శాంతీదేవి కోవిడ్-19 తో మరణించిందని నిరూపించడానికి మరణ ధృవీకరణ పత్రం కానీ, మరే ఇతర మార్గం కానీ లేదు! అయితే, ఆమె మరణానికి దారితీసిన పరిస్థితులు మాత్రం అది కోవిడ్ అనే నిర్ధారిస్తున్నాయి.
ఏప్రిల్ 2021 లో, కోవిడ్-19 రెండవ తరంగం దేశం అంతటా విజృంభిస్తున్నప్పుడు, నలభయ్యో పడిలో ఉన్న శాంతీదేవి అనారోగ్యానికి గురయ్యారు. ఒకదాని తర్వాత ఒకటి లక్షణాలు కనిపించాయి: మొదట దగ్గు, జలుబు; మరుసటి రోజు జ్వరం. "గ్రామంలో దాదాపు అందరూ ఒకే సమయంలో అనారోగ్యం పాలయ్యారు. దాంతో మేము తనను ఝోలా ఛాప్ డాక్టర్ (నాటు వైద్యుడు) దగ్గరికి తీసుకెళ్ళాం," అని ఆమె 65 ఏళ్ల అత్తగారు కళావతి దేవి చెప్పారు.
ఉత్తర ప్రదేశ్‌లోని దాదాపు ప్రతి గ్రామంలో ఝోలా ఛాప్ డాక్టర్లు లేదా నాటు వైద్యులు కనిపిస్తారు. ప్రజారోగ్య మౌలిక సదుపాయాలు తక్కువగా ఉండే ఈ రాష్ట్రంలో, నాటు వైద్యులు సులభంగా అందుబాటులో ఉండడం చేత, కొరోనా మహారోగం వ్యాపించినప్పుడు, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు వారినే ఎక్కువగా ఆశ్రయించారు. "మమ్మల్ని (క్వారంటైన్) సెంటర్‌లో ఉంచుతారని భయపడి, మేమెవరం ఆస్పత్రికి వెళ్ళలేదు. ఆ సమయంలో ప్రభుత్వ ఆస్పత్రులన్నీ రోగులతో కిటకిటలాడాయి; పడకలు అందుబాటులో లేవు. అందుకే, మేము ఝోలా ఛాప్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాం," అని వారణాసి జిల్లాలోని దల్లీపుర్ గ్రామంలో నివసించే కళావతి అన్నారు.
కానీ ఎలాంటి శిక్షణ, అర్హత లేని ఈ 'వైద్యులు' తీవ్ర అనారోగ్య సమస్యలకు సరైన చికిత్స అందించలేరు.
ఝోలా ఛాప్ వైద్యుణ్ణి సందర్శించిన మూడు రోజుల తర్వాత, శాంతీదేవికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. భయాందోళనలకు గురైన ఆమె భర్త మునీర్, కళావతి, ఇతర కుటుంబ సభ్యులు, శాంతిని వెంటనే వారణాసి పింద్రా బ్లాక్‌లో తమ గ్రామానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. "కానీ ఆ ఆస్పత్రి సిబ్బంది ఆమె (పరిస్థితి)ని చూసి, బ్రతకడం కష్టమని చెప్పారు. దాంతో తనను ఇంటికి తీసుకువచ్చి, ఝాడ్-ఫూంక్ (తాంత్రిక వైద్యం) చేయించాం," అని చీపురుతో వ్యాధులను తరిమికొట్టే ఒక పురాతన, అశాస్త్రీయ పద్ధతి గురించి కళావతి ప్రస్తావించారు.
ఆ వైద్యం పని చేయలేదు; అదే రాత్రి శాంతి మరణించారు!








