ముగ్గురు యువకులు ఓ నిర్మాణ ప్రదేశంలో పని ముగించుకొని మారీలోని తమ ఇళ్ళకు తిరిగి వస్తున్నారు. "ఇది 15 ఏళ్ళ క్రితం జరిగింది. మేం మా గ్రామంలో నిర్జనంగా ఉండే మసీదును దాటుతూ, దాని లోపల ఏముందో చూడాలని అనుకున్నాం. మాకు చాలా ఆసక్తిగా ఉండింది," అని వాళ్ళలో ఒకరైన అజయ్ పాశ్వాన్ గుర్తు చేసుకున్నారు.
మసీదు నేలంతా నాచు పరచుకుని ఉంది, ఆ నిర్మాణం నిండా పొదలు పెరిగివున్నాయి.
"అందర్ గయే తో హమ్ లోగోఁ కా మన్ బదల్ గయా [మేం లోపలికి వెళ్ళగానే, మా మనసు మారిపోయింది]," అని 33 ఏళ్ళ ఆ రోజువారీ కూలీ అన్నారు. "బహుశా అల్లానే మమ్మల్ని లోపలికి పంపాడేమో."
ఆ ముగ్గురూ - అజయ్ పాశ్వాన్, బఖోరీ బింద్, గౌతమ్ ప్రసాద్ - దానిని శుభ్రం చేయాలని నిర్ణయించుకున్నారు. “లోపల అడవిలాగా పెరిగిన పొదలను, మొక్కలను శుభ్రంగా కొట్టేశాం. మసీదుకు రంగులు వేశాం. మసీదుకు ముందు పెద్ద వేదికను నిర్మించాం,” అని అజయ్ చెప్పారు. వాళ్ళు సాయంసంధ్యా దీపం వెలిగించడం కూడా ప్రారంభించారు.
వాళ్ళు ముగ్గురూ మసీదులో ఒక సౌండ్ సిస్టమ్‌ను అమర్చి, మసీదు గుమ్మటం మీద ఒక లౌడ్‌స్పీకర్‌ను వేలాడదీశారు. "సౌండ్ సిస్టమ్ ద్వారా మేం ఆజాన్ వినిపించాలనుకున్నాం," అని అజయ్ చెప్పారు. ఆ రోజు నుంచి బిహార్ లోని నలంద జిల్లాలో ఉన్న మారీ అనే ఆ గ్రామంలో రోజుకు ఐదుసార్లు ఆజాన్ (ముస్లిమ్‌లకు ప్రార్థన చేయాలనే పిలుపు) వినిపించడం ప్రారంభమైంది.












