ఎన్నికల గురించి ఎక్కువ విషయాలు వార్తాకథనాలు అందించే పండితుల కన్నా, అనంతపురం వీధుల్లో రెక్సిన్ ఉత్పత్తుల అమ్మే షాపుల నుంచి తెలుస్తాయి. పోయిన ఎన్నికలలో జగన్ మోహన రెడ్డి గెలిచాడని ఎందరో అనంతపురం ప్రజా మేధావులు ఆశ్చర్యపోయినా, రెక్సిన్ షాప్ ప్రాంతాలలో ఉన్నవారికి మాత్రం ఇలానే జరగబోతోందని ముందే తెలుసు. “మేము ఎన్నికలకు ముందు చాలా వైస్సార్ పార్టీ సీట్ కవర్లు కుడుతూ పోయాము”, అన్నారు రెక్సిన్ షాప్ యజమానుల్లో ఒకరైన డి నారాయణ స్వామి.
ఈ బైక్ బ్యాగుల వారు ముందు నుండే జరగబోయేదేదో అర్ధం చేసుకున్నారు. వైస్సార్ కాంగ్రెస్ పార్టీ బ్యాగులకు వచ్చిన గిరాకీ బట్టి 2019 ఎన్నికలలో ఎవరు గెలుస్తారో తెలుసుకున్నారు.
1990లలో ఈ షాపుల్లో ముఖ్యంగా చవక రకం, గట్టి స్కూల్ బ్యాగులను కుట్టేవారు. గతంలో నేను రెండు బ్యాగులు అక్కడే కొన్నాను కూడా. కాని తరవాత దశాబ్దంలో చెప్పుల షాపుల్లో మంచి స్కూల్ బాగులు దొరికేవి. రెక్సిన్ షాపులేమో సినిమా తారలు, లేక రాజకీయనాయకుల బొమ్మలున్న మోటర్ బైక్ బ్యాగులు, సాధారణ సీట్ కవర్లు. ఆటోల సీట్ కవర్లు, సోఫాలు, కారు సీట్ కవర్లు చేయడం మొదలుపెట్టారు. రాజకీయ డిజైనర్ బ్యాగుల అమ్మకాలు 2019 లో ఎక్కువయ్యాయి. “మేము ఆకలి తో ఉన్నా కానీ మా పార్టీ జెండాలు పట్టుకుని తిరుగుతూనే ఉంటాము. మేము వెళ్ళాలి, మాకు ఇంకో దారి లేదు,” అంతకు ముందు ఎన్నికల వలన లాభపడిన ఒక తెలుగు దేశం పార్టీ ఓటరు చెప్పాడు. అతని బైక్ మీద ఒక టీడీపీ సీట్ కవర్ చూడడం గుర్తుంది నాకు.
కాని కోవిడ్ కేసులు పెరిగినప్పుడు, ప్రజలు రాజకీయాలు(లేక రాజకీయ నాయకులు)ను బైకుల మీద మోసుకుని తిరగడం తగ్గిపోయింది. అంతకు ముందు రెక్సిన్ షాపుల బయట బైకు బ్యాగులపై రాజకీయ సందేశాలు, లేక మొఖాలు కనిపించేవి. ఇప్పుడు వారు సాధారణ డిజైన్లు కల బ్యాగులు, బాగా పేరున్న కంపెనీల లోగోలు వేస్తున్నారు. ఉద్యోగలేమి, ఆర్ధిక ఇబ్బందులు ప్రజలను గట్టిగా తాకడం వలనే ఈ ఉత్పత్తులకు గిరాకీ తగ్గిందని అనుకోవచ్చు.
అంతేగాక లాక్ డౌన్ మొదలైన దగ్గరనుంచి పోలీసులు ఎక్కువగా ప్రజల మధ్యే ఉండడం కూడా ప్రజలు వారి రాజాకీయ ఆసక్తులను బయటపెట్టుకోకపోవడానికి ఒక కారణం కావచ్చు. “పోలీసులు ఏదన్నా కారణానికి మనల్ని పట్టుకున్నప్పుడు మనం వేరే రాజకీయ పార్టీ అభిమానులం తెలిస్తే(ఆ పోలీసు వేరే పార్టీ కి చెందినవాడై ఉండొచ్చు) అప్పుడు మళ్లీ ఇబ్బందుల్లో పడతాం.” అన్నాడు నారాయణస్వామి.
అనువాదం: అపర్ణ తోట