లీంబడీ హైవే నుండి చీలిపోయిన రాళ్ళు పరచిన బాట 10-12 కిలోమీటర్ల దూరంలో ఉన్న మోటా టింబ్లా గ్రామం వరకు విస్తరించి ఉంది. గ్రామం చివరి అంచున, ఇక్కడ నివసించే దళిత నేత సముదాయాల ఇళ్ళ కోసం కేటాయించిన వణకరవాస్ ఉంది. ఖట్-ఖట్... ఖట్-ఖట్ అంటోన్న నాడె మగ్గాల లయబద్ధమైన శబ్దాలు పాతకాలపు పెంకుల పైకప్పులున్న ఇళ్ళతో పాటు కొన్ని గడ్డితో కప్పిన ఇళ్ళ మధ్యనున్న ఇరుకైన సందులలో ప్రతిధ్వనిస్తాయి. అప్పుడప్పుడూ వినిపించే ఒకటో రెండో గొంతులు చేనేతమగ్గం చేస్తోన్న లయబద్ధమైన చప్పుడుకు అంతరాయం కలిగిస్తున్నాయి. నిశితంగా వినండి, మీరు శ్రమ చేస్తోన్న శబ్దాన్ని కూడా వింటారు. మరింత దగ్గరగా వినండి, రేఖా బెన్ వాఘేలా కథకు ముందుమాటలా, ఒక సంక్లిష్టమైన నమూనాను నేస్తోన్న మగ్గం ర్యాప్-ట్రాప్-ర్యాప్ బిగ్గర ధ్వనుల మధ్య ఒక విచారపు మంద్రధ్వనిని మీరు పట్టుకోవచ్చు.
"నేను 8వ తరగతిలో మహా అయితే మూడు నెలలు ఉన్నాను. లీంబడీలో ఒక హాస్టల్లో ఉండే నేను పాఠశాలలో మొదటి పరీక్ష అయిపోయాక ఇంటికి వచ్చాను. అప్పుడే నేనింక చదవబోవటంలేదని మా అమ్మ చెప్పింది. మా అన్న గోపాల్ భాయికి సహాయం అవసరం. అతను జీవనోపాధి సాధన కోసం గ్రాడ్యుయేషన్‌కు ముందే చదువు మానేశాడు. నా ఇద్దరు సోదరులను చదివించడానికి నా కుటుంబం వద్ద ఎప్పుడూ డబ్బు ఉండేదికాదు. ఆ విధంగా నేను పటోలా పనిని మొదలుపెట్టాను," పేదరికం పదునుపెట్టే అన్ని విషయాలలాగే రేఖా బెన్ మాటలు కూడా సూటిగా, కానీ పదునుగా ఉన్నాయి. ప్రస్తుతం నలబైల వయసులో ఉన్న ఆమె గుజరాత్ సురేంద్రనగర్ జిల్లాలోని మోటా టింబ్లాకు చెందిన నిపుణురాలైన నేతరి.
"నా భర్త మద్యం, జూదం, పాన్ మసాలా, పొగాకులకు బానిసయ్యాడు," పెళ్ళి తర్వాత తన జీవిత కథలోని మరో దారాన్ని - కొంచెం కూడా సంతోషం లేనిదాన్ని - లాగుతూ చెప్పారు రేఖ. చాలా తరచుగా ఆమె తన భర్తను వదిలి పుట్టింటికి వస్తుండేది, కానీ నచ్చచెప్పి మళ్ళీ అతని దగ్గరకే పంపేవారు. ఆమె చాలా దీనస్థితిలో ఉండేవారు. అయినా అదంతా భరించారు. "అతను మంచి స్వభావం కలిగినవాడు కాదు," అని ఆమె ఇప్పుడు చెప్తున్నారు.
"నన్ను అప్పుడప్పుడూ కొడుతుండేవాడు, నేను గర్భంతో ఉన్నప్పుడు కూడా," అన్నారామె. ఆమె గొంతులో ఆ గాయాల పచ్చిదనాన్ని మనం వినగలం. "నా కూతురు పుట్టిన తర్వాత అతనికి ఉన్న ప్రేమ వ్యవహారం గురించి నాకు తెలిసింది. అలాగే ఒక ఏడాదిపాటు కొనసాగాను. అప్పుడే గోపాల్ భాయ్ ప్రమాదంలో చనిపోయాడు [2010లో]. అతని పటోలా పని మొత్తం నిలిచిపోయింది. తనకు సరుకు ఇచ్చిన వ్యాపారికి ఆయన బాకీపడ్డాడు. అందుచేత తర్వాత ఐదు నెలలు నేను అక్కడే [పుట్టింటిలో] ఉండిపోయి, ఆయన పనినంతా పూర్తిచేశాను. ఆ తర్వాత నన్ను తనతో తీసుకువెళ్ళేందుకు నా భర్త వచ్చాడు," చెప్పారామె.
చిన్న పాప సంరక్షణను చూసుకుంటూ, బాధను తనలో తానే దిగమింగుకుంటూ, సంతోషంగా ఉన్నట్టు తనను తాను మోసం చేసుకుంటూ మరి కొన్నేళ్ళు గడిచాయి. "చివరకు నా కూతురికి నాలుగన్నరేళ్ళ వయసప్పుడు ఆ చిత్రహింసను ఇంకెంతమాత్రం భరించలేక నేను వచ్చేశాను," అన్నారు రేఖా బెన్. బడి వదిలేశాక తాను నేర్చుకున్న ఆ పటోలా నేత నైపుణ్యం, తన భర్తను వదిలేసి వచ్చాక ఇప్పుడామెకు అక్కరకు వచ్చింది. పేదరికం చేసిన లోతైన మొరటు గాయాలను అది నయంచేసి, ఆమె జీవితానికి ఒక కొత్త ఆరంభాన్ని ఇచ్చింది. అది కూడా చాలా బలమైన ఆరంభం.


















