"ఆంగ్లం" అని చెప్పారు ఆ తరగతిలోని పిల్లలు. మేం వాళ్ళను ఇప్పుడే మీకు నచ్చిన సబ్జెక్ట్ ఏమిటి అని అడిగాం. భారతదేశపు ఒక తరగతి గదిలో అడగాల్సినంత తెలివైన ప్రశ్నేమీ కాదు. మొదటి ఇద్దరు పిల్లలు "ఆంగ్లం" అని చెప్తే, తరగతిలోని ప్రతి అల్లరి పిడుగు అదే సమాధానం చెప్తుంది. మొదటి ఇద్దరు బాధితులు శిక్షకు గురికాకుండా సమాధానం ఇవ్వడం చూసినప్పుడు, ఇదే మార్గం అని మిగతావారికి తెలుస్తుంది కదా!
అయితే ఇది కేవలం అన్ని ప్రదేశాల వంటి ప్రదేశం కాదు. ఇది ఇడలిప్పారా గ్రామంలోని ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ ఏకోపాధ్యాయ పాఠశాల. ఇది కేరళలోని మారుమూల ప్రాంతంలోని ఏకైక ఆదివాసీ పంచాయతీ ఇడమలక్కుడిలో ఉంది. ఈ బడికి వెలుపల ఎక్కడా మీరు ఆంగ్లంలో మాట్లాడటాన్ని వినలేరు. ఆ భాషలో రాసిన బోర్డులు కానీ, పోస్టర్లు కానీ, చివరకు సంకేతాలు కానీ మనకు కనిపించవు. అయినాకూడా పిల్లలు ఆంగ్లమే తమకిష్టమైన సబ్జెక్ట్ అని చెపుతారు. అనేక ఇతర బడుల్లోలాగే ఇడుక్కి జిల్లాలోని ఈ బడిలో కూడా 1-4 తరగతులను కలిపి ఒక ఒంటిగదిలో నడిపిస్తున్నారు. చాలా తక్కువ జీతం, చాలా ఎక్కువ పని, అసాధ్యమైన పనిపరిస్థితులతో పోరాడుతున్నప్పటికీ, తన సమూహానికే అంకితమైన ఒక నిజంగా అధ్బుతమైన ఉపాధ్యాయిని నేతృత్వంలో ఈ బడి నడుస్తోంది.
ఇక్కడే ఒక భిన్నాభిప్రాయం కూడా ఉంది. "గణితం" అన్నాడు ఒక చిన్ని ధైర్యవంతుడు లేచి నిలబడుతూ. ఏదీ, మీ లెక్కల ప్రావీణ్యమేమిటో చూపించండి చూద్దాం, అని మేం డిమాండ్ చేశాం. తన చిన్న ఛాతీని పొంగించి, ఊపిరి తీసుకోవటానికి గానీ, ప్రశంసలు అందుకోవటానికి గానీ ఆగకుండా ఒక్క బిగిన 1-12 వరకూ గడగడా ఎక్కాలు అప్పచెప్పేశాడు. మేం అతన్ని ఆపేసరికి అతను ఎక్కాలు అప్పచెప్పటంలో రెండో రౌండ్‌లో ఉన్నాడనిపించింది.





