మే నెలలో వేడిగా ఉమ్మదం తీస్తోన్న ఒక అపరాహ్ణం వేళ. కానీ మోహాఁ వద్దనున్న హజ్రత్ సయ్యద్ ఆల్వి (రెహమతుల్లా అలయ్) దర్గా (ప్రార్థనాస్థలం) మాత్రం జనంతో క్రిక్కిరిసిపోయివుంది. ముస్లిముల కంటే హిందువులే ఎక్కువగా ఉన్న నలభై కుటుంబాలవారు ఏటా నిర్వహించే పూజలతోనూ, కందూరి అనే విందుతోనూ తీరికలేకుండా ఉన్నారు. ధోబళే కుటుంబం వారిలో ఒకటి. ఉస్మానాబాద్ జిల్లాలోని కళంబ్ బ్లాక్లో ఉన్న ఈ 200 ఏళ్ల నాటి దర్గా వద్ద నేను, నా కుటుంబం వారి అతిథులం.
వ్యవసాయ కుటుంబాలకు కొంత ఖాళీ సమయం ఉండే వేసవి నెలల్లో, మరాఠ్వాడా ప్రాంతంలోని ఉస్మానాబాద్, లాతూర్, మరో ఆరు జిల్లాలైన బీడ్, జాల్నా, ఔరంగాబాద్, పర్బణీ, నాందేడ్, హింగోలీలలోని పీర్ల (పవిత్ర పురుషులు) దర్గాలు సాధారణంగా కార్యకలాపాలతో సందడిగా ఉంటాయి. గురు, ఆదివారాల్లో కుటుంబాలు పెద్ద సంఖ్యలో ఈ దర్గాలకు వస్తుంటాయి. వాళ్ళు ఒక మగ మేకను బలి ఇచ్చి, వండిన మాంసాన్ని నివద్ (నైవేద్యం) సమర్పించి, ఆశీర్వాదం కోరుకుంటారు. అందరూ కలిసి భోజనం చేస్తారు, ఇతరులకు ఆహారాన్ని అందిస్తారు.
"మేం తరతరాలుగా దీన్ని (కందూరి) చేస్తున్నాం," అన్నారు ఉస్మానాబాద్లోని యెడ్షి (యెడ్సీ అని కూడా పిలుస్తారు)కి చెందిన మా బంధువు భాగీరథి కదమ్ (60). (224 సంవత్సరాల హైదరాబాద్ నిజామ్ పాలనతో సహా) మరాఠ్వాడా ప్రాంతం 600 సంవత్సరాలకు పైగా ఇస్లామిక్ పాలనలో ఉంది. ఈ ఇస్లామిక్ ప్రార్థనాస్థలాల పట్ల ఉండే విశ్వాసం, ఆరాధనలు ప్రజల విశ్వాసాలతో, ఆచారాలతో పెనవేసుకుపోయి - ఒక సమన్వయ జీవన విధానాన్ని సూచిస్తున్నాయి.
“మేం గడ్ దేవదరి వద్ద అర్చిస్తాం. తవరాజ్ ఖేడాకు చెందినవారు ఇక్కడికి మోహాఁకు వస్తారు; మీ గ్రామం (లాతూర్ జిల్లాలోని బోర్గావ్ బుద్రుక్) వారు షేరాను సందర్శించాలి," అని ప్రేమగా భాగా మావ్షీ అని పిలుచుకునే భాగీరథి, పూజల కోసం నిర్దిష్ట దర్గాలను కేటాయించే గ్రామాల శతాబ్దాల నాటి ఆచారాన్ని వివరించారు.
ఇక్కడ మోహాఁలోని రెహ్మతుల్లా దర్గా వద్ద ప్రతి చెట్టు క్రింద, తగరపు పైకప్పులు లేదా టార్పాలిన్ పట్టాల ఆశ్రయం కింద, ప్రజలు చుల్హాలు (తాత్కాలికంగా ఏర్పాటుచేసిన పొయ్యిలు) వెలిగించి, దర్గాలో పాటించే ఆచారాల సమయంలో అందించడానికి ఆహారాన్ని వండుతారు. పిల్లలు తమ మనసుకు నచ్చినట్లు ఆడుకుంటుంటే పురుషులు, మహిళలు కబుర్లు చెప్పుకుంటున్నారు. గాలి వేడిగా ఉంది, కానీ పశ్చిమ ఆకాశంలో ముసురుకుంటోన్న మేఘాలు కొంత నీడను తెస్తాయి. అలాగే ప్రవేశ ద్వారం వద్ద వరుసగా ఉన్న ముసలి చింతచెట్ల నీడలు పరిచిన పందిరి, వేడి నుండి కొంత ఉపశమనాన్ని కలిగిస్తోంది. దర్గాలోని నీటి తావు అయిన 90 అడుగుల లోతుండే బారవ్ అని పిలిచే పాత రాతి బావి ఎండిపోయింది, కానీ "వర్షాకాలంలో నీటితో నిండిపోతుంది" అని ఒక భక్తుడు మాకు తెలియజేశారు.




















