గోకుల్ అనునిత్యం నిప్పుతో పనిచేస్తారు. ఆయన ఇనుమును ఎర్రగా కాల్చి, దానిని సుత్తెతో సాగగొట్టి కావలసిన ఆకారంలోకి మలుస్తారు. ఎగసిన నిప్పు రవ్వలు ఆయన వేసుకున్న బట్టలకూ బూట్లకూ రంధ్రాలు చేస్తాయి; ఆయన చేతులపై ఉన్న కాలిన గాయాలు భారత ఆర్థిక వ్యవస్థ చక్రాలను కదిలించడంలో ఆయన పడే శ్రమకు సాక్ష్యంగా నిలుస్తాయి.
బడ్జెట్ గురించి విన్నారా అని అడిగినప్పుడు, "క్యా హుందా హై [అంటే ఏంటది]?" అన్నారతను.
పార్లమెంటులో 2025 కేంద్ర బడ్జెట్ను సమర్పించిన 48 గంటల లోపే అది దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. కానీ బాగడియా సముదాయానికి చెందిన ఈ సంచార కమ్మరి గోకుల్కి మాత్రం ఏమీ మారలేదు.
"నే చెప్తున్నా వినండి, ఎవరూ మాకోసం ఏమీ చేసింది లేదు. దాదాపు 700-800 ఏళ్ళుగా ఇలాగే సాగిపోతోంది. మా తరతరాలన్నీ పంజాబ్ మట్టిలోనే సమాధి అయ్యాయి. ఎవ్వరూ మాకేమీ ఇవ్వలేదు," నలభైల వయసులో ఉన్న ఆ కమ్మరి చెప్పారు.




