భారతదేశంలో 2022లో ఖచ్చితంగా 4,45,256 కేసులు ‘మహిళలపై నేరాలు’గా నమోదయ్యాయి. అంటే రోజుకు దాదాపు 1,220 కేసులన్నట్టు . ఇవన్నీ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో అధికారికంగా నివేదించినవి, సేకరించినవి. ఇటువంటి జెండర్ సంబంధిత హింస వాస్తవ సంఘటనలు అధికారిక సంఖ్యల కంటే ఎక్కువగా ఉంటాయి
మహిళలపై హింస అనేది రోజువారీ జీవితంలోని ప్రతి అంశంలోకి దొంగచాటుగా ప్రవేశించింది. పనిప్రదేశాలలో వేధింపులు, మహిళల అక్రమ రవాణా, లైంగిక వేధింపులు, గృహ హింస, కళలు, భాషలలో లింగవివక్ష - ఇవన్నీ మహిళల రక్షణకూ, భద్రతకూ ఆటంకం కలిగిస్తాయి.
మహిళలు తమపై జరిగిన నేరాల గురించి రిపోర్ట్ చేయడానికి వెనుకాడటం వలన వారి గొంతులు మరింతగా సన్నగిల్లిపోతున్నాయనేది చక్కగా నమోదు చేసిన వాస్తవం. ఉదాహరణకు ఉత్తరప్రదేశ్‌కు చెందిన బర్ఖా అనే 22 ఏళ్ళ దళిత మహిళ విషయాన్నే తీసుకుందాం. ప్రధాన నిందితుడు స్థానిక రాజకీయ నాయకుడు కావటంతో, తనపై జరిగిన అత్యాచారం, కిడ్నాప్‌ల గురించి ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసేందుకు నిరాకరించారని బర్ఖా పేర్కొంది. హరియాణా నివాసి, మరో అత్యాచార బాధితురాలు మాలిని ఇలా అంటోంది, “నిందితుడి నుండి కొంత డబ్బు తీసుకుని, విషయాన్ని ఇంతటితో వదిలేయమని పోలీసులు నన్ను అడిగారు. అయితే, రాజీపడటానికి నేను నిరాకరించటంతో వాళ్ళు నన్ను తిట్టి, ' రాజీపడకపోతే నిన్ను లాక్-అప్ చేస్తాం ,' అని బెదిరించారు."
పోలీసుల నిర్లక్ష్యం, అనధికారికంగా జరిగే ఖాప్ పంచాయితీలు , వైద్యపరమైన, చట్టపరమైన వనరులు అందుబాటులో లేకపోవడం వంటివన్నీ కలిసి, మహిళలపై హింసకు పరిహారం కోరకుండా నిరోధించే పని చేస్తున్నాయి. సమీక్షించిన ఆరు కేసులలో, సీనియర్ పోలీసు అధికారులకు ఫిర్యాదులు వెళ్ళిన తర్వాత మాత్రమే పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారని, న్యాయ సాధనకు అడ్డంకులు: భారతదేశంలోని ఉత్తరప్రదేశ్‌లో 14 మంది అత్యాచార బాధితుల అనుభవాలు , అనే 2020 నాటి నివేదిక పేర్కొంది. మిగిలిన ఐదు కేసుల్లో కోర్టు ఆదేశాల తర్వాత మాత్రమే ఎఫ్‌ఐఆర్ దాఖలు అయింది. కులం, వర్గం, వైకల్యం, వయస్సు వంటి గుర్తింపులు జెండర్-ఆధారిత హింసను పరిష్కరించడానికి అమలులో ఉన్న రాష్ట్ర యంత్రాంగాల నుండి ఎవరినైనా మినహాయించడాన్ని పెచ్చుపెరిగేలా చేస్తాయి. దళిత మానవ హక్కుల పరిరక్షణ నెట్‌వర్క్ నివేదిక ప్రకారం, దళిత మహిళలపై లైంగిక హింసకు సంబంధించి 50 కేసుల్లో చేసిన అధ్యయనాల్లో 62 శాతం మంది 18 ఏళ్ళ కంటే తక్కువ వయసున్న బాలికలను లక్ష్యంగా చేసుకున్నారు. క్రైమ్ ఇన్ ఇండియా 2022 నివేదిక కూడా 18 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు గల మహిళల్లో అత్యధికంగా అత్యాచార కేసులు నమోదవుతున్నాయని పేర్కొంది.
సమాచారాన్ని తెలియచేయటంలో వారికుండే అడ్డంకులతో పాటు, సంరక్షకులపై ఆధారపడటం వంటివాటి వలన భారతదేశంలో మానసిక, శారీరక వైకల్యాలు ఉన్న బాలికలు, మహిళలు కూడా లైంగిక హింసకు ఎక్కువగా గురవుతున్నారని ఈ నివేదిక పేర్కొంది. మానసిక వైకల్యంతో జీవిస్తోన్న 21 ఏళ్ళ కజ్రీ విషయంలో జరిగినట్టుగా, ఫిర్యాదు నమోదు అయినప్పటికీ కూడా, చట్టపరమైన ప్రక్రియే శిక్షగా కూడా మారుతుంది. 2010లో కిడ్నాప్‌కు గురైన కజ్రీ, పదేళ్ళ పాటు అక్రమ రవాణా, లైంగిక వేధింపులు, బాల కార్మిక బాధితురాలిగా గడిపింది . "పోలీసు స్టేట్‌మెంట్‌లు, పరీక్షలు మొదలైనవాటి కోసం కజ్రీని రోజుల తరబడి తిప్పడానికి నాకు సెలవులు అవసరం కావటంతో నా ఉద్యోగాన్ని ఒకే చోట కొనసాగించడం కష్టంగా మారింది. నేను తరచుగా సెలవు అడుగుతుండటంతో నన్ను ఉద్యోగం నుండి తొలగిస్తున్నారు," అని కజ్రీ తండ్రి తెలియజేశారు.
"సమర్థవంతమైన నియంత్రణ వ్యవస్థను సృష్టించడం, వారిని [మహిళలను] నిరంతరం కాపాడుకోవాల్సిన ఆవశ్యకత" గురించి ప్రొ. ఉమా చక్రవర్తి Conceptualising Brahmanical Patriarchy in Early India అనే వ్యాసంలో రాశారు. వ్యాసంలో పేర్కొన్నట్లుగా ఈ నియంత్రణ తరచుగా పితృస్వామ్య నిబంధనలను అమోదించే మహిళలను గొప్పచేసి, ఆమోదించనివారిని అవమానించడం రూపంలో జరుగుతుంది. మహిళల చలనశీలతను హింసాత్మకంగా పరిమితం చేసే నియంత్రణా నిబంధనలు తరచుగా మహిళల లైంగికత, వారి ఆర్థిక స్వాతంత్య్రానికి సంబంధించిన భయాలతో ముడిపడి ఉంటాయి. “ఇంతకుముందు, నేను గ్రామంలో ఎవరైనా గర్భిణీ స్త్రీని చూడటానికో, లేదా వారిని ఆసుపత్రికి తీసుకెళ్ళడానికో వెళ్ళినప్పుడు, నేను ఇతర పురుషులను కలవడానికి వెళ్తున్నానని వారు [ఆమె అత్తమామలు] అనేవారు. ఒక ఆశాగా అది నా కర్తవ్యం,” అని 30 ఏళ్ళ గిరిజ చెప్పారు. ఉత్తరప్రదేశ్‌లోని మహోబా జిల్లాలో నివాసముండే గిరిజ, తాను చేస్తోన్న అక్రెడిటెడ్ సోషల్ హెల్త్ యాక్టివిస్ట్ (ఆశా) ఉద్యోగాన్ని మానేయాలని ఆమె అత్తమామల నుండి ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. "నిన్న నా భర్త తాత నన్ను లాఠీ (కర్ర)తో కొట్టాడు . నా గొంతు నులిమే ప్రయత్నం కూడా చేశాడు," అన్నారామె.
మరో జెండర్ సంబంధిత అవరోధం ఏమిటంటే, మహిళలు పని చేస్తూ, అందుకు వేతనం పొందే పనిప్రదేశాలలో ఎదుర్కొనే వేధింపులు. దేశ రాజధాని ప్రాంతంలోనూ, బెంగళూరులోనూ వస్త్ర పరిశ్రమలలో పనిచేసే కార్మికులలో నిర్వహించిన సర్వే ప్రకారం, 17 శాతం మంది మహిళా కార్మికులు పని ప్రదేశాలలో లైంగిక వేధింపులకు గురైన సందర్భాలను నివేదించారు. "పురుష మేనేజర్లు, సూపర్‌వైజర్లు, మెకానిక్‌లు మమ్మల్ని తాకడానికి ప్రయత్నిస్తుంటారు, కానీ ఈ విషయంగా ఫిర్యాదు చేయాలంటే ఎవరూ ఉండరు," అని వస్త్ర పరిశ్రమలో కార్మికురాలైన లత (చదవండి: దిండుక్కల్‌లో దళిత మహిళలు సంఘటితమైన వేళ ) పేర్కొన్నారు. మహిళా కార్మికుల సామూహిక సంప్రదింపుల సామర్థ్యాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో, ఒక మహిళ నేతృత్వం వహించేలా, ఇందులో సగానికి తక్కువ కాకుండా మహిళలు ఉండేలా ఒక ఫిర్యాదుల కమిటీని ఏర్పాటు చేయాలని సంస్థలకు విశాఖ గైడ్‌లైన్స్ (1997) సిఫార్సు చేసింది. కాగితంపై ఇటువంటి ఆదేశాలు ఉన్నప్పటికీ, వాటి అమలు మాత్రం బలహీనంగానే కొనసాగుతోంది. పనిలోనూ, ఇళ్ళల్లోనూ మహిళలపై హింస పెచ్చరిల్లిపోతోంది.
18-49 సంవత్సరాల వయస్సు గల స్త్రీలలో 29 శాతం మంది 15 సంవత్సరాల వయస్సు నుండే తమ ఇళ్ళల్లో శారీరక హింసను అనుభవించినట్లు , 2019-21 దేశీయ కుటుంబ ఆరోగ్య సర్వే (NFHS)లో తేలింది. ఆరు శాతం మంది లైంగిక హింసను ఎదుర్కొంటున్నట్లు కూడా నివేదికలో ఉంది. అయితే కుటుంబం, స్నేహితులు, లేదా ప్రభుత్వ సంస్థల నుండి లైంగిక లేదా శారీరక హింసను ఎదుర్కొంటోన్న మహిళల్లో కేవలం 14 శాతం మంది మాత్రమే దానిని ఆపడం కోసం సహాయాన్ని కోరుతున్నారు. భాగస్వాముల వల్ల మహిళలు హింసకు గురవుతున్న కేసులు పెరుగుతున్నాయి. " మేరీ ఘర్‌వాలీ హై, తుమ్ క్యోఁ బీచ్ మేఁ ఆ రహే హో [ఆమె నా భార్య. నువ్వెందుకు మధ్యలో కలగజేసుకుంటున్నావు?]," భార్యను కొడుతున్నప్పుడు ఎవరైనా వారిస్తే రవి ఇలాగే అంటాడు. కేవలం ఒక్క 2021 సంవత్సరంలోనే ప్రపంచవ్యాప్తంగా 45,000 మంది బాలికలు తమ భాగస్వాముల చేతుల్లోనో, కుటుంబ సభ్యుల చేతుల్లోనో హత్యకు గురయ్యారు .
జనాదరణ పొందిన సంస్కృతిలో చిత్రితమైన రొమాంటిక్ సంబంధాలలో హింస నిస్సందేహంగా ఆమోదం పొందిన ఒక అంశం. యువ వీక్షకులపై భారతీయ సినిమా ప్రభావం లో, ‘ ఛేడ్ ఖానీ ’ లేదా ఈవ్-టీజింగ్ ( వీధుల్లో లైంగిక వేధింపులు అని పిలుస్తారు) వర్ణనలను 60 శాతం మంది యువత హానిలేని పరిహాసంగా చూస్తున్నారు. జెండర్ సంబంధిత హింసను హానికరమైన పద్ధతిలో సాధారణీకరించటం ఇటీవలి మరొక ప్రచురణ - మహిళలపై నేరాలకు సంబంధించి సిట్టింగ్ ఎంపిలు/ఎమ్మెల్యేలపై ప్రకటించిన కేసుల విశ్లేషణ 2024 - లో గుర్తించబడింది. సిట్టింగ్ ఎంపిలు/ఎమ్మెల్యేలలో 151 మంది ప్రతినిధులపై మహిళలపై నేరాలకు పాల్పడిన కేసులున్నట్లుగా ప్రకటించారని ఈ విశ్లేషణ పేర్కొంది.
ఈ ఆందోళనకరమైన పరిస్థితికి బాధితురాలిని అవమానించే సంస్కృతిని - ముఖ్యంగా లైంగిక హింసను అనుభవించిన వారి పట్ల - కలపండి: బీడ్ జిల్లాలోని తన గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులచే అత్యాచారానికి గురైన రాధ, వారికి వ్యతిరేకంగా మాట్లాడినందుకుగాను, ఆ తర్వాత ఆమెను "శీలం లేనిదిగాను", గ్రామం పరువు తీసిందనీ ఆరోపించారు.
ఈ నేరాల చిట్టా చాలా పొడవైనది, వాటి పితృస్వామిక మూలాలు మన సమాజంలో చాలా లోతుగా వేళ్ళూని ఉన్నాయి. మహిళలపై హింస గురించిన మరింత సమాచారం కోసం PARI గ్రంథాలయంలోని జెండర్ ఆధారిత హింస విభాగంలో ఇక్కడ చదవండి.
కవర్ డిజైన్: స్వదేశ శర్మ
అనువాదం: సుధామయి సత్తెనపల్లి