"నన్ను అనేకసార్లు ఏనుగులు తరుముకొస్తుంటాయి, కానీ నేనెప్పుడూ గాయపడలేదు," నవ్వుతూ చెప్పారు రవి కుమార్ నేతామ్.
ఈ 25 ఏళ్ళ గోండు ఆదివాసీ అర్సికన్హార్ శ్రేణిలోని అడవి బాట వెంట నడుస్తున్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని ఉదంతి సీతానది టైగర్ రిజర్వ్‌లో ఏనుగుల జాడలు తీసే (tracker) పనిచేస్తున్న ఈయన, ఆ దళసరి చర్మపు జంతువులను వాటి విసర్జక పదార్థాలు, పాదముద్రల ద్వారా పసిగడతారు.
"నేను పుట్టిందీ పెరిగిందీ అడవిలోనే. ఈ విషయాలు నేర్చుకోవడానికి నాకు ఏ బడికీ వెళ్ళాల్సిన అవసరంలేదు," ధమ్‌తరీ జిల్లా, ఠేనాహీ గ్రామానికి చెందిన రవి చెప్పారు. 12వ తరగతి వరకూ చదివిన ఆయన అటవీ శాఖలో ప్రస్తుతం చేస్తోన్న ఉద్యోగానికి మారక ముందు ఫైర్ గార్డుగా సుమారు నాలుగేళ్ళ పాటు పనిచేశారు.
ట్రాకర్లు మమ్మల్ని అడవిలోకి తీసుకెళ్తుండగా, పురుగుల మృదువైన ఝుంకారాలు, సాల్ (షోరియా రోబస్టా), టేకు (టెక్టోన గ్రాండిస్) చెట్ల ఆకుల్లోంచి దూసుకుపోతున్న గాలి చేస్తోన్న మర్మరధ్వని తప్ప అంతా నిశ్శబ్దంగా ఉంది. అప్పుడప్పుడూ ఒక పక్షి కూత, పుటుక్కున విరిచిన రెమ్మ చప్పుడూ వినిపిస్తున్నాయి. ఈ ఏనుగుల జాడలు తీసేవారు వినవచ్చే శబ్దాల పట్లా, కనిపించే ఆధారాలను కూడా జాగ్రత్తగా గమనిస్తుండాలి.












