" మిర్చీ మే ఆగ్ లగ్ గయీ [మిరపకాయలు కాలిపోతున్నాయి]."

అది 1984, డిసెంబర్ 2 నాటి రాత్రి సమయం. భోపాల్ నివాసి నుస్రత్ జహాఁ ఊపిరి పీల్చుకోలేక నిద్ర నుంచి మేల్కొన్నారు. ఆమె కళ్ళు మండిపోతూ నీళ్ళు కారుతున్నాయి. కొద్దిసేపటికే ఆరేళ్ళ వయసున్న ఆమె కొడుకు ఏడవడం మొదలుపెట్టాడు. ఆ శబ్దానికి ఆమె భర్త మహమ్మద్ షఫీక్ నిద్ర లేచారు.

" ఖయామత్ కా మంజార్ థా [అదొక వినాశకర దృశ్యం]," ప్రస్తుతం 70 ఏళ్ళ వయసున్న షఫీక్, నవాబ్ కాలనీలోని తన ఇంటిలో కూర్చుని, నేటికి 40 ఏళ్ళ క్రితం మధ్యప్రదేశ్ రాజధానీ నగరంలో జరిగిన, భోపాల్ వాయు విపత్తు (BGD) అని పిలిచే ఆ సంఘటనలను గుర్తుచేసుకున్నారు.

ఒక కాగితపు మిల్లులో దినసరి కూలీగా పనిచేసే షఫీక్, ఆ తర్వాత కొన్నేళ్ళ పాటు ఆ విష వాయువు ప్రభావం వల్ల క్షీణించిన తన కుటుంబ ఆరోగ్య చికిత్స కోసం ప్రాణాలొడ్డి పోరాడారు. ఇది 18 సంవత్సరాల పాటు వారికున్న ఒకే ఒక నీటి వనరైన బావి నీరు కలుషితమవడం వల్ల మరింత దిగజారింది. ఆ నీరు ఆయన కళ్ళను బాగా చికాకు పెట్టేదనీ, కానీ వేరే గత్యంతరం ఉండేది కాదనీ ఆయన చెప్పారు. 2012లో మాత్రమే సంభవనా ట్రస్ట్ క్లినిక్ ఆ నీటిని పరీక్షించి, వాటిలో విషపూరిత మూలకాలున్నట్టు కనుగొన్నారు. ఆ తర్వాత ఆ ప్రాంతంలోని బోరుబావులను రాష్ట్ర ప్రభుత్వం మూసివేసింది.

షఫీక్ కుటుంబాన్ని అగచాట్ల పాలుచేసిన ఆ 1984 నాటి రాత్రి వెలువడిన విషవాయువు యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్ (యుసిఐఎల్) కర్మాగారం నుండి వచ్చింది. అప్పుడా కర్మాగారం బహుళజాతి యూనియన్ కార్బైడ్ కార్పొరేషన్ (యుసిసి) యాజమాన్యం కింద ఉండేది. ఆ డిసెంబరు 2 రాత్రి, యుసిఐఎల్ కర్మాగారం నుండి వెలువడిన అత్యంత విషపూరితమైన మిథైల్ ఐసోసైనేట్ వాయువు వల్ల ఏర్పడిన విపత్తును ప్రపంచంలోనే అత్యంత దారుణమైన పారిశ్రామిక విపత్తుగా పరిగణిస్తున్నారు.

PHOTO • Juned Kamal

నవాబ్ కాలనీలోని తన ఇంటిలో సంభావనా ట్రస్ట్ క్లినిక్ సభ్యులతోనూ, భోపాల్‌లోని అజీమ్ ప్రేమ్‌జీ విశ్వవిద్యాలయ విద్యార్థులతోనూ కలిసివున్న మహమ్మద్ షఫీక్ (తెలుపు కుర్తా పైజామాలో). షఫీక్ కుటుంబం యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్ కర్మాగారం సమీపంలో నివసిస్తోంది. 1984 డిసెంబర్‌లో జరిగిన విషవాయువు ప్రమాదం ఆయన కుమారునిపై తీవ్ర ప్రభావాన్ని చూపింది

"తక్షణ మానవ మరణాల సంఖ్య దాదాపు 2,500 ఉన్నట్టు అధికారిక వర్గాలు అంచనా వేశాయి. అయితే ఇతర ఆధారాలు (ఢిల్లీ సైన్స్ ఫోరమ్ నివేదిక) ఈ సంఖ్య కనీసం రెండింతలు ఎక్కువగా ఉండవచ్చని చెబుతున్నాయి," అని ద లీఫ్‌లెట్‌ లో వచ్చిన ఈ నివేదిక పేర్కొంది.

భోపాల్ నగరమంతటా వ్యాపించిన ఆ విషపూరిత వాయువు వలన కర్మాగారానికి సమీపంలో నివసించే షఫీక్ కుటుంబం వంటి వారు తీవ్రంగా దెబ్బతిన్నారు. నగరంలోని 36 వార్డుల్లో ఉండే దాదాపు ఆరు లక్షల మంది ప్రజలు దీని బారినపడ్డారు.

తన బిడ్డకు చికిత్స చేయించాలనే ఆతృతలో ఉన్న షఫీక్, మొదట తమ ఇంటికి ఒక కిలోమీటరు దూరంలో ఉన్న హమీదియా ఆసుపత్రికి వెళ్ళారు.

" లాషేఁ పడీ హుయీ థీఁ వహాఁ పే [అక్కడంతా శవాలు పడివున్నాయి]," ఆయన గుర్తుచేసుకున్నారు. వైద్యం కోసం వందలాదిమంది జనం వస్తుండటంతో అక్కడున్న వైద్య సిబ్బంది ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో పడిపోయారు.

" మాథే పే నామ్ లిఖ్ దేతే థే [వాళ్ళు చనిపోయినవారి పేరును వారి నుదుటిపై రాస్తున్నారు]," గుట్టలుగా పోగుపడుతోన్న మృతదేహాలను సూచిస్తూ ఆయన గుర్తుచేసుకున్నారు.

PHOTO • Smita Khator
PHOTO • Prabhu Mamadapur

ఎడమ: భోపాల్‌లోని యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్ (యుసిఐఎల్) కర్మాగారం. కుడి: కొద్ది దూరంలో ఉన్న శక్తి నగర్ నుంచి కర్మాగారం ఇలా కనిపిస్తోంది

భోజనం చేయడానికి ఇమామి గేట్ దగ్గర ఉన్న ఆసుపత్రి నుండి రోడ్డు దాటి అవతలకు వెళ్ళిన షఫీక్ కళ్ళకు ఒక వింత దృశ్యం కనిపించింది. అతను ఆర్డర్ చేసిన దాల్ (పప్పు) వచ్చింది, కానీ అది నీలం రంగులో ఉంది. " రాత్ కీ దాల్ హై, భయ్యా [ఇది నిన్న రాత్రి చేసిన పప్పు సోదరా]." విషవాయువు ఆ పప్పు రంగును మార్చేసింది, దాని రుచి కూడా పుల్లగా ఉంది.

"కనీసంగా  చెప్పాలంటే, యుసిఐఎల్‌లో అతి ప్రమాదకర విష రసాయనాలను భారీగా నిల్వ చేయడం వల్ల భోపాల్‌లో సంభవించబోయే విపత్తు గురించి యుసిసి [యూనియన్ కార్బైడ్ కంపెనీ] అధికారులు, ప్రభుత్వ అధికారులు ముందస్తు హెచ్చరికలను జారీచేయడాన్ని పూర్తిగా విస్మరించిన తీరు దిగ్భ్రాంతిని కలిగిస్తోంది," అని ద లీఫ్‌లెట్‌ లో ఎన్.డి. జయప్రకాశ్ రాశారు. ఢిల్లీ సైన్స్ ఫోరమ్ సంయుక్త కార్యదర్శి అయిన జయప్రకాశ్, ఈ కేసును మొదటి నుండీ అనుసరిస్తున్నారు.

భోపాల్ గ్యాస్ దుర్ఘటన తరువాత బాధిత కుటుంబాలకు నష్టపరిహారాన్ని కోరుతూ, ప్రభావితులైనవారి వైద్య రికార్డులను డిజిటలైజ్ చేయడం కోసం గత కొన్ని దశాబ్దాలుగా చట్టపరమైన పోరాటాలు కొనసాగుతున్నాయి. రెండు క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయబడ్డాయి: 1992లో, ఇప్పుడు పూర్తిగా యుసిసిని తన యాజమాన్యంలోకి తీసుకున్న డౌ కెమికల్ కంపెనీకి వ్యతిరేకంగా; 2010లో యుసిఐఎల్ పైనా, దాని అధికారులపైనా. ఈ రెండు కేసులు భోపాల్ జిల్లా కోర్టులో పెండింగ్‌లో ఉన్నాయని జయప్రకాశ్ తెలియజేశారు.

PHOTO • Smita Khator
PHOTO • Smita Khator

ఎడమ, కుడి: కర్మాగారం ప్రాంగణం వెలుపల డచ్ శిల్పి, నాజీ నరమేధ బాధితురాలు రూత్ వాటర్‌మాన్ 1985లో సృష్టించిన తల్లీబిడ్డల విగ్రహం. ఇది యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ వెలుపల నిర్మించిన మొట్టమొదటి ప్రజా స్మారక చిహ్నం. ఈ విగ్రహంపై 'మరో భోపాల్ వద్దు, మరో హిరోషిమా వద్దు' అనే సందేశం రాసివుంది

PHOTO • Smita Khator
PHOTO • Smita Khator

ఎడమ: ఫ్యాక్టరీ సమీపంలో ఉన్న కుడ్యచిత్రం. కుడి: ఈ విగ్రహం కర్మాగారం సరిహద్దు గోడల వద్ద ఉంది

2010లో జరిగిన దిల్లీ చలో ఆందోళన్ లో షఫీక్ పాల్గొన్నారు. భోపాల్ దుర్ఘటన నుండి బతికి బయటపడినవారు కాలినడకన భోపాల్ నుండి దిల్లీకి నడిచి వచ్చి ఈ ఆందోళనను నిర్వహించారు. “ ఇలాజ్ [చికిత్స], ముఆఫ్జా [పరిహారం] ఔర్ సాఫ్ పానీ [పరిశుభ్రమైన నీరు] కే లియే థా ,” అని అతను చెప్పారు. రాజధానిలోని జంతర్ మంతర్ వద్ద 38 రోజుల పాటు నిరసనకు కూర్చున్న వారు ప్రధాని నివాసంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు, అక్కడ వారిని పోలీసులు అరెస్టు చేశారు.

“ప్రధానంగా రెండు కేసుల మీద బాధితులు, వారి కుటుంబాలు పోరాడుతున్నారు. భారత సర్వోన్నత న్యాయస్థానం (SC) ముందు ఒక కేసు, జబల్‌పూర్‌లోని మధ్యప్రదేశ్ హైకోర్టు ముందు రెండవ కేసు ఉన్నాయి,” అని భోపాల్ గ్యాస్ పీడిత్ సంఘర్ష్ సహయోగ్ సమితి (భోపాల్ గ్యాస్ బాధితుల పోరాటానికి మద్దతునిచ్చే కూటమి) కో-కన్వీనర్ ఎన్.డి. జయప్రకాశ్ ధృవీకరించారు.

*****

" పేడ్ కాలే హో గయే థే, పత్తే జో హరే థే, నీలే హో గయే, ధూవా థా హర్ తరఫ్ [చెట్లు నల్లబడిపోయాయి, ఆకుపచ్చని ఆకులు నీలం రంగులోకి మారిపోయాయి, అంతటా పొగలు కమ్ముకున్నాయి]," నగరం ఎలా ఒక స్మశాన వాటికలా మారిపోయిందో తాహిరా బేగమ్ గుర్తుచేసుకున్నారు.

"ఆయన [మా నాన్న] మా ఇంటి వరండాలో నిద్రపోతున్నాడు," ఆమె ఆ రాత్రిని గుర్తుచేసుకున్నారు. " ఖరాబ్ హవా [చెడు గాలి] వీచడం మొదలైనప్పుడు, ఆయన దగ్గుతూ నిద్రలోంచి లేచాడు. ఆయనను హమీదియా ఆసుపత్రికి తీసుకెళ్ళారు." మూడు రోజుల తర్వాత డిశ్చార్జ్ అయినప్పటికీ, "శ్వాస తీసుకునే సమస్య ఎప్పుడూ తగ్గనేలేదు, ఆయన మూడు నెలల్లోనే మరణించాడు," అన్నారు తాహిరా. వారి కుటుంబం నష్టపరిహారంగా రూ. 50,000 అందుకుంది, కాగా కోర్టులో జరుగుతోన్న న్యాయ పోరాటాల గురించి ఆ కుటుంబానికి తెలియదు.

PHOTO • Nayan Shendre
PHOTO • Prabhu Mamadapur

ఎడమ: భోపాల్ గ్యాస్ దుర్ఘటనలో తండ్రిని కోల్పోయిన తాహిరా బేగమ్ (నీలి రంగు దుపట్టాలో). 1985 నుండి ఆమె శక్తి నగర్‌లో ఉన్న ఒక అంగన్వాడీలో పనిచేస్తున్నారు. కుడి: భోపాల్ APU విద్యార్థులు తయారుచేసిన కాలనీ మ్యాప్, ఆ పరిసరాలలో నివాసముండేవారిపై విషవాయువు ప్రభావాన్ని హైలైట్ చేసి చూపిస్తోంది

ఆ దుర్ఘటన తరువాత, నగరవాసులు చనిపోయినవారిని పాతిపెట్టడం కోసం సామూహిక సమాధులను తవ్వారు. అటువంటి ఒక సమాధిలో ఆమె మేనత్త ఒకరు సజీవంగా కనిపించారు. "మా బంధువుల్లో ఒకరు ఆమెను గుర్తించి, బయటకు లాగారు" అని తాహిరా గుర్తుచేసుకున్నారు.

యుసిఐఎల్ ఫ్యాక్టరీకి కూతవేటు దూరంలో ఉన్న శక్తి నగర్‌లోని ఓ అంగన్‌వాడీలో సుమారు 40 ఏళ్ళుగా తాహిరా పనిచేస్తున్నారు. ఆ దుర్ఘటనలో తన తండ్రిని కోల్పోయిన ఒక ఏడాది తర్వాత ఆమె ఇక్కడ చేరారు.

ఆమె తండ్రిగారి అంత్యక్రియలు ముగిసిన తర్వాత ఆమె కుటుంబం ఝాన్సీకి వెళ్ళింది. 25 రోజుల తర్వాత వారు తిరిగి వచ్చేసరికి, "సిర్ఫ్ ముర్గియాఁ బచీ థీ, బాకీ జాన్వర్ సబ్ మర్ గయే థే [కోళ్ళు మాత్రమే బతికివున్నాయి. మిగిలిన జంతువులన్నీ చచ్చిపోయాయి]," అన్నారామె.

కవర్ ఫోటో: స్మితా ఖటోర్

ఈ కథనాన్ని రూపొందించడంలో తమ సహాయాన్ని అందించినందుకు భోపాల్‌, అజీమ్ ప్రేమ్‌జీ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ సీమా శర్మ, ప్రొఫెసర్ మోహిత్ గాంధీలకు PARI ధన్యవాదాలు తెలియజేస్తోంది

అనువాదం: సుధామయి సత్తెనపల్లి

Student Reporter : Prabhu Mamadapur

Prabhu Mamadapur is pursuing a Masters in Public Health from Azim Premji University, Bhopal. He is an Ayurvedic doctor interested in technology and public health. LinkedInhttps://www.linkedin.com/in/dr-prabhu-mamadapur-b159a7143/

यांचे इतर लिखाण Prabhu Mamadapur
Editor : Sarbajaya Bhattacharya

Sarbajaya Bhattacharya is a Senior Assistant Editor at PARI. She is an experienced Bangla translator. Based in Kolkata, she is interested in the history of the city and travel literature.

यांचे इतर लिखाण Sarbajaya Bhattacharya
Editor : Priti David

प्रीती डेव्हिड पारीची वार्ताहर व शिक्षण विभागाची संपादक आहे. ग्रामीण भागांचे प्रश्न शाळा आणि महाविद्यालयांच्या वर्गांमध्ये आणि अभ्यासक्रमांमध्ये यावेत यासाठी ती काम करते.

यांचे इतर लिखाण Priti David
Translator : Sudhamayi Sattenapalli

Sudhamayi Sattenapalli, is one of editors in Emaata Web magazine. She translated Mahasweta Devi's “Jhanseer Rani“ into Telugu.

यांचे इतर लिखाण Sudhamayi Sattenapalli