ఒక్కసారి అలా వంచి ఇలా తిప్పగానే, లాలీపాప్ ఆకారంలో ఉండే కట్‌క్యేటి చేసే ర్యాట్-ఎ-టాట్-టాట్ శబ్దం బెంగళూరు వీధుల్లోకి ఈ బొమ్మలు అమ్మేవారు వచ్చారని సూచిస్తుంది. ఆ చుట్టుపక్కల ఉండే చిన్నబిడ్డలంతా ఈ బొమ్మనొకదాన్ని కావాలని కోరుకుంటారు. వీధుల్లోనూ, ట్రాఫిక్ సిగ్నల్స్ వద్దా సర్వత్రా కనిపించే ఈ మెరిసే గిలక్కాయ బొమ్మను అక్కడికి 2,000 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలోనే ఉన్న పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ జిల్లా నుండి ఒకచోటి నుండి మరోచోటికి ప్రయాణాలు సాగించే అమ్మకందారులు ఈ నగరానికి తీసుకువచ్చారు. "మా చేతితయారీ బొమ్మలు అంత దూరం ప్రయాణించడం మాకు సంతోషంగా ఉంది" అని ఈ బొమ్మల తయారీదారు ఒకరు గర్వంగా చెప్పారు. "మేం ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నా వెళ్ళలేం... కానీ మా బొమ్మ మాత్రం ఎక్కడికైనా ప్రయాణిస్తుంది. ఇది అదృష్టం."
ముర్షిదాబాద్‌లోని హరిహరపారా బ్లాక్‌లోని రామ్పారా గ్రామంలో, కట్‌క్యేటి (బెంగాలీ భాషలో కొట్కొటి అని కూడా పిలుస్తారు) తయారీలో స్త్రీపురుషులిద్దరూ పాల్గొంటారు. గ్రామంలోని వరి పొలాల నుండి తెచ్చిన మట్టి, మరొక గ్రామం నుండి కొనుగోలు చేసి తెచ్చిన పొట్టి వెదురు కర్రలు కట్క్యేటిని తయారు చేయడానికి ఉపయోగపడతాయని రామ్పారాలోని తన ఇంట్లో వాటిని తయారుచేసే తపన్ కుమార్ దాస్ చెప్పారు. అతని కుటుంబం మొత్తం దాని తయారీలో పాల్గొంటుంది. దీని తయారీలో వారు రంగులు, వైర్, రంగు కాగితాలు, పాత ఫిల్మ్ రీళ్ళను కూడా ఉపయోగిస్తారు. “ఒక అంగుళం పరిమాణంలో కత్తిరించిన రెండు ఫిల్మ్ ముక్కలను వెదురు కర్ర మధ్యలో ఉన్న పగులులోకి చొప్పిస్తారు. దీనితో నాలుగు రెక్కలు తయారవుతాయి,” అని కొన్నేళ్ళ క్రితం కొల్‌కతాలోని బరాబజార్ నుండి పెద్దమొత్తంలో పాత ఫిల్మ్ రీళ్ళను కొనుగోలు చేసిన దాస్ చెప్పారు. ఈ రెక్కలు కట్క్యేటికి కదిలికనూ, శబ్దాన్నీ ఇస్తాయి.


