ఇంకా పదేళ్ళు కూడా నిండని ఇజాజ్, ఇమ్రాన్, యాసిర్, షమీమాలు చాలా కొద్ది సంవత్సరాలు మాత్రమే బడికి వెళ్ళి చదువుకున్నారు. ప్రతి సంవత్సరం వాళ్ళు తమ తల్లిదండ్రులతో కలిసి వలసపోవటం వలన ఒక నాలుగు నెలలపాటు బడి చదువును కోల్పోతున్నారు. పదజాలం, రాతలో నేర్పుతో పాటు ప్రాథమిక గణితం, పరిసరాల విజ్ఞానం, సామాజిక అధ్యయనాలలో పాఠాల వంటి కీలకమైన ప్రాథమిక పాఠశాల విద్యలో వెనుకబడిపోతుంటారు.
పిల్లలకు పదేళ్ళు వచ్చే సమయానికి, తరగతి గదికి దూరంగా ఉన్న కాలం మొత్తం ఒక సంవత్సరం వరకూ అవుతుంది. అత్యుత్తమమైన మొదటి బెంచీ చదువరులకు కూడా అది ఒక దారుణమైన, అధిగమించరాని కష్టం.
కానీ ఇకపై అలా ఎంతమాత్రమూ జరగదు. వారు బడి నుండి దూరంగా వలస వెళ్ళేటప్పుడు వారితోపాటే ప్రయాణిస్తూ చదువుచెప్పే ఉపాధ్యాయుడు అలీ మహమ్మద్ ఉన్నాడు. పాతికేళ్ళ అలీ పర్వతాల మీదుగా కాశ్మీర్‌లోని లిద్దర్ లోయలో ఉండే గుజ్జర్‌ల స్థావరమైన ఖలాన్‌కు రావడం మొదలుపెట్టి ఇది మూడవ సంవత్సరం. రాబోయే నాలుగు నెలల వేసవి (జూన్ నుండి సెప్టెంబరు) ముగిసేవరకూ అతను చిన్న పిల్లలకు బోధించడానికి - తమ జంతువుల వేసవికాలపు మేత బయళ్ళకోసం వలస వచ్చిన గుజ్జర్ కుటుంబాలతో పాటు - ఇక్కడే ఉంటాడు.
"నేను కూడా ఉపాధ్యాయురాలిని అవుదామనుకుంటున్నాను," తన ముందు తెరచిపెట్టివున్న వర్క్‌బుక్‌లోకి మళ్ళీ తలదూరుస్తూ సిగ్గుపడుతూ అంది షమిమా జాన్. ఆ వర్క్‌బుక్‌ను ప్రభుత్వమే సరఫరాచేసింది. ఒకోసారి పిల్లలకు వెంటనే అవసరమైన సామగ్రిని అలీ తన సొంత డబ్బు వెచ్చించి పిల్లలకు కొనిస్తుంటాడు.












