మహమ్మద్ షామిమ్ కుటుంబంలో ముగ్గురూ ఉత్తరప్రదేశ్ లోని తమ స్వగ్రామానికి రైలులో వెళ్లాల్సి ఉంది. అయితే అతను తమ వెయిట్ లిస్ట్ టికెట్లలో ఒక్క టిక్కెటుకు అయినా రిజర్వేషను ఖరారు అయ్యేలా చూడమని రైల్వే టికెటింగ్ ఏజెంటును ప్రాధేయపడుతున్నాడు. “ నా భార్యకు సీటు ఖరారు అయితే చాలు. నేను ఏదో రకంగా ప్రయాణం చేసేస్తాను. ఎటువంటి పరిస్థితుల్లో అయినా నేను ప్రయాణం చేయగలను. పరిస్థితులు గతంలోలా దిగజారిపోకమునుపే మేము ఇంటికి చేరిపోవాలి” అని షామిమ్ అన్నాడు.

“సీటు ఖరారు కావడానికి ఏజెంటు టికెట్టుకు రూ. 1600 అడుగుతున్నాడు. రూ. 1400కి చేసిపెట్టమని బేరం ఆడాను. మాకు ఒక సీటు ఖరారు అయితే ముగ్గురం రైలు ఎక్కేసి ఆ తర్వాత జరిమానా కట్టేస్తాం” అని షామిమ్ అన్నాడు. ముంబై నుంచి ఉత్తరప్రదేశ్ వెళ్లడానికి టికెట్ ధర సాధారణంగా రూ. 380-500 ల మధ్య ఉంటుంది. షామిమ్ అన్నలిద్దరూ ఉత్తరప్రదేశ్ లోని ఫైజాబాద్ జిల్లా మసోదా బ్లాక్ కు చెందిన అబ్బూ సరాయి గ్రామంలో వ్యవసాయ కూలీలుగా పనిచేస్తున్నారు.

కోవిడ్-19 వ్యాప్తిని నిలువరించడానికి మహారాష్ట్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన నిబంధనలు మరోసారి కర్మాగారాల మూసివేతకూ, నిరుద్యోగానికీ , నిర్మాణ పనుల స్తంభనకూ దారితీసాయి. ఈ కారణంగా ఇరవై రెండేళ్ల షామిమ్ గానీ, ముంబై లోని అసంఖ్యాక వలస కార్మికులు గానీ పది నెలల కాలంలో స్వగ్రామాలకు ప్రయాణం కావడం ఇది రెండోసారి.

ముంబై లోని ప్రధాన రైల్వే స్టేషన్ల నుంచి- ముఖ్యంగా బంద్రా, లోకమాన్య టెర్మినస్ల నుంచి ఉత్తరాదిలోని  ఉత్తరప్రదేశ్, బిహార్ ప్రాంతాలకు పలు రైళ్లు బయలుదేరతాయి. పనుల మీదా, ప్రయాణాల మీదా ఏప్రిల్ 14 నుంచి రాష్ట్రంలో పరిమితులు అమలు అయ్యాయి. దీనికి ముందే ఏప్రిల్ 11-12 తేదీల నాటికే పెద్ద సంఖ్యలో వలస కార్మికులు తమ స్వగ్రామాలకు పయనం కావడంతో ఈ స్టేషన్లు వారితో నిండిపోయాయి. ఇంకా ఏయే నిబంధనలు వస్తాయో అన్న ఆందోళనతో చాలామంది స్వగ్రామాలకు వెళ్లిపోయే ప్రయత్నంలో ఉన్నారు.

శివసేన నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం కర్ఫ్యూ ,ఇతర నియమాలను  మరో ‘ లాక్ డౌన్ ‘ అని పిలువనప్పటికీ షామిమ్  ఈ పదజాలం పట్ల నిరుత్సాహం వెళ్ళగక్కారు. “ రెండో సారి మా కూలికి పడ్డ గండి ఇది. ఇప్పటికే  అది మమ్మల్ని నష్టపరచింది” అని షామిమ్ అన్నాడు.

Mohammed Shamim, Gausiya and their son: 'If we get one seat, we’ll board and then pay whatever fine or penalty is charged'
PHOTO • Kavitha Iyer

మహమ్మద్ షామిమ్ , గౌసియా , వారి కుమారుడు: మాకు ఒక సీటు ఖరారు అయితే రైలు ఎక్కేసి ఆ తర్వాత జరిమానా కట్టేస్తాం ’.

ఏప్రిల్ 13 న మంగళవారం నాడు అతడు పనిచేసే బట్టల తయారీ కేంద్రం మూతపడింది. “సమీప కాలంలో బట్టల తయారీని పునః ప్రారంభించగలనని సేటు భావించడం లేదు. సేటు మాకు 13 రోజుల బకాయిని చెల్లించాడు” అని షామిమ్ చెప్పాడు. అయిదువేల రూపాయలకు కొంచెం తక్కువ మొత్తం సేటు ఇచ్చాడు. అవి మాత్రమే తన దగ్గర ఇపుడు ఉన్నాయి. లోక్ మాన్య టెర్మినస్ నుంచి ఫైజాబాద్ వెళ్ళే రైలులో రెండు వెయిట్ లిస్ట్ టికెట్లను కొనడం కోసం షామిమ్ రూ. 780 ఖర్చు పెట్టాడు. ఇపుడు వాటిలో ఒక టికెట్ ను ఖరారు చేసుకోవడం కోసం ఏజెంటును వెతుక్కుంటున్నాడు. “గత వారమే నేను ఇంటి అద్దె బయానాగా రూ. 5000 యజమానికి చెల్లించాను. వచ్చే కొన్ని మాసాల పాటు ఆ ఇంట్లో మేము ఉండబోవట్లేదు. అయినా ఒక్క పైసా కూడా యజమాని మాకు తిరిగి చెల్లించడానికి ఒప్పుకోవడం లేదు.” అని షామిమ్ వివరించాడు.

2020 మార్చిలో లాక్ డౌన్ ప్రకటించినపుడు పెద్ద నగరాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికుల కోసం రైల్వే శాఖ ఆనాడు నడిపిన ‘శ్రామిక్ స్పెషల్’ రైలులో  ఈ కుటుంబం, ముంబై నుంచి వారి స్వంత ఊరికి వెళ్లగలిగారు.

ఆనాడు రైలులో ఉత్తరప్రదేశ్ వెళ్లడానికి తమకు ఖరారయిన సీట్ల వివరాలు షామిమ్ ఫోనుకు చేరేసరికి మే నెలాఖరు వచ్చేసింది. “ మేము అద్దె, నీటి, కరెంట్ బకాయిల కింద రూ. 10000 బాకీ పడ్డాం (గతేడాది లాక్ డౌన్ సమయంలోని మొదటి రెండు నెలలకు గాను). నాకేమో నాలుగు నెలల పాటు పని లేదు. రూ. 36,000 జీతం నష్టపోయాను. ఇప్పుడు మళ్ళీ ఐదు వేలు నష్ట పోయా” అని షామిమ్ చెప్పాడు. పోయిన ప్రతి రూపాయి అతడిని తీవ్రంగా బాధిస్తోంది.

షామిమ్ భార్య గౌసియా బాగా అలసిపోయింది. ఆమెకు 20 ఏళ్ళు. ఉత్తర ముంబై లోని బాంద్రాలో ఉన్న నర్గీస్ దత్ నగర్ అనే వాడలో 8x8 అడుగుల ఇంట్లో వాళ్ళ ఎనిమిది నెలల బాబు గులాం ముస్తాఫా బోసి నవ్వులు చిందిస్తూ వాడ వాసులను ఆకర్షిస్తుంటాడు. గత లాక్ డౌన్ ముగిసి ఆగస్ట్, 2020 లో ముంబై తిరిగి వచ్చేనాటికి ముస్తాఫాకు ఒక మాసం కూడా నిండలేదు. “ వాడికి కొద్ది వారాల పాటు ఒంట్లో బాగోలేదు. జ్వరం, పొట్టలో సమస్యలు. వేడి చేసి కాబోలు” అని గౌసియా చెప్పింది. “మళ్ళీ ఇపుడు వెనక్కి ప్రయాణం అవుతున్నాం. మాకు మరో గతి లేదు. పరిస్థితులు మెరుగయ్యాక మళ్ళీ మేము తిరిగి వస్తాం” గౌసియా చెప్పింది.

మంచి రోజుల రాక కోసం షామిమ్ కుటుంబం ఎంతగానో ఎదురు చూస్తోంది. గతేడాది లాక్ డౌన్ తర్వాత ఆగస్టులో ముంబై తిరిగి వచ్చాక షామిమ్ శాంతాక్రజ్ వెస్ట్ లో తాను ఇదివరకు  పని చేసే బట్టల ప్యాకింగ్ కార్ఖానాలో తిరిగి పనిలో చేరాడు. అయితే ఓ వెయ్యి రూపాయలు అదనంగా లభించే అవకాశం ఈ ఏడాది ఫిబ్రవరిలో దొరకడంతో అతడు తాను అయిదేళ్లుగా పని చేస్తున్న శాంతాక్రజ్ వెస్ట్ కార్ఖానాలో ఉద్యోగం మానేసి శాంతాక్రజ్ ఈస్ట్ లో ఉన్న ఒక చిన్న బట్టల తయారీ కేంద్రంలో చేరాడు. ఇక్కడ అతడి జీతం రూ. 10,000.

Moninissa and her family are also planning to return to their village in Faizabad district. Her husband lost a job as a packer in a garment factory during the 2020 lockdown, and has now once again lost his job as a driver
PHOTO • Kavitha Iyer

ఫైజాబాద్ జిల్లాలోని తమ ఊరికి తిరిగి వెళ్లిపోవడానికి మోనినిస్సా , ఆమె కుటుంబం ఏర్పాట్లు చేసుకుంటోంది.  బట్టల తయారీ కేంద్రంలో ప్యాకర్ గా పనిచేసే ఆమె భర్త 2020 లాక్ డౌన్ సమయంలో ఉద్యోగం కోల్పోయాడు. ఇపుడు డ్రైవరుగా మరోసారి ఉద్యోగం కోల్పోయాడు.

నర్గీస్ దత్ నగర్ ఇరుకు వీధుల్లోని వీరి ఇంటికి సమీపంలోనే ఉంటున్న మోనినిస్సా, ఆమె భర్త మహమ్మద్ షహనవాజ్ కూడా స్వగ్రామానికి వెళ్లిపోయే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వారిది కూడా అబ్బూ సరాయి గ్రామమే. “ గతేడాది లాక్ డౌన్ కు ముందు (శాంతాక్రజ్ వెస్ట్ లో) బట్టల తయారీ కేంద్రంలో ప్యాకర్ గా పని చేసే నా భర్త నెలకు రూ. 6000 సంపాదించేవాడు. మేము ముంబై తిరిగి వచ్చాక మాకు పని దొరకలేదు.” అని మోనినిస్సా చెప్పింది. శ్రామిక స్పెషల్ రైలు ఎక్కి మే  నెలాఖరులో సొంతవూరుకి వెళ్ళిపోయిన ఈ కుటుంబం తిరిగి ఆగస్టులో ముంబై వచ్చింది. “మూడు నెలల క్రితం బాంద్రాలో ఒక ఇంట్లో డ్రైవరుగా చేరాడు. వాళ్ళు కేవలం రూ. 5000 మాత్రమే ఇస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకు రోజూ డ్రైవరుతో పని ఉండదు. ఇక ఇప్పుడేమో తమకు డ్రైవరే అక్కర్లేదు అని చెబుతున్నారు. లాక్ డౌన్ లో ఎక్కడ పని వెతుక్కుంటాడు?” అని మోనినిస్సా ప్రశ్నించింది.

ఇదే వాడ నుంచి వివిధ రంగాల్లో పనిచేస్తున్న అనేకమంది వలస కార్మికులు ఈ విపత్కర సమయంలో రెండో సారి తమ స్వగ్రామాలకు వెళ్లిపోవడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. 2020లో మొదటి సారి వాళ్ళు జీవనోపాధి కోల్పోయినపుడు వారి బంధు సమూహాలు, స్వగ్రామాలలోని కుటుంబ పరివారాలు వారికి ఆసరాగా నిలిచాయి. స్వగ్రామానికి పోవాల్సిన పరిస్థితి వస్తే సఫియా ఆలీ ఆధారపడేది వారి మీదే.

ముఫై ఏళ్ల పైబడ్డ సఫియా ఆలీ, ఆమె భర్త, నలుగురు పిల్లలు 100 చదరపు అడుగులు ఉండే ఇరుకు ఇంట్లో బతుకుతున్నారు. “ కొన్ని రోజులు మా అమ్మ ఇంట్లో, ఆ తర్వాత ఒక సోదరుని చెంతా, మరి కొన్నాళ్లు ఇంకో సోదరిని పంచనా గడిపితే ఒకటి రెండు నెలలు గడిచిపోతాయి. మా గ్రామంలో మాకంటూ ఏమీ లేదు. భూమి గానీ, ఉపాధి గానీ అక్కడ ఏమీ లేదు. అందుకే మేము గత లాక్ డౌన్ లో మా ఊరికి పోలేదు” అని సఫియా చెప్పింది. ఈ మాటలు అంటూనే  ఆమె తన మూడేళ్ల కొడుకుని పబ్లిక్ పాయిఖానాకు తీసుకువెళ్ళమని  పద్నాలుగేళ్ల పెద్ద కూతురు నూర్ ని ఆదేశించింది. నూర్ బానో గత ఏడాదిగా బడికి పోలేదు. పరీక్ష లేకుండానే ఏడో తరగతిలోకి పంపేయడంతో నూర్ కి సంతోషంగా ఉంది.

సఫియా భర్త బాంద్రాలోని బజార్ రోడ్ లో బట్టలు అమ్ముతాడు. మహారాష్ట్ర ప్రభుత్వం రాత్రి కర్ఫ్యూ విధించి పగటి పూట వీధి విక్రయాలనూ, దుకాణాలలో అమ్మకాలనూ నిలిపివేయడంతో  ఏప్రిల్ 5 తర్వాత వీరి కుటుంబ దినసరి ఆదాయం రూ.100-150కి పడిపోయింది. 2020 రంజాన్ మాసంలో తాను రోజుకి రూ. 600 ఆర్జించినట్టు సఫియా లెక్క వేసుకుంది. “మేము ( గత లాక్ డౌన్ రోజుల్లో) నిలబడగలిగామంటే అది రాజకీయ నాయకులు, సంస్థలు మాకు ఇచ్చిన రేషన్ వల్లనే” అని సఫియా చెప్పింది. “పగటి పూట మేము సంపాదిస్తేనే రాత్రికి నోట్లోకి ముద్ద పోయేది. ఆర్జన లేకపోతే మేము పస్తు ఉండటమే” అని వేదన చెందింది.

Migrant workers heading back home to the northern states waiting outside Lokmanya Tilak Terminus earlier this week
PHOTO • Kavitha Iyer

స్వగ్రామాలకు పోవడానికి లోక్ మాన్య తిలక్ టెర్మినస్ బయట ఈ వారం ఆరంభంలో వేచి చూస్తున్న ఉత్తరాది రాష్ట్రాల వలస కార్మికులు

బాంద్రా రిక్లమేషన్ ఫ్లై-ఓవర్ కిందనా, దాని చుట్టు పక్కలా విస్తరించిన నర్గీస్ దత్ నగర్ లో 1200 వందల దాకా ఇల్లు ఉంటాయి. ఈ ప్రాంతంలో అనేక కుటుంబాలలో జరిగినట్టే సఫియా కుటుంబం కూడా ఆమెను పనికి పోవడానికి  ఒప్పుకోదు. తమ పొరుగూరి గ్రామ ప్రధాన్ ఒక బస్సును ఇక్కడకు పంపిస్తున్నట్టు సోఫియాకు ఎవరో చెప్పారు. ఉత్తర ప్రదేశ్ లోని గోండా జిల్లాకు చెందిన తమ ఊరికి పక్కనే ఉన్న గ్రామానికి పంచాయితీ ప్రధాన్ ఆయన. తన కుటుంబానికి కూడా ఆ బస్సులో సీట్లు దొరుకుతాయని సఫియా ఆశిస్తోంది.

“గోండా పంచాయితీకి ఎన్నికలు వస్తున్నాయి. అందుచేత తన గ్రామస్తులందరినీ ఎన్నికల తేదీ కంటే ముందే  ఊరికి తిరిగి రావాలని ఆయన ఆకాంక్షిస్తున్నాడు” అని సఫియా చెప్పింది. హల్ధర్మావ్ బ్లాక్ లోని తన స్వగ్రామం అఖదేరాకు కూడా ఎన్నికలు జరుగుతాయో లేవో ఆమెకు కచ్చితంగా తెలియదు. అయినా ఈసారి ముంబై నుంచి స్వగ్రామానికి వెళ్తాననే ఆమె ఆశిస్తోంది. “ మరో సారి లాక్ డౌన్ సమయంలో ఇక్కడ ఉండలేము. మా పరువును మేము కాపాడుకోవాలి ” అని ఆమె అంది.

కాలనీలోని కొంతమంది తమ స్వగ్రామాలకు ముందుగానే ప్రణాళిక ప్రకారం వెళ్లారు. అలాంటి వాళ్ళు లాక్ డౌన్ పరిస్థితులు తొలగిపోయే వరకు తిరిగిరారు. ఇరవై ఏళ్ల యువకుడు సందీప్ బిహారీ లాల్ శర్మకు మే 5 న ప్రయాణించడానికి టికెట్ దొరికింది. శర్మ గోండా వెళ్ళి అక్కడ నుంచి చాపియా బ్లాక్ లోని తన  బభనాన్ గ్రామానికి చేరుకోవాలి. “మా కుటుంబంలో పెళ్లి ఉంది. నాన్న, ఒక సోదరి గత వారమే అక్కడకు చేరుకున్నారు. తగినంత పని దొరుకుతుందని తెలిస్తేనే గానీ మేము ఇక్కడికి తిరిగి రాము” అని శర్మ చెప్పాడు.

వడ్రంగి పని చేసే బధాయీ సమూహానికి చెందిన సందీప్ గృహోపకరణాలు తయారు చేసే ఒకాయన దగ్గర సహాయకునిగా పనిచేస్తున్నాడు. “ఇపుడు పని లేదు. ఎవరికీ కొత్త సామాను చేయించుకోవాలని గానీ, ఇంటిని బాగుచేయించుకోవాలని  గానీ లేదు” అని సందీప్ అన్నాడు. “ఎలా మరో లాక్ డౌన్ ను ప్రభుత్వం విధిస్తున్నదీ నాకు అర్థం కావట్లేదు. పేదలకు ఎంత నష్టపోతారో అసలు  వీరికి తెలుసా?”

ఈ ఏడాది మార్చిలో కొత్త ఆర్డర్లు ఒక్కొక్కటిగా వచ్చి పనులు, ఆదాయం మెల్లగా మెరుగు కావడం మొదలవుతుండగా కోవిడ్ రెండో దశ ప్రారంభం అయ్యిందని సందీప్ అన్నాడు.

The rush at the Lokmanya Tilak Terminus and Bandra Terminus, from where several trains leave for Uttar Pradesh and Bihar, began a few days before the state government’s renewed restrictions were expected to be rolled out
PHOTO • Kavitha Iyer

ఉత్తర ప్రదేశ్, బీహార్ రాష్ట్రాలకు పలు రైళ్లు లోక్ మాన్య తిలక్ టెర్మినస్, బాంద్రా టెర్మినస్ ల నుంచే బయలుదేరతాయి. రాష్ట్ర ప్రభుత్వం తాజా ఆంక్షలు విధించడానికి కొద్ది రోజుల ముందే ఈ స్టేషన్ల వద్ద రద్దీ మొదలయ్యింది.

స్వయం ఉపాధి మీద ఆధారపడ్డ వాళ్ళు కూడా ఇబ్బందులు పడ్డారు. ముఫై ఏళ్ల సొహైల్ ఖాన్ వారిలో ఒకడు. మూడు దశాబ్దాలుగా అతడు నర్గీస్ దత్ నగర్ లో ఉంటున్నాడు. ఇతను ఒక చేపల విక్రయదారు. వెర్సోవా చేపల బజారులో చేపలు కొంటాడు. వాటిని తన కాలనీ పరిసరాల్లో తిరిగి అమ్ముకుంటాడు. “ రంజాన్ మాసంలో అమ్మకాలు సాయంత్రం వేళే జరుగుతాయి. కానీ సాయంత్రం 7 గంటలకల్లా పోలీసులు మమ్మల్ని విక్రయాలు ఆపేయమని అడుగుతూ తిరగడం మొదలు పెడతారు” అని సందీప్ ఆగ్రహంతో చెప్పాడు. “ మాకు శీతలీకరణ సౌకర్యాలు గానీ, ఇతర సదుపాయాలు గానీ ఏమీ లేవు. అమ్ముడుగాక మిగిలిపోయిన చేపలు కుళ్లిపోతాయి” అని సందీప్ అన్నాడు.

మహారాష్ట్ర లో తాజా ఆంక్షలు ప్రకటించగానే గత వారం ఖాన్ తన భార్యను గోండా లోని స్వగ్రామం అఖదేరాకు పంపించి వేశాడు. అతడు, అతని సోదరుడు ఆజం కొద్ది కాలంగా వేచి చూస్తున్నారు. వారి కుటుంబ ఆదాయానికి గతేడాది పెద్ద దెబ్బే తగిలింది. ఈ ఏడాది రంజాన్ మాసంలో ఆ నష్టాన్ని కొంతైనా పూడ్చుకోవాలని వారు భావిస్తున్నారు.

సొహైల్ తమ్ముడు ఆజం ఖాన్ రిక్షా నడుపుతాడు. కొన్నేళ్ళ క్రితం బజాజ్ ఆటో రిక్షాను కొన్నాడు. నెల వారీ రూ. 4,000 దీని కోసం చేసిన అప్పును తీర్చడానికి వాయిదాగా కట్టాలి. వాయిదా చెల్లించడం అతడికి కష్టమయిపోతోంది. “ పని ఉన్నా లేకపోయినా వాయిదా కట్టి తీరాలి. సి. ఎం. ఆటోలు ఇచ్చారు. కానీ ప్రయాణీకులను ఎక్కడికీ అనుమతించకపోతే ఆటో డ్రైవర్లు ఎలా సంపాదించుకోగలరు?” అని సొహైల్ ప్రశ్నించాడు.

“గతం మాదిరి గానే ఋణ వాయిదాలు చెల్లించాల్సిన వారికి రాష్ట్ర ప్రభుత్వం సహాయం చేయాలి” అని సొహైల్ అర్థించాడు. “పరిస్థితులు ఇలాగా కొనసాగితే గతేడాది లాగే ఇపుడు కూడా మేము గోండా వెళ్లిపోవాల్సి వస్తుంది. మళ్ళీ ప్రభుత్వ దయా దాక్షిణ్యాల మీదే మేము ఆధారపడుతున్నాం” అని సొహైల్ చెప్పాడు.

అనువాదం: ఎన్.ఎన్.శ్రీనివాసరావు

Kavitha Iyer

କବିତା ଆୟାର ୨୦ ବର୍ଷ ଧରି ସାମ୍ବାଦିକତା କରି ଆସୁଛନ୍ତି। ସେ ‘ଲ୍ୟାଣ୍ଡସ୍କେପ୍ସ ଅଫ ଲସ୍ : ଦ ଷ୍ଟୋରୀ ଅପ୍ ଆନ ଇଣ୍ଡିଆ ଡ୍ରଟ୍’ (ହାର୍ପର କଲ୍ଲିନ୍ସ, ୨୦୨୧) ପୁସ୍ତକର ଲେଖିକା।

ଏହାଙ୍କ ଲିଖିତ ଅନ୍ୟ ବିଷୟଗୁଡିକ Kavitha Iyer
Editor : Sharmila Joshi

ଶର୍ମିଳା ଯୋଶୀ ପିପୁଲ୍ସ ଆର୍କାଇଭ୍‌ ଅଫ୍‌ ରୁରାଲ ଇଣ୍ଡିଆର ପୂର୍ବତନ କାର୍ଯ୍ୟନିର୍ବାହୀ ସମ୍ପାଦିକା ଏବଂ ଜଣେ ଲେଖିକା ଓ ସାମୟିକ ଶିକ୍ଷୟିତ୍ରୀ

ଏହାଙ୍କ ଲିଖିତ ଅନ୍ୟ ବିଷୟଗୁଡିକ ଶର୍ମିଲା ଯୋଶୀ
Translator : N.N. Srinivasa Rao

N.N. Srinivasa Rao is a freelance journalist and translator from Andhra Pradesh.

ଏହାଙ୍କ ଲିଖିତ ଅନ୍ୟ ବିଷୟଗୁଡିକ N.N. Srinivasa Rao