“మమ్మల్నిక్కడికి తీసుకువచ్చిన వాళ్ళకి నేను వంటచేసి పెడుతున్నాను. నా భర్త ఇటుకలు చేయడంలో వాళ్ళకి సహాయం చేస్తున్నార”ని హైదరాబాద్ ఇటుక బట్టీల్లో మాకు కంటబడిన ఊర్వశి అన్నారు.
బట్టీల దగ్గర 61 ఏళ్ళ దేగు ధరువా, 58 ఏళ్ళ ఊర్వశి ధరువాలను చూసి మేం ఆశ్చర్యపోయాం. ఈ భార్యాభర్తలిద్దరూ పశ్చిమ ఒడిశా, బొలాంగీర్ జిల్లాలోని బేల్పారా గ్రామ పంచాయతీకి చెందిన పండరిజోర్ అనే పల్లెటూరు నుంచి వచ్చారు. దేశంలో ఉన్న నిరుపేద ప్రాంతాలలో ఇది ఒకటి.
నేను రెండు దశాబ్దాలకుపైగా విస్తృతంగా వార్తలు అందిస్తున్న పశ్చిమ ఒడిశా ప్రాంతానికి చెందిన ప్రజలు కనీసం 50 ఏళ్ళుగా వలసపోతున్నారు. పేదరికం వల్ల, ప్రభుత్వ విధానాల ఫలితంగానూ కరవు, ఆకలిచావులు, నిస్సహాయ స్థితిలో పిల్లలను అమ్మటం వంటి వాటికి ఈ ప్రాంతం పెట్టింది పేరు.
1966-67లో తలెత్తిన కరవు పరిస్థితుల వల్ల ఇక్కడి ప్రజలు వలసవెళ్ళడం మొదలుపెట్టారు. తరువాత మళ్ళీ 90లలో కాలాహండి, నువాపాడా, బొలాంగీర్, ఇంకా ఇతర జిల్లాల్లో వచ్చిన తీవ్రమైన కరవు కారణంగా వలసపోయేవారి సంఖ్య పెరిగింది. శారీరక శ్రమ చేయగలిగినవాళ్ళు మాత్రమే పనికోసం ఇతర రాష్ట్రాలకు తరలి వెళ్ళడం, ముసలివాళ్ళు పల్లెటూర్లలోనే ఉండిపోవడాన్ని ఆ సమయంలో మేం గమనించాం.





