33 ఏళ్ళ ఆరేటి వాసు పైన 23 కేసులు, అతని తల్లి ఎ. సత్యవతి (55) పైన ఎనిమిది క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లోని వారి గ్రామమైన తుందుర్రులో, వాసును ప్రలోభాలకు, బెదిరింపులకు గురిచేసి, మూడుసార్లు కటకటాల వెనక్కి నెట్టారు. సెప్టెంబర్ 2016 నుండి ఇప్పటిదాకా అతను మొత్తం 67 రోజులు జైలులో గడిపారు. అతని తల్లి 45 రోజులు జైలులో ఉన్నారు.
"నేను చేసినదంతా ఆర్టిఐ (సమాచార హక్కు చట్టం) కింద దరఖాస్తు చేయటమే!" అని ఆయన చెప్పారు.
ఆయన చేసిన పనికి వచ్చిన ఫలితం అంత మామూలుగా లేదు. తుందుర్రులో పోలీసుల దాడులు, బెదిరింపులు, ప్రజలను వారి ఇళ్లలో నుండి బయటకు లాగి, వారిని నిర్బంధంలో ఉంచడం ఇప్పుడు సాధారణ చర్యలుగా మారిపోయాయి. అలాగే తుందుర్రులోనే కాకుండా పొరుగు గ్రామాలయిన భీమవరం మండలం జొన్నలగరువు, నరసాపురం మండలంలోని కె.బేతపూడిలో కూడా ఈ పోలీసు చర్యలు సాధారణమైపోయాయి. ఈ మూడు గ్రామాలూ పశ్చిమగోదావరి జిల్లాలోనే ఉన్నాయి.
ఇక్కడి గ్రామస్థులు - ఎక్కువగా చిన్న రైతులు, మత్స్యకారులు, కార్మికులు. వీళ్ళందరూ గోదావరి మెగా ఆక్వా ఫుడ్ పార్క్ ప్రైవేట్ లిమిటెడ్ (GMAFP-జిఎమ్ఎఎఫ్పి) ఏర్పాటును నిరసిస్తున్నారు. ఈ ప్రాజెక్టు వల్ల ఈ ప్రాంతంలోని గాలీ నీరూ కలుషితమై, తమ జీవనోపాధిని నాశనం చేస్తాయని వారు భావిస్తున్నారు. ఈ ఫుడ్ పార్క్ చేపలు, రొయ్యలు, పీతలు వంటి ఉత్పత్తులను ప్రాసెస్ చేసి యూరోపియన్ యూనియన్, అమెరికాలలోని మార్కెట్లకు ఎగుమతి చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. ఇక్కడ ఏర్పడిన 'జిఎమ్ఎఎఫ్పి వ్యతిరేక ఆందోళనల కమిటీ', "జిఎమ్ఎఎఫ్పి ఈ ప్రక్రియలో రోజుకు కనీసం 1.5 లక్షల లీటర్ల నీటిని ఉపయోగిస్తుంది. తద్వారా ప్రతిరోజూ దాదాపు 50,000 లీటర్ల కాలుష్యాలతో నిండిన నీటిని విడుదల చేస్తుంది" అని నొక్కి చెప్పింది. జిఎమ్ఎఎఫ్పి నుండి విడుదలయ్యే కలుషితమైన నీరు ఈ జిల్లా నుంచి గొంతేరు కాలువ ద్వారా సముద్రంలోకి విడుదలవుతుంది.










