పచ్చని కొండలు, చిన్న చిన్న జలపాతాలు, స్వచ్ఛమైన గాలి... ఈ నేపథ్యంలో ఓ యువకుడు తన గేదెలు గడ్డి మేయడాన్ని చూస్తున్నాడు.
"మీరేదైనా సర్వే చేస్తున్నారా?" నేనతన్ని సమీపిస్తున్నప్పుడు అడిగాడతను
"లేదు," అన్నాను. పోషకాహార లోపం సంఘటనలను నమోదు చేయడానికి వచ్చానని చెప్పాను.
మహారాష్ట్రలోని పాలఘర్ జిల్లా మొఖాడా తాలూకాలో మేమున్నాం. ఇక్కడ పొషకాహార లోపం వలన 5, 221 మంది పిల్లలు అతి తక్కువ బరువుతో ఉన్నారనీ, ఈ పిల్లల సంఖ్య రాష్ట్రంలోనే రెండవ స్థానమనీ ఈ నివేదికలో గుర్తించారు.
మేం రాజధానీ నగరం ముంబై నుండి 157 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాం కానీ, ఇక్కడి పచ్చటి ప్రకృతి దృశ్యం మరేదో ప్రపంచంలో ఉన్నట్టుగా అనిపించేలా ఉంది!
రోహిదాస్ మహారాష్ట్రలో షెడ్యూల్డ్ తెగల జాబితాలోని కా ఠాకూర్ సముదాయానికి చెందినవాడు. పాలఘర్ జిల్లా జనాభాలో 38 శాతం మంది ఆదివాసీ తెగలవారే. గేదెలను కాచుకునే ఈ కుర్రవాడు తన వయసెంతో చెప్పలేకపోయాడుగానీ, చూస్తే దగ్గరదగ్గరగా ముప్పయ్యేళ్ళున్నట్టున్నాడు. భుజానికి వేలాడుతున్న ఒక గొడుగు, మెడచుట్టూ తిప్పి చుట్టిన తువ్వాలు, చేతిలో ఒక కర్ర పట్టుకొని ఉన్నాడు. గడ్డి మేస్తోన్న తన రెండు పశువులను చూసుకుంటూ ఉన్నాడు. "ఒక్క వానల కాలంలోనే వీటికి తినటానికి కడుపునిండా గడ్డి దొరుకుతుంది. వేసవి కాలాల్లో అవి బాగా తిరగాల్సి (మేత కోసం) ఉంటుంది," రోహిదాస్ చెప్పాడు.






