'కెప్టెన్ భావు' (రామచంద్ర శ్రీపతి లాడ్)
స్వాతంత్య్ర సమరయోధుడు, తూఫాన్ సేన అధినేత
జూన్ 22, 1922- ఫిబ్రవరి 5, 2022.
చివరకి, ఏ దేశం కోసం అతను పోరాడాడో ఆ దేశం చేత అతను గౌరవించబడలేదు, గుర్తించబడలేదు, కానీ 1940లలో తన సహచరులతో కలిసి ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సామ్రాజ్యాన్ని ధిక్కరించిన ఈ అద్భుతమైన మనిషి గురించి తెలిసిన వేలాది మంది ఆరాధించారు. 1943లో బ్రిటిష్ సామ్రాజ్యం నుండి సతారా విడిపోతున్నట్లు ప్రకటించిన ఐతిహాసిక వ్యక్తి నానా పాటిల్ నేతృత్వంలోని అజ్ఞాత తాత్కాలిక ప్రభుత్వం 'ప్రతి సర్కార్'లో రామచంద్ర శ్రీపతి లాడ్ ఒక ముఖ్యమైన భాగం.
కానీ కెప్టెన్ భావు (అజ్ఞాతంలో మారుపేరు), అతని యోధులు అంతటితో ఆగలేదు. మూడు సంవత్సరాల పాటు, 1946 వరకు, వాళ్ళు బ్రిటీష్ వాళ్ళని నిలువరించి, తమ సమాంతర ప్రభుత్వాన్ని నడిపిన దాదాపు 600 గ్రామాలలో ప్రతి సర్కార్ ఆధిపత్యం చెలాయించారు. ఒక రకంగా చెప్పాలంటే, ఫిబ్రవరి 5న ఆయన మరణం బ్రిటిష్ రాజ్ ని ఎదిరించిన ఒక సర్కార్ ముగింపుకు సూచిక.







