ఒకానొకప్పుడు ముగ్గురు ఇరుగుపొరుగువారు - కేథరిన్ కౌర్, బోధి ముర్ము, మొహమ్మద్ తులసీరామ్ ఉండేవారు. కాథీ ఒక రైతు; బోధి జూట్ మిల్లులో పనిచేశాడు; మొహమ్మద్ ఒక ఆవుల కాపరి. నగరంలోని అనేకమంది విద్యావంతులు గొడవ చేస్తున్నట్టి భారత రాజ్యాంగం అనే ఆ బరువైన ఉద్గ్రంథంతో ఏమి చేయాలో వారెవరికీ తెలియదు. ఇది పనికిరానిదని కాథీ అన్నది. బహుశా అది దివ్యమైనది కావచ్చునని బోధి భావించాడు. మొహమ్మద్ అయితే "ఇది మా పిల్లలకు తిండి పెడుతుందా?" అని కూడా అడిగాడు.
గడ్డం రాజు ఎన్నికయ్యాడనే వాస్తవాన్ని ఆ ఇరుగుపొరుగులు ముగ్గురూ పట్టించుకోలేదు, "ఆఖిర్ ఇత్నా వక్త్ కిస్కే పాస్ హై? (అయినా అంత సమయం ఎవరికి ఉందీ?)" ఆపైన వర్షాలు కురవలేదు, అప్పులు పెరిగాయి, క్యాథరిన్ తన పేరును గుసగుసగా పలుకుతున్న పురుగుమందుల డబ్బాను కనిపెట్టింది. తర్వాత జూట్ మిల్లు దివాళా తీసింది. నిరసన తెలుపుతున్న కార్మికులపై పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు, వారికి నాయకత్వం వహించినందుకు బోధి ముర్ముపై తీవ్రవాది అనే అభియోగాన్ని మోపారు. చివరకు మొహమ్మద్ తులసీరామ్ వంతు వచ్చింది. ఒక చక్కటి సనాతని (పావనమైన) సాయంత్రం అతని ఆవులు ఇంటికి వచ్చాయి, వాటి వెన్నంటే కత్తి పట్టిన రెండు కాళ్ళ దూడలు. "గౌ-మాతా కీ జై! గౌ-మాతా కీ జై!"
దయ్యాల జపాల మధ్య, ఎక్కడో కొన్ని పుటలు రవ రవమన్నాయి, నీలిరంగు సూర్యుడు ఉదయించాడు, తడబడుతున్న గుసగుస వినిపించింది:
"భారతదేశ ప్రజలమైన మేం, రూఢిగా తీర్మానించుకున్నాం..."


