప్రధాన ఆహారం), కోడి కూరను వండి విందు భోజనం తయారుచేస్తారు.

ఇది చాలా సాధారణమైన జీవితమే అయినప్పటికీ మునుపటి కంటే మెరుగైన జీవితం. గాంధీగా ఉండటమంటే ఆయన ఇకపై తన భోజనం గురించీ, వసతి గురించీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని. అయితే, ఈ రోజుల్లో గాంధీని అందరూ గౌరవించడం లేదని గంగప్ప బాధపడ్డారు. వాళ్ళెందుకలా చేస్తున్నారు? "కొంతమంది యువకులు నా దగ్గరకు వచ్చి గాంధీలాగా దుస్తులు ధరించడం మానేయమని చెప్పారు. ప్రభుత్వం ఇప్పుడు రూపాయల నోట్ల మీది గాంధీ బొమ్మని తొలగించడానికి ప్రయత్నిస్తోందనీ, కాబట్టి మీరు అతనిలా ఎందుకు దుస్తులు ధరించాలనుకుంటున్నారనీ వాళ్ళు నన్ను అడిగారు." అని ఆయన గుర్తుచేసుకున్నారు

తాజా కలం: పూజమ్మ కొద్దిరోజుల కిందట గంగప్పను వదిలి వెళ్ళిపోయారు. "ఆమె ఉగాది పండుగకు వెళ్ళింది. ఇక తిరిగి రాదు. అక్కడే బిచ్చమెత్తుకొంటుంది. నేనామెకు 400 రూపాయలు ఇచ్చాను. నేను ఇప్పుడిక ఒంటరిగా ఉండాలి." అన్నారు గంగప్ప.

అనువాదం: కృష్ణ ప్రియ చోరగుడి

Rahul M.

ରାହୁଲ ଏମ, ଆନ୍ଧ୍ର ପ୍ରଦେଶ ଅନନ୍ତପୁରର ଜଣେ ନିରପେକ୍ଷ ସାମ୍ବାଦିକ ଏବଂ ଜଣେ ୨୦୧୭ ପରୀ ଫେଲୋ ।

ଏହାଙ୍କ ଲିଖିତ ଅନ୍ୟ ବିଷୟଗୁଡିକ Rahul M.
Translator : Krishna Priya Choragudi

Krishna Priya Choragudi is a PhD student in Economics at IIT Delhi. She works in the fields of development economics and social policy.

ଏହାଙ୍କ ଲିଖିତ ଅନ୍ୟ ବିଷୟଗୁଡିକ Krishna Priya Choragudi