"ఏక్ మినిట్ భీ లేట్ నహీ హో సక్తే వర్నా హమారీ క్లాస్ లగ్ జాయేగీ" [“నేను ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయలేను, లేదంటే నేను ఇరుక్కుపోయానే”] లక్నో కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గంలోని మహానగర్ పబ్లిక్ ఇంటర్ కాలేజ్ వైపు హడావిడిగా అడుగులు వేస్తూ  చెప్పారు, రీతా బాజ్‌పాయ్. అది ఆమె విధులు నిర్వహించాల్సిన పోలింగ్ స్టేషన్ - అయితే అది ఆమె తన ఓటు వేయాల్సిన చోటు మాత్రం కాదు.

ఆ కాలేజీ ఆమె ఇంటికి ఒక కిలోమీటరు దూరంలో ఉంది. డిజిటల్ థర్మామీటర్, శానిటైజర్ సీసాలు, వేదిక వద్ద పంపిణీ చేయడానికి అనేక జతల వాడిపారేసే చేతితొడుగులు, మాస్క్‌లతో నిండివున్నపెద్ద బ్యాగ్‌ని మోసుకుంటూ ఉదయం 5:30 గంటల వేళ ఆమె ఆ దూరం నడుస్తున్నారు. ఫిబ్రవరి 23న ఉత్తరప్రదేశ్‌లోని తొమ్మిది జిల్లాల్లోని 58 ఇతర నియోజకవర్గాలతో పాటుగా లక్నోలో నాలుగో దశ ఎన్నికల పోలింగ్ జరుగుతున్న ఆ రోజు, ప్రత్యేకించి ఆమెకు పనిలో తలమునకలయ్యే రోజు.

ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికలు ముగిశాయి - ఫలితాలు కూడా వచ్చేశాయి. కానీ ఒక చాలా పెద్ద స్త్రీల సమూహానికి ఇంకా ఫలితాలు వస్తూండవచ్చు-అవి చాలా బాధాకరమైనవి, బహుశా ప్రాణాంతకమైనవి కూడా కావచ్చని వారికి తెలుసు. భారతదేశంలో అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల నిర్వహణలో వారు బలవంతంగా ఎదుర్కోవాల్సి వచ్చిన కష్టాల నుండి ఉత్పన్నమయ్యే ఫలితాలవి.

వారు 163,407 మంది ఆశాలు (ASHA: అక్రెడిటెడ్ సోషల్ హెల్త్ యాక్టివిస్ట్‌లు)! అధికారికంగా ఎటువంటి వ్రాతపూర్వక ఆదేశాలు లేకుండా వారు పోలింగ్ బూత్‌లలో పనిచేయవలసి వచ్చింది. మరీ ఘోరమైన విషయమేమంటే, పోలింగ్ కేంద్రాల వద్ద, అతి తక్కువ భద్రతా పరిమాణాలున్న పరిస్థితులలో, వారు పరిశుభ్రతనూ, పారిశుద్ధ్యాన్నీ నిర్వహించడం! అది కూడా, 2021 ఏప్రిల్-మే నెలలలో దాదాపు 2,000 మంది పాఠశాల ఉపాధ్యాయుల కోవిడ్-19 సంబంధిత మరణాలను చూసిన రాష్ట్రంలో! కోవిడ్-19 ఉధృతంగా ఉన్న ఆ సంవత్సరం ఏప్రిల్‌లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో పోలింగ్ అధికారులుగా ఉపాధ్యాయులు - వారి ఇష్టానికి వ్యతిరేకంగా - పని చేయాలని ఆదేశించబడ్డారు.

Reeta Bajpai spraying sanitiser on a voter's hands while on duty in Lucknow Cantonment assembly constituency on February 23
PHOTO • Jigyasa Mishra

ఫిబ్రవరి 23 లక్నో కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గంలో విధులు నిర్వహిస్తున్న రీతా బాజ్ పాయ్ , ఓటరు చేతులపై శానిటైజర్ ను స్ప్రే చేస్తున్నారు

నష్టపోయిన ఉపాధ్యాయుల కుటుంబాలు నష్టపరిహారం కోసం పోరాడారు. డి, వారిలో చాలామంది రూ. 30 లక్షలు నష్టపరిహారంగా పొందారు. అయితే ఈ ఆశాలకు- వారు శిక్షగా భావించిన ఈ పని విషయంలో- వారి కేసును ముందుకు తీసుకువెళ్ళేందుకు ఎటువంటి వ్రాతపూర్వక పత్రాలు గానీ, ఆదేశాలు లేదా సూచనలు వంటివి గానీ లేవు. పైగా ఈ విధి నిర్వహణ వలన వారిలో చాలా మంది ఓటు కూడా వేయలేదు.

కోవిడ్-19 గురించే వారు భయపడుతున్నారు. ఇంతకుముందు ముగిసిన ఎన్నికల దశలలో, తోటి ఆశాలపై దాని ప్రభావం ఎంత ఉందో ఇంకా అంచనా అందలేదు.

*****

లక్నోలోని 1,300 మందికి పైగా ఆశా వర్కర్లు తాము రిపోర్ట్ చేయవలసిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC) ద్వారా విధుల గురించిన సూచనలను కేవలం మౌఖిక రూపంలో అందుకున్న తర్వాత, పోలింగ్ బూత్‌లలో నియమించబడ్డారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ వీరికి ఎన్నికల విధులను అప్పగించింది..

"మమ్మల్ని చందన్ నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి పిలిపించారు, ఓటింగ్ రోజున శానిటైజేషన్ నిర్వహించాలని మౌఖిక సూచనలు ఇచ్చారు. క్రిమిసంహారక మందులను పిచికారీ చేయాలని, [ఓటర్ల] తాపమానాన్ని(టెంపరేచర్) తనిఖీ చేయాలనీ, మాస్క్‌లను పంపిణీ చేయాలనీ మాకు చెప్పారు." అని రీతా అన్నారు

ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7, 2022 వరకూ జరిగిన శాసనసభ ఎన్నికల సందర్భంగా ఉత్తరప్రదేశ్ అంతటా ఆశా వర్కర్లకు ఇలాంటి విధులనే కేటాయించారు.

"ఆశా వర్కర్ల పేర్లు, వారికి కేటాయించిన [పోలింగ్] స్టేషన్ల పేర్లు రాసివున్న ఒక షీట్ ఉంది, కానీ దానిపైన సంతకం లేదు" అని లక్నోలోని సర్వాంగీన్ వికాస్ ఇంటర్ కాలేజ్ పోలింగ్ స్టేషన్‌లో విధులు కేటాయించబడిన 36 ఏళ్ల పూజా సాహు చెప్పారు.

"పోలింగ్ స్టేషన్‌లో తొక్కిసలాట జరిగితేనో, లేదా మాకు ఏదైనా జరిగితేనో ఎవరు బాధ్యత వహిస్తారు, నువ్వే చెప్పు?" అని ఫిబ్రవరి 27న చిత్రకూట్‌ నగరంలో ఎన్నికల విధుల్లో ఉన్న 41 ఏళ్ల శాంతిదేవి ప్రశ్నిస్తారు. “రాతపూర్వక పత్రం లేకుండా మమ్మల్ని డ్యూటీకి పిలిచినట్లు మేం ఎలా నిరూపించగలం? ఆశాలందరూ తమ మాట్లాడాలంటే భయపడుతున్నారు. అలాంటి సమయాల్లో ఎక్కువ మాట్లాడితే నాకు కూడా ప్రమాదం తప్పదు. కానీ, మరి నేను ఒంటరిగానే రావాలి, ఒంటరిగానే తిరిగి వెళ్ళాలి.”

ASHA worker Shanti Devi in Chitrakoot: "Without a written letter how can we prove we were called on duty?"
PHOTO • Jigyasa Mishra

చిత్రకూట్‌లో ఆశా వర్కర్ శాంతిదేవి: 'వ్రాతపూర్వక లేఖ ఏదీ లేకపోతే, మమ్మల్ని విధుల నిర్వహణకు పిలిచినట్లుగా ఎలా నిరూపించగలం?'

చిత్రకూట్‌లోని తన పోలింగ్ బూత్‌లో ఇతర సిబ్బంది హాజరు పత్రంపై సంతకం చేయడం చూసిన శాంతి దేవి, ఆశాలు కూడా ఎక్కడైనా సంతకం చేయాల్సిన అవసరం ఉందా? అని ప్రిసైడింగ్ అధికారిని అడిగారు. "కానీ వాళ్ళు మమ్మల్ని చూసి నవ్వారు. మమ్మల్ని ఎన్నికల సంఘం నియమించలేదనీ, కాబట్టి సంతకం చేయడం ద్వారా మా ఉనికిని గుర్తించాల్సిన అవసరం లేదనీ, వారు చెప్పారు." అని ఆమె అన్నారు. చిత్రకూట్‌లో ఇలాంటి అనుభవాలను ఎదుర్కొన్న అనేక మంది ఆశాలలో శాంతి ఒకరు.

చిత్రకూట్‌లోని మరో ఆశా వర్కర్, 39 ఏళ్ల కళావంతి, ఆమె తన డ్యూటీ లెటర్(విధుల్లో చేరవలసిందిగా ఉత్తర్వులిచ్చే పత్రం) కోసం అడిగినప్పుడు పిఎచ్‌సి సిబ్బందిలో ఒకరు ఆమెను మాట్లాడనివ్వలేదు. "నా భర్త ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో అసిస్టెంట్ టీచర్‌గా పనిచేస్తున్నారు. నేను అతని డ్యూటీ లెటర్‌ను ఒక వారం ముందే చూశాను. నాకు కూడా డ్యూటీ కేటాయించబడినందున, నేను కూడా అటువంటి లేఖని పొందుతానని అనుకున్నాను. కానీ పిఎచ్‌సి నుండి శానిటైజింగ్ సామగ్రిని అందుకున్న తర్వాత, నేను రాతపూర్వక ఉత్తర్వు గురించి అడిగినప్పుడు, ప్రభారి [పిఎచ్‌సి ఇన్‌ఛార్జ్] లఖన్ గార్గ్, బిసిపిఎం [బ్లాక్ కమ్యూనిటీ ప్రాసెస్ మేనేజర్] రోహిత్‌లు, ఆశాలకు విధుల్లో చేరమని రాతపూర్వక ఉత్తర్వులు ఇవ్వరనీ, మౌఖిక ఉత్తర్వులు సరిపోతాయనీ చెప్పారు." అని కళావంతి తెలిపారు.

ఎన్నికల రోజున కళావంతి 12 గంటల పాటు పోలింగ్‌ కేంద్రంలోనే ఉండిపోవాల్సి వచ్చింది. అయితే అక్కడ ఆమె డ్యూటీ ముగిసినా, ఆమె పని మాత్రం అయిపోలేదు. ఆమెకు తన పిఎచ్‌సిలోని లోని ఎఎన్ఎం (Auxiliary Nurse Midwife) నుండి కాల్ వచ్చింది. "నేను ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత, ఎఎన్ఎం నాకు ఫోన్‌చేసి అల్టిమేటం ఇచ్చారు. నేను ఒక గ్రామం మొత్తం సర్వేని పూర్తిచేసి మరుసటి రోజు ముగిసేలోగా నివేదికను సమర్పించాలని ఆమె నాకు చెప్పారు." అని కళావంతి అన్నారు.

కళావంతి పోలింగ్ బూత్‌లో విధులు నిర్వహించడాన్ని పనిగా పరిగణించకపోవడమే కాకుండా, ఆమెకు అందుకు డబ్బు కూడా చెల్లించలేదు. పోలింగ్ స్టేషన్‌లో విధుల్లో ఉన్న ఇతర సిబ్బందితో సమానంగా, అంతే సమయం ఆశా వర్కర్‌లు పనిచేసినప్పటికీ, వారిలో ఎవ్వరూ ఎటువంటి వేతనం పొందలేదు. "వారు మాకు ఉత్తర్వుల లేఖలు ఇవ్వరు. ఆ లేఖలతో పాటు అలవెన్సులు కూడా వస్తాయి. ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బంది అందరికీ కొన్ని అలవెన్సులు వచ్చాయి, కానీ ఆశాలు, అంగన్ వాడీ వర్కర్లకు మాత్రం అవేమీ లేవు. వారు ప్రయాణాలకు తమ స్వంత డబ్బును ఖర్చుపెట్టుకుని వచ్చారు. క్లుప్తంగా చెప్పాలంటే, వారు దోపిడీకి గురయ్యారు,” అని ఉత్తరప్రదేశ్ ఆశా యూనియన్ అధ్యక్షురాలు వీణా గుప్తా చెప్పారు.

ఇలా జరగటం ఇది మొదటిసారేమీ కాదు.

The Mahanagar Public Inter College polling station in Lucknow where Reeta Bajpai was posted to maintain sanitation and hygiene on election day. She worked for 10 hours that day
PHOTO • Jigyasa Mishra

లక్నోలోని మహానగర్ పబ్లిక్ ఇంటర్ కాలేజ్ పోలింగ్ స్టేషన్‌లో ఎన్నికల రోజున పారిశుద్ద్యం, పరిశుభ్రతలను నిర్వహించడానికి రీతా బాజ్‌పాయ్‌ని నియమించారు. ఆ రోజు ఆమె 10 గంటలు పనిచేశారు

*****

ఆశాలు, జాతీయ ఆరోగ్య కార్యక్రమం (National Health Mission)లో తక్కువ జీతానికి పనిచేసే ఎక్కువ పని భారం ఉన్న కీలక పాత్రధారులు . వీరు 2005 నుండి ప్రజారోగ్య మౌలిక సదుపాయాల వ్యవస్థలో అగ్రభాగాన ఉన్నారు. కానీ వారు ప్రభుత్వ నిర్లక్ష్యానికి, ఉదాసీనతకు, కొన్నిసార్లు పూర్తి అన్యాయానికి కూడా గురవుతున్నారు.

దేశంలో కరోనా వైరస్ ముమ్మరంగా విజృంభిస్తున్నప్పుడు, ఇంటింటికీ వెళ్ళి పరీక్షలు నిర్వహించడం, వలస కార్మికులను పర్యవేక్షించడం, కరోనా ప్రోటోకాల్‌లకు కట్టుబడి ఉండేలా చేయడం, రోగులకు కోవిడ్ -19 నుంచి రక్షణ తీసుకోవటంలో, వ్యాక్సిన్‌లను తీసుకోవడంలో సహాయపడటం, డేటాను సేకరించి, దానిని పిఎచ్‌సిలకు నివేదించడం వంటి కీలకమైన - కానీ అదనపు - పనిని చేయడానికి ఆశాలను నియమించారు. వారు సరైన భద్రతా సామగ్రి లేకుండా, ఆలస్యంగా ఇచ్చే చెల్లింపులతో , అదనపు గంటలు పనిచేశారు. వారాంతాలలో కూడా రోజుకు 8-14 గంటల పాటు ఫీల్డ్‌లో ఉండటం, సగటున 25-50 ఇళ్లను సందర్శించడం వలన కలిగే అపారమైన వ్యక్తిగత ప్రమాదం గురించి మరి చెప్పనే అవసరం లేదు.

“గత సంవత్సరం [2020] నుండి మా పనిభారం పెరిగింది. అయితే అదనపు పనికి కూడా మనం జీతం పొందాలి, కదా ?” అని చిత్రకూట్‌లోని ఆశా వర్కర్ 32 ఏళ్ల రత్న అడుగుతున్నారు. ఉత్తరప్రదేశ్‌లో ఆశా వర్కర్లకు నెలవారీ గౌరవ వేతనంగా రూ. 2,200 వస్తుంది. పనితీరు ఆధారంగా యిచ్చే ప్రోత్సాహకాలతో పాటు వివిధ ఆరోగ్య పథకాల కింద వారు మొత్తం రూ. 5,300 పొందుతారు.

మార్చి 2020 చివరలో, కోవిడ్-19 ఆరోగ్య వ్యవస్థ సంసిద్ధత మరియు అత్యవసర ప్రతిస్పందన ప్యాకేజ్ (హెల్త్ సిస్టమ్ ప్రిపేర్డ్‌నెస్ అండ్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ ప్యాకేజ్) కింద, కేంద్ర ప్రభుత్వం నెలవారీ 'కోవిడ్ ప్రోత్సాహకం'(కోవిడ్ ఇన్సెంటివ్)గా వెయ్యి రూపాయలను ఆశాలకు కేటాయించింది. దీనిని జనవరి 2020 నుండి జూన్ 2020 వరకు చెల్లించాలి. అత్యవసర ప్యాకేజీని పొడిగించిన తరవాత, ఈ ప్రోత్సాహకం మార్చి 2021 వరకు కొనసాగింది.

మే నెలలో, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ (MoHFW) గత ఆర్థిక సంవత్సరం నుండి ఖర్చు చేయకుండా ఉన్న నిధులతో ఏప్రిల్ నుండి సెప్టెంబర్ 2021 వరకు కోవిడ్ ప్రోత్సాహకాన్ని చెల్లించాలని రాష్ట్రాలకు సూచించింది . కానీ జూలై 1, 2021 నుండి మార్చి 31, 2022 వరకు అమలు చేయబడే కోవిడ్ అత్యవసర ప్యాకేజీ రెండవ దశలో, ఆశాలతో సహా ఫ్రంట్‌లైన్ సిబ్బంది ప్రోత్సాహకాల జాబితా నుండి తొలగించబడ్డారు.

ఏప్రిల్ 2020లో ఆశాల పని పరిస్థితులు, వారికి జరిగిన చెల్లింపులపై జరిపిన సర్వే లో, మొత్తం 16 రాష్ట్రాలలో 11 రాష్ట్రాలు బకాయి ఉన్న కోవిడ్ ప్రోత్సాహకాలను చెల్లించలేదని గుర్తించింది. 52 మంది ఆశా వర్కర్లు, ఆశా యూనియన్ నాయకులతో చేసిన ఇంటర్వ్యూల ఆధారంగా "లాక్‌డౌన్ సమయంలో నిలిపివేయబడిన రోగనిరోధకత వంటి కార్యకలాపాలకు ఏ ఒక్క రాష్ట్రం కూడా సాధారణ ప్రోత్సాహకాలను చెల్లించడం లేదు" అని నివేదిక పేర్కొంది.

Health workers from primary health centres in UP were put on election duty across UP. They had to spray disinfectants, collect the voters' phones, check their temperature and distribute masks
PHOTO • Jigyasa Mishra
Health workers from primary health centres in UP were put on election duty across UP. They had to spray disinfectants, collect the voters' phones, check their temperature and distribute masks
PHOTO • Jigyasa Mishra

ఉత్తరప్రదేశ్ లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు చెందిన ఆరోగ్య కార్యకర్తలు రాష్ట్రమంతటా ఎన్నికల విధుల్లో ఉన్నారు . వారు క్రిమిసంహారక మందులను స్ప్రే చేయాలి , ఓటర్ల ఫోన్ లను సేకరించాలి , వారి శరీర ఉష్ణోగ్రతను తనిఖీ చేయాలి , మాస్కులను పంపిణీ చేయాలి

కోవిడ్‌కు సంబంధించిన ఈ అదనపు పనులన్నీ చేసిన తర్వాత కూడా, జూన్ 2021 నుండి తనకు రావలసిన ‘కోవిడ్ ప్రోత్సాహకాన్ని' రత్న అందుకోలేదు. “గత సంవత్సరం [2021] ఏప్రిల్, మే నెలల్లో నాకు కేవలం 2,000 రూపాయలు వచ్చాయి. నెలకు వెయ్యి చొప్పున ఇంకా ఎంత పెండింగ్‌లో ఉందో మీరు లెక్కించవచ్చు," అని రత్న అన్నారు. రత్నకు చెల్లించవలసిన ప్రోత్సాహక బకాయి మొత్తం కనీసం 4,000 రూపాయలు ఉంటుంది. అదికూడా ఆమె చెల్లింపు వోచర్లపై ఎ ఎన్ ఎం సంతకం చేసిన తర్వాత మాత్రమే వస్తుంది. అది కూడా సాధించవలసిన ఒక లక్ష్యమే!

"మా చెల్లింపు వోచర్లపై సంతకం చేయమని ఎ ఎన్ ఎంని ఒప్పించడం ఎంత సవాలుతో కూడుకున్న పనో మీరు నమ్మరు, మేము మాత్రం మాకు అప్పగించిన పనులన్నిటినీ పూర్తి చేశాము" అని రత్న చెప్పారు. “ఏదైనా అత్యవసరమయ్యో లేదా ఆరోగ్య సమస్య కారణంగానో నేను ఒక రోజు పని చేయలేకపోతే, ఆమె 'ఈ నెలలో మీరు బాగా పని చేయలేదు' అని చెప్పి, ఆ నెలలోని 1,000-రూపాయల ప్రోత్సాహకాన్ని మినహాయిస్తుంది. ఈ ఒక్కరోజువల్ల, ఒక ఆశా వర్కర్ నెలలో మిగిలిన 29 రోజులు ఫ్రంట్‌లైన్‌లో ఉండి పనిచేసి సంపాదించుకున్న ప్రోత్సాహకం మొత్తం పోతుంది." అన్నారామె.

దేశవ్యాప్తంగా, 10 లక్షలమందికి పైగా గ్రామీణప్రాంతాల్లో, పట్టణప్రాంతాల్లో పనిచేసే ఆశా వర్కర్లు - తమకు తక్కువ వేతనాలిచ్చి, తమ శ్రమపై అభివృద్ధి చెందుతున్న వ్యవస్థకు వ్యతిరేకంగా - తమ పనికి గుర్తింపు కోసం పోరాడుతున్నారు. సిటిజన్స్ ఫర్ జస్టిస్ అండ్ పీస్ నివేదిక ప్రకారం: “వారు [ఆశా వర్కర్లు] కనీస వేతన చట్టం పరిధిలోకి రారు. సాధారణ ప్రభుత్వ ఉద్యోగులకు లభించే ప్రసూతి ప్రయోజనాలు, ఇంకా ఇతర పథకాలు కూడా వీరికి వర్తించవు.”

ఘోరమేమిటంటే, కోవిడ్ -19 ఉధృతంగా ఉన్న సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కోవిడ్ నియంత్రణ వ్యూహాలలో కీలకమైన లంకెగా పనిచేసిన ఆశా కార్యకర్తలు తరచుగా వైద్య సంరక్షణ లేక, చికిత్స అందకపోవడం వల్ల కష్టాలుపడుతున్నారు. కోవిడ్ -19 విజృంభిస్తున్న సమయంలో యుపిలోని చాలా మంది ఆశాలు తమ విధులను నిర్వహిస్తూ మరణించారు.

"గత సంవత్సరం [2021] ఏప్రిల్ చివరలో మా అమ్మకు అనారోగ్యంగా ఉందని నాకు ఇంటి నుండి ఫోన్ కాల్ వచ్చింది. విషయం తెలియగానే నేను ఢిల్లీ నుండి బరేలీకి పరుగెత్తాను. ఆమె అప్పటికే ఆసుపత్రిలో ఉంది." అని 23 ఏళ్ల సూరజ్ గంగ్వార్ 2021 మే నెలలో తన తల్లి శాంతిదేవిని కోల్పోయినప్పటి ముందు రోజులను గుర్తుచేసుకున్నారు. వృత్తిరీత్యా ఇంజనీర్ అయిన సూరజ్, ఢిల్లీలోని ఒక ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్నారు. ఇప్పుడు ముగ్గురు సభ్యులున్న వారి కుటుంబంలో సంపాదిస్తున్న ఏకైక సభ్యుడు ఆయనే.

An ASHA worker in Chitrakoot, Chunki Devi, at her home with the dustbin, sanitisers and PPE kits she had to carry to the polling booth
PHOTO • Jigyasa Mishra

తన ఇంటివద్ద , చిత్రకూట్ లో పనిచేసే ఆశా వర్కర్ చుంకీ దేవి . డస్ట్ బిన్ , శానిటైజర్ లు , పిపిఇ కిట్ లను ఆమె పోలింగ్ బూత్ కు మోసుకెళ్ళారు

“నేను ఇంటికి చేరుకునేటప్పటికి మమ్మీ కోవిడ్-19 పాజిటివ్ అని మాకు ఎలాంటి సూచనా లేదు. ఏప్రిల్ 29న ఆర్‌టి-పిసీఅర్(RT-PCR) పరీక్ష చేసిన తర్వాత మాత్రమే ఆ సంగతి మాకు తెలిసింది. అలాంటి పరిస్థితిలో ఆమెను ఆసుపత్రిలో ఉంచుకునేందుకు ఆసుపత్రివారు నిరాకరించడంతో, మేము ఆమెను ఇంటికి తీసుకెళ్లవలసి వచ్చింది. మే 14న ఆమె పరిస్థితి మరింత దిగజారినప్పుడు, మళ్ళీ ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లడానికి ప్రయత్నించాము, కానీ మార్గమధ్యంలోనే ఆమె మమ్మల్ని వదిలి వెళ్ళిపోయింది,” అని గంగ్వార్ చెప్పారు. దేశంలో అనేకమంది పాజిటివ్ వచ్చిన ఫ్రంట్‌లైన్ సిబ్బందిలో అతని తల్లి కూడా ఒకరు. కానీ వారికి ప్రజారోగ్య సంస్థల నుండి ఎటువంటి చికిత్స అందకపోవడంతో వారు మరణించారు.

జూలై 23, 2021న లోక్‌సభలో అడిగిన ఒక ప్రశ్నకు ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్ పవార్ సమాధానమిస్తూ, ఏప్రిల్ 2021 వరకు 109 మంది ఆశా వర్కర్లు కరోనావైరస్ కారణంగా మరణించారని - అధికారిక గణాంకాల ప్రకారం ఉత్తరప్రదేశ్‌లో మరణాలు సున్నా- అని పేర్కొన్నారు. అయితే ఆశా వర్కర్ల కోవిడ్-19 సంబంధిత మొత్తం మరణాల సంఖ్యపై విశ్వసనీయమైన డేటా పబ్లిక్‌గా అందుబాటులో లేదు. మార్చి 30, 2020 నుండి ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ ప్యాకేజీ కింద, ఫ్రంట్‌లైన్ కార్మికుల కోవిడ్-సంబంధిత మరణాలకు రూ. 50 లక్షల పరిహారంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే, ఆ పరిహారం కూడా వీరిలో చాలామందికి చేరలేదు.

"నా తల్లి ఒక్కరోజు కూడా తన పని మానుకోలేదు. ఆశా వర్కర్‌గా తన కర్తవ్యాన్ని చాలా శ్రద్ధగా నిర్వహించేది. కోవిడ్ ముమ్మరంగా ఉన్న కాలమంతా ఆమె తన శక్తిసామర్థ్యాలన్నీ ఉపయోగించి పనిచేసింది. కానీ ఇప్పుడామె పోయింది, ఆరోగ్య శాఖకు కించిత్ పట్టింపు లేదు. మాకు పరిహారం రాదని వారు అంటున్నారు." అని సూరజ్ చెప్పారు.

సూరజ్, అతని తండ్రి బరేలీలోని నవాబ్‌గంజ్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లోని చీఫ్ మెడికల్ ఆఫీసర్ (CMO)ను, ఇతర సిబ్బందిని కలుసుకుని సహాయం కోసం అభ్యర్థించారు, కానీ వారి ప్రయత్నం ఫలించలేదు. తన తల్లి RT-PCR నివేదికను, మరణ ధృవీకరణ పత్రాన్ని మాకు చూపిస్తూ, అతను ఇలా అన్నారు: “ఆమె కోవిడ్-19తో మరణించినట్లు ఆసుపత్రివారు పేర్కొన్నట్లుగా మరణ ధృవీకరణ పత్రం ఉంటేనే మేము పరిహారం పొందేందుకు అర్హులమని CMO చెప్పారు. ఏ ఆసుపత్రీ ఆమెను చేర్చుకోలేదు కాబట్టి ఇప్పుడు దాన్ని మేము ఎక్కడ నుండి తేగలం? ఆపదలో ఉన్నవారికి ఎలాంటి సహాయమైనా అందకుండా చూసే ఇలాంటి నకిలీ పథకాల వల్ల ఉపయోగం ఏమిటి?"

*****

గత సంవత్సరపు భయాందోళనల జ్ఞాపకాలు మసకబారడానికి ముందే, ఉత్తరప్రదేశ్‌లో 160,000 మందికి పైగా ఆశాలు ఈ సంవత్సరం అసెంబ్లీ ఎన్నికల సమయంలో జీతం లేని, పని గురించి ఒత్తిడిచేసే, ప్రమాదకర ఉద్యోగంలో చేరారు. యూనియన్ ప్రెసిడెంట్ వీణా గుప్తా దీనిని ఆచితూచి చేపట్టిన చర్యగా భావిస్తున్నారు. “అసలు నన్నడిగితే, ఈ మహిళలు ఎటువంటి జీతం భత్యం లేని ఈ విధులలో 12 గంటల పాటు ఇరుక్కుపోయి తమ స్వంత ఓట్లు వేయకుండా ఉండేలా చేయడానికి ఇది రాజ్యం పన్నిన వ్యూహం అంటాను. ఎందుకంటే, ఆశాల డిమాండ్లను తాము నిర్లక్ష్యం చేసిన విధానం, మా గౌరవ వేతనాన్ని చెల్లిస్తున్న విధానం- తమకు వ్యతిరేకంగా వెళ్తుందని వారు భయపడుతున్నారు."

అయితే రీతా ఓటు వేయాలనే నిశ్చయించుకున్నారు. "నేను సాయంత్రం నాలుగు గంటలకు నా పోలింగ్ స్టేషన్‌కి వెళ్లి ఓటు వేయాలని ప్లాన్ చేస్తున్నాను" అని ఆమె ఆ సమయంలో PARIకి చెప్పారు. “కానీ నేను లేనప్పుడు, నా స్థానంలో కొంతసేపు డ్యూటీ చేయడానికి మరొక ఆశా వర్కర్ ఇక్కడికి వస్తేనే నేను వెళ్ళగలను. ఆ పోలింగ్ స్టేషన్ ఇక్కడ నుండి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది,” అన్నారామె. ఇతర ఆశా వర్కర్ల మాదిరిగానే, ఆమె తన బదులు పనిచేయడానికి ఎవరినైనా పెట్టాలంటే, ఆరోగ్య శాఖ నుండి ఎటువంటి సహాయమూ లేకుండా ఆ పనేదో తనే స్వయంగా చూసుకోవలసి ఉంటుంది.

తెల్లవారుజామున పోలింగ్ స్టేషన్‌లలో రిపోర్టు చేసేందుకు వెళ్ళాల్సివచ్చిన ఆశాలకు అల్పాహారం గానీ, మధ్యాహ్న భోజనం గానీ ఇవ్వలేదు. "డ్యూటీలో ఉన్న సిబ్బంది కోసం లంచ్ ప్యాకెట్లు రావడం, వారు నాముందే తినడం నేను చూశాను. కానీ నాకు ఏదీ దొరకలేదు" అని లక్నోలోని అలంబాగ్ ప్రాంతంలోని ఆశా కార్యకర్త పూజ PARIకి చెప్పారు.

Messages from ASHAs in Lucknow asking for a lunch break as they weren't given any food at their duty station
PHOTO • Jigyasa Mishra
Veena Gupta, president of UP ASHA union, says the ASHAs were not given an allowance either, and had to spend their own money on travel
PHOTO • Jigyasa Mishra

ఎడమవైపు : వారు పనిచేస్తున్న పోలింగ్ స్టేషన్ లో వారికి ఆహారం ఇవ్వనందున , భోజన విరామం కోరుతూ లక్నోలోని ఆశాల నుండి సందేశాలు వచ్చాయి . కుడివైపు : ఆశాలకు ఎటువంటి భత్యం కూడా ఇవ్వకపోవడంతో వారి ప్రయాణానికి కూడా స్వంత డబ్బునే ఖర్చు చేయాల్సి వచ్చిందని ఉత్తరప్రదేశ్ ఆశా కార్యకర్తల యూనియన్ అధ్యక్షురాలు వీణా గుప్తా అన్నారు

డ్యూటీలో ఉన్న ఇతర సిబ్బందికి మధ్యాహ్నం 3 గంటల సమయంలో లంచ్ ప్యాకెట్లు లభించగా, ఆశాలకు భోజనమూ లేదు, ఇంటికి వెళ్లి తినివచ్చేందుకు విరామమూ లేదు. “మేమంతా భోజన విరామం కోసం ఎలా అడుగుతున్నామో మీరే చూడండి. ఇంటికి వెళ్ళి, తినేసి, తిరిగి రావడానికి వాళ్ళు మాకు అనుమతి ఇవ్వొచ్చు. మా ఇళ్లు మరీ దూరమేమీ కాదు. ప్రతి ఆశా కార్యకర్తకు, వారి ఇంటి చుట్టుపక్కలే డ్యూటీ ఉంటుంది,” అని పూజ - అలంబాగ్‌లోని ఆశా వర్కర్ల వాట్సాప్ గ్రూప్ నుండి వస్తున్న సందేశాలను మాకు చూపుతూ - అన్నారు.

పోలీసులూ, విధుల్లో ఉన్న ఇతర ప్రభుత్వ సిబ్బందీ భోజనం చేస్తుండటం చూసి, పోలింగ్ స్టేషన్‌లో రీతాతో పాటు ఉన్న జనరల్ నర్స్ మిడ్‌వైఫ్ (జిఎన్‌ఎం) అన్నూ చౌదరి, తమకు ఆహారం లభించకపోవడంతో కోపంగా ఉన్నారు. "ఇది మాపట్ల ఎంతవరకు న్యాయమని మీరు అనుకుంటున్నారు? మమ్మల్ని ఎవరోలాగా చూస్తారు. డ్యూటీలో ఉన్న ఇతరులకు లభించే సౌకర్యాలు మాకెందుకు లభించవు?" అని ఆమె ఫిర్యాదు చేసినట్టు మాట్లాడారు.

చిత్రకూట్‌లోని ఆశా వర్కర్లకు వారి ఎన్నికల విధుల జాబితాకు మరో పనిని జోడించారు: చెత్తను బయటకు తీసుకుపోవడం. శివాని కుష్వాహాతో సహా జిల్లాలోని అనేకమంది ఆశా కార్యకర్తలను పిఎచ్‌సిలకు పిలిపించి, శానిటైజింగ్ మెటీరియల్‌తో పాటు పెద్ద డస్ట్‌బిన్‌ను ఇచ్చారు."వారు మాకు కొన్ని పిపిఇ కిట్‌లను కూడా ఇచ్చారు. పోలింగ్ స్టేషన్‌లో పరీక్షలు చెసి, కోవిడ్-పాజిటివ్ అయిన ఓటర్లకు వాటినివ్వాలి. మేము రోజంతా, అంటే, ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు మా స్టేషన్‌లో ఉండాలని చెప్పారు. ఆ తర్వాత మేము, ఉపయోగించిన లేదా ఉపయోగించని పిపిఇ కిట్‌లతో పాటు ఆ డస్ట్‌బిన్‌ను కూడా ఖుటాహా సబ్ సెంటర్‌లో జమచేయాలి." అని ఆమె చెప్పారు. అంటే, మెయిన్ రోడ్డు నుంచి ఒక కిలోమీటరు దూరం, నిండివున్న డస్ట్‌బిన్‌లను మోసుకుంటూ నడిచి చేరుకున్నారని అర్థం.

ఇది మాట్లాడుతున్నప్పుడు కుష్వాహా గొంతు ఆందోళనతో వణికిపోయింది: "మేము పారిశుద్ధ్యం, పరిశుభ్రత సరిగ్గా ఉండేలా చూసుకోవాలి కాబట్టి మేము ఆ పనిని చేస్తాము. మీరు ఇతర సిబ్బందికి ఇచ్చినట్లుగానే మాకూ కనీసం సరైన పత్రం ఇవ్వండి. మరి ఎన్నికల విధులు నిర్వహించినందుకు ప్రభుత్వ సిబ్బందికి చెల్లింపులు చేస్తున్నప్పుడు మాకెందుకు ఇవ్వరు? మేమేమైనా ఉచిత సేవకులమా ఏమిటి?"

జిగ్యసా మిశ్రా ఠాకూర్ ఫ్యామిలీ ఫౌండేషన్ నుండి స్వతంత్ర జర్నలిజం గ్రాంట్ ద్వారా ప్రజారోగ్యం మరియు పౌర స్వేచ్ఛపై నివేదికలు అందిస్తారు. ఠాకూర్ ఫ్యామిలీ ఫౌండేషన్ ఈ రిపోర్టేజీలోని విషయాలపై సంపాదకీయ నియంత్రణను అమలు చేయలేదు.

అనువాదం: సుధామయి సత్తెనపల్లి

Jigyasa Mishra

ଜିଜ୍ଞାସା ମିଶ୍ର, ଉତ୍ତର ପ୍ରଦେଶ ଚିତ୍ରକୂଟର ଜଣେ ସ୍ଵାଧୀନ ସାମ୍ବାଦିକ । ସେ ମୁଖ୍ୟତଃ ଗ୍ରାମାଞ୍ଚଳ ପ୍ରସଙ୍ଗରେ, ଭାରତର ବିଭିନ୍ନ ଭାଗରେ ପ୍ରଚଳିତ କଳା ଓ ସଂସ୍କୃତି ଉପରେ ରିପୋର୍ଟ ଦିଅନ୍ତି ।

ଏହାଙ୍କ ଲିଖିତ ଅନ୍ୟ ବିଷୟଗୁଡିକ Jigyasa Mishra
Translator : Sudhamayi Sattenapalli

Sudhamayi Sattenapalli, is one of editors in Emaata Web magazine. She translated Mahasweta Devi's “Jhanseer Rani“ into Telugu.

ଏହାଙ୍କ ଲିଖିତ ଅନ୍ୟ ବିଷୟଗୁଡିକ Sudhamayi Sattenapalli