హేమంత్ కావళే తన పేరు ముందు మరో విశేషణం ఉండాల్సిందే అని పట్టుబట్టాడు.
"నేను చదువుకున్నాను, నిరుద్యోగిని, ఇంకా... అవివాహితుడిని," అని 30 ఏళ్ళ హేమంత్ తను, తనలాంటి యువ రైతులకు పెళ్ళి కాకపోవడం గురించి చమత్కరించాడు.
“సు-శిక్షిత్. బే రోజ్గార్. అవివాహిత్.” అతను ప్రతి పదాన్ని నొక్కి పలికాడు. ఆ చిన్న పాన్ బడ్డీలో అతని చుట్టూ ఉన్న అతని స్నేహితులు తమ బలవంతపు బ్రహ్మచారిత్వం వల్ల కలిగే కోపాన్నీ, అసౌకర్యాన్నీ దాచుకుంటూ, ఇబ్బందిగా నవ్వారు. వారంతా 30 ఏళ్ళు దాటిన అవివాహితులు.
"ఇదే మా ప్రధాన సమస్య," అని అర్థశాస్త్రంలో మాస్టర్స్ చేసిన కావళే చెప్పాడు.
మేం వ్యవసాయం కారణంగా రైతులు ఎక్కువగా ఆత్మహత్యలకు పాల్పడే మహారాష్ట్ర తూర్పు ప్రాంతమైన విదర్భలో, పత్తి పంటకు ప్రసిద్ధి చెందిన యవత్మాల్-దార్వ్హా రహదారిపై వ్యవసాయ సంక్షోభాన్నీ, వలస సమస్యలనూ ఎదుర్కొంటోన్న శెలోడీ అనే గ్రామంలో ఉన్నాం. అక్కడ కొందరు యువకుల బృందం గ్రామ ప్రధాన కూడలిలో హేమంత్ నడుపుతోన్న కియోస్క్ (బడ్డీ) నీడలో తమ సమయాన్ని గడుపుతుంటుంది. వీరందరూ గ్రాడ్యుయేట్లు లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్లు; వీరందరి పేరు మీద వ్యవసాయ భూమి ఉంది; వీరందరూ నిరుద్యోగులు. వీరిలో ఎవరికీ వివాహం కాలేదు.
వీరిలో చాలామంది పుణే, ముంబై, నాగ్పూర్, లేదా అమరావతి వంటి సుదూర నగరాల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు; కొంతకాలం తక్కువ జీతానికి పని చేశారు. ఉద్యోగాల కోసం రాష్ట్ర, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్, ఇతర పోటీ పరీక్షలకు హాజరై, విఫలమయ్యారు.
ఈ ప్రాంతంలో, బహుశా దేశమంతటా ఉన్న చాలామంది యువతలాగే, కావళే కూడా ఉద్యోగం రావాలంటే మెరుగైన విద్య అవసరమని భావిస్తూ పెరిగాడు.
ఇప్పుడు తనకు వధువు రావాలంటే తనకు పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగం అవసరమని అతను గుర్తించాడు.
ఉద్యోగాలు చాలా తక్కువగానూ సుదూరంగానూ ఉండటంతో, కావళే గ్రామంలోని తన కుటుంబానికి చెందిన పొలంలో పనిచేస్తూ, సహాయంగా ఉండేందుకు గ్రామంలోనే ఒక కిళ్ళీ బడ్డీని తెరిచాడు.
"నేనొక పాన్ బడ్డీ తెరవాలని నిర్ణయించుకున్నాను. ఒక స్నేహితుడిని రస్వంతి [చెరకు రసం దుకాణం] నడపమని, మరో స్నేహితుడిని ఇక్కడే ఒక చిరుతిండి దుకాణం పెట్టమని చెప్పాను. దాని వల్ల అందరం ఏదో ఒక వ్యాపారం చేసినట్లు ఉంటుంది," అని చురుకైన చమత్కారి, కావళే చెప్పాడు. "పుణేలో ఒక పూర్తి చపాతీ తినే బదులు, మా గ్రామంలో సగం చపాతీ తినడం ఎంతైనా మంచిది," అన్నాడతను.









