కేరళలోని కాసర్గోడ్ జిల్లా పరప్పా గ్రామంలో 15 మందితో కూడిన ఓ ఆదివాసీ వాయిద్య బృందం వెదురుబొంగుల మీద దరువు (మూలం చెండా) వేసి సంగీతాన్ని సృష్టిస్తుంది. మావిళన్ తెగకు చెందిన ఈ సంప్రదాయ ఆదివాసీ కళాకారులు కాసర్గోడ్, కన్నూర్ జిల్లాలలో నివసిస్తారు.
“సంగీతాన్ని సృజించేందుకు గతంలో మా పెద్దవాళ్ళు ఈ వెదురు వాయిద్యాలనే వినియోగించేవారు” అంటారు కె.పి. భాస్కరన్. ఇక్కడ వీడియోలో సంగీతంతో అలరిస్తున్న బృందం ఆయనదే. బృంద సభ్యులందరూ కాసర్గోడ్ జిల్లా వెల్లరిక్కుండ్ తాలుకాలోని పరప్పా గ్రామానికి చెందినవారే. “ ఈనాటికీ ఆవు చర్మంతోనే మృదంగ వాయిద్యాలను తయారు చేస్తారు (కేరళలోని ఇతర ప్రదేశాల్లో). సాంప్రదాయకంగా మా రోజువారీ జీవితాల్లో ఆవు మాంసాన్ని కానీ, ఆవు చర్మాన్ని గానీ మేము ఏనాడూ వాడింది లేదు. తెయ్యం లాంటి సంప్రదాయ కళలో సంగీత సృజన కోసం మా పూర్వీకులు వెదురు బొంగులతో దరువు వాయిద్యాలను తయారు చేసేవారు” అంటారు భాస్కరన్.
కొన్ని దశాబ్దాల క్రితం వరకు మా జాతి అటవీ ఉత్పత్తులను సులువుగానే సంపాదించుకునేది. అయితే అడవులపై ప్రభుత్వ నియంత్రణ కారణంగా వెదురు వాయిద్యాల తయారు ప్రియమైపోయింది. దీంతో మావిళ సమూహ ప్రజలు వెదురును కొనుక్కోవడానికి ఇక్కడికి 50 కి.మీ. దూరంలో ఉన్న బదియాడ్కా పట్టణానికి వెళ్ళవలసి వస్తోంది. మూడు, నాలుగు వాయిద్యాలను ఇవ్వగల వెదురు గెడ ఒక్కటీ రూ. 2500 నుంచి రూ. 3000 వరకూ ఖరీదు పలుకుతోంది. ఒక్కో వెదురు బొంగు వాయిద్యాన్ని మహా అయితే రెండుసార్లు వాడవచ్చు. ఆ తరువాత అది బీటలు వారుతుంది. వాయిద్యాన్ని తయారు చేయడానికి అంటే దాన్ని చెక్కడానికి గానీ, అది ఎండలో ఆరేసరికిగానీ మూడునాలుగు రోజులు పడుతుంది. “ఒక వాయిద్యాన్ని తయారు చేయడానికి చాలా శ్రమపడాలి” అంటారు బృందంలోని ఓ వాయిద్యకారుడు సునీల్ వీటియోడి.




