" మాకు సోమవారం (మార్చి 16 ) నుండి ఏ పని దొరకలేదు, డబ్బులు ఎక్కడనుంచి తీసుకురావాలి?" అంటూ ఐదు రూపాయలు కావాలని పట్టుబట్టిన తన ఏడేళ్ల కూతురుని గుర్తుచేసుకుంటూ చెప్పసాగింది వందన ఉమ్బర్సాడా.
మహారాష్ట్ర లోని వాడాలో నిర్మాణ సైట్లలో పనిచేసే 55 ఏళ్ళ వందన, పాల్గర్ జిల్లాలోని కవాతేపాడ గ్రామంలో తన ఇంట్లో 'ఆంగాన్' లో కూర్చుని ఏం చెప్తుందంటే " మాకసల ఏం జరుగుతుందో తెలీదు. మమ్మల్ని నా కొడుకు ఇంట్లోనే ఉండమన్నాడు, ఎందుకంటే ఏదో వ్యాధి ప్రబలుతుందని ప్రభుత్వం వారు ఎవరిని ఇళ్లు వదిలి బయటకు రావొద్దని చెప్పారంట"
సాయంత్రం 4 గంటలు అయింది, వందన ఇరుగు పొరుగు వారంతా ఆరు బయటకు చేరి ఎన్నో విషయాలు చర్చించుకుంటున్నారు, అందులో ముఖ్యమైనది కోవిడ్-19 సంక్షోభం. అంతమందిలో ఒకే ఒక్క యువతి మాత్రం మాట్లాడేటప్పుడు కనీస దూరం పాటించమని అక్కడి వారిని వారిస్తుంది. గ్రామస్తుల అంచనా ప్రకారం కావాతేపాడలో రామ రమి ఒక డబ్భై ఇళ్లు వరకు ఉండొచ్చు, అందరు కూడా వ్వార్లి ఆదివాసీ తెగకు సంబంధించిన వారే.
ఈ రాష్ట్రవ్యాప్త లాక్ డౌన్ మొదలయ్యే వరకు, వందన మరియు తన పొరుగింటి మణిత ఉమ్బర్సాడా కలిసి ఉదయం ఎనిమిది గంటలకు నడక ప్రారంభించి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాడా చుట్టుపక్కల నిర్మాణాలు జరుగుతున్న స్థలాలకు చేరుకుంటారు. ఉదయం 9 గంటలకు నుండి సాయంత్రం 6 వరకు పని చేస్తే 200 రూపాయలు కూలి తెచ్చుకునేవారు. ఆ విధంగా నెలకి ఒక నాలుగు వేలు వరకు సంపాదిస్తారు. కానీ ఇపుడు అక్కడ గుత్తేదారు దగ్గర ఏ పనీ లేదు.
" నా కొడుకులకి కూడా ఏ పనీ దొరకడం లేదు. మేము తిండి గింజలు కొనుక్కోవాలంటే డబ్బులు కావాలి. కానీ ఏ పనీ లేకుండా ఎలా.?" అని అడిగింది వందన. “మా కోటా సరుకులు కూడా అయిపోతున్నాయి. కేవలం పచ్చడి మెతుకులు పెట్టి మా పిల్లల కడుపులు నింపాలా?. ఇది త్వరగా ముగిస్తే బావుండు"
వందనకి ముగ్గురు కొడుకులు, 11 మంది మనుమలు. తన కొడుకులు ఇటుక బట్టీల దగ్గర లేక వాడాలో నిర్మాణాలు జరుగుతున్న స్థలాల దగ్గర పనిచేస్తుంటారు. వాడా 1 ,54 ,416 జనాభా, 168 గ్రామాలున్న ఒక తాలూకా. వందన భర్త మద్యానికి బానిసై , ఆరోగ్యం పాడై పదిహేనేళ్ల క్రితమే కాలంచేశాడు. తను అక్కడే ఉన్న ఒక దుకాణం లో పనిచేసేవాడు.







