“ఏ సమయంలోనైనా చూడండి, సగంమంది మగవాళ్ళు గ్రామం బయటే ఉంటారు. కొందరు హైదరాబాద్‌లోని అంబర్‌పేట మార్కెట్‌లో, కొందరు విజయవాడలోని బీసెంట్ రోడ్డులో, ముంబైలోని వాషి మార్కెట్‌లో లేదా ఇండియా గేట్ దగ్గర, లేదా ఢిల్లీలోని పహార్‌గంజ్‌లో- బుట్టలు, చిక్కం ఉయ్యాలలు (hammocks) అమ్ముతుంటారు." ఉత్తరాంచల్‌లో అమ్మకాలు సాగించి, ఈమధ్యనే ఊరిగి తిరిగివచ్చిన మ్యాలపిల్లి పట్టయ్య అన్నారు.
42 సంవత్సరాల పట్టయ్య, తన గ్రామంలోని ఇతరుల మాదిరిగానే 20 సంవత్సరాల క్రితం నుంచి నైలాన్ తాడుతో బుట్టలు, సంచులు, ఊయలలు, చిక్కం ఉయ్యాలలు తయారు చేయడం ప్రారంభించారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలంలో బంగాళాఖాతంకు ఆనుకుని ఉన్న చిన్న తీరప్రాంత గ్రామం కొవ్వాడ (జనాభా లెక్కలలో జీరుకొవ్వాడగా ఉంటుంది). సుమారు 250 మంది జనాభా ఉన్న ఈ ఊరిలో అప్పటివరకూ చేపలు పట్టడమే ప్రధాన వృత్తిగా ఉండేది..
అంతలోనే నీటి కాలుష్యం ఈ ప్రాంతంలోని జల సంపదను నాశనం చేయడం ప్రారంభించింది. ఔషధ తయారీ పరిశ్రమలు 1990లలో, కొవ్వాడకి కేవలం 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న పైడిభీమవరం గ్రామంలోకి వచ్చాయి. వాటి వల్ల భూగర్భ జలాలతో పాటు సముద్ర జలాలు కూడా కలుషితమవుతున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి.
ఔషధాల తయారీ ద్వారా వెలువడే ప్రమాదకర వ్యర్థాల కారణంగా, భారత పర్యావరణ మంత్రిత్వ శాఖ దీనిని 'రెడ్ కేటగిరీ' కార్యకలాపంగా వర్గీకరించింది. ప్రపంచవ్యాప్తమైన ఔషధ రంగం 1990ల ప్రారంభం నుండి విస్తరించడం మొదలుపెట్టింది. అప్పటినుండి ఈ పరిశ్రమ "భారత ఆర్థికవ్యవస్థలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న విభాగాలలో ఒకటిగా మారింది" అని 'భారత ప్రజలపై, పర్యావరణంపై ఔషధరంగ కాలుష్య ప్రభావాలు' అనే నివేదిక పేర్కొంది. ఇందులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలోని పరిశ్రమల హబ్‌లు కూడా ఉన్నాయి. ఈ నివేదిక “తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ఔషధ పరిశ్రమ యొక్క అదుపులేని విస్తరణ ఫలితంగా ఎదురవుతున్న నిరంతర ప్రతికూల ప్రభావాల" గురించి మాట్లాడింది.









