"కలకత్తా, జైపూర్, ఢిల్లీ, బొంబాయి- ఏ పట్టణానికైనా వెదురు పోలో బంతులు నేరుగా దేవుల్‌పుర్ నుంచే సరఫరా అయ్యేవి," అంటారు రంజిత్ మాల్, భారతదేశంలో పోలో ఆటను ఆడే ప్రదేశాల గురించి మాట్లాడుతూ.
పశ్చిమ బెంగాల్, దేవుల్‌పుర్ పట్టణానికి చెందిన నిపుణుడైన పోలో బంతుల తయారీ కళాకారుడు 71 ఏళ్ళ రంజిత్, దగ్గర దగ్గర 40 ఏళ్ళుగా గువాదువా వెదురు మూలం (మూల వేరు) నుంచి బంతులను చెక్కుతున్నారు. స్థానికంగా బాఁశ్-ఎర్ ఘొడోలు గా పిలిచే ఈ మూల వేర్లు, నేలలోంచి వెదురు మొక్క పెరగడానికి సహాయపడతాయి. ఈనాటికి చరిత్రలో భాగం అయిపోయిన ఈ నైపుణ్యం గురించి మాట్లాడుతూ, ఈ కళ తెలిసిన చివరి శిల్పకారుడు తానేనని రంజిత్ చెప్తారు.
అయితే, ప్రారంభంలో మిలిటరీ, రాజ కుటుంబీకులు, ఉన్నతవర్గాలలో ప్రాచుర్యం పొందిన దాదాపు 160 ఏళ్ళ ఆధునిక పోలో ఆటకు కావలసిన వెదురు బంతులు దేవుల్‌పుర్ నుండే వచ్చేవి. నిజానికి, ప్రపంచంలోనే మొదటి పోలో క్లబ్‌ను 1859లో అస్సామ్‌లోని శిల్చర్‌లో స్థాపించారు; రెండవది 1863లో కలకత్తాలో స్థాపితమైంది. ఆధునిక పోలో ఆట సాగోల్ కాంగ్జేయి (మణిపుర్‌కు చెందిన మైతేయీ తెగ వారి సంప్రదాయక క్రీడ) నుంచి పొందుపడినది. వెదురు మూలంతో తయారుచేసిన బంతులను మైతేయీలు వాడేవారు.
1940ల ప్రారంభంలో, దేవుల్‌పుర్‌కు చెందిన ఆరేడు కుటుంబాలు సంవత్సరానికి దగ్గర దగ్గర లక్ష బంతులను తయారుచేసే 125 మంది కళాకారులకు ఉపాధిని కల్పించాయి. "నైపుణ్యం కలిగిన మా శిల్పకారులకు పోలో విపణి గురించి తెలుసు," అంటారు రంజిత్. ఆయన వ్యాఖ్యలను బ్రిటిష్ యుగంలో వచ్చిన హౌరా జిల్లాకు చెందిన సర్వే అండ్ సెటిల్మెంట్ నివేదిక ధృవీకరించింది: "భారతదేశం మొత్తంలో దేవుల్‌పుర్ మాత్రమే పోలో బంతులను తయారుచేసే ప్రదేశంగా కనపడుతోంది."
"అభివృద్ధి చెందుతున్న పోలో బంతుల వ్యాపారాన్ని చూసి, మా నాన్న నాకు 14 ఏళ్ళకే పెళ్ళి చేసేశారు," అన్నారు రంజిత్ భార్య, మినొతి. ప్రస్తుతం 60 ఏళ్ళు దాటిన ఆమె, పదేళ్ళ కిందటి వరకు ఈ బంతుల తయారీలో తన భర్తకు సహాయం చేసేవారు. వారి కుటుంబం పశ్చిమ బెంగాల్‌లో షెడ్యూల్డ్ కులంగా జాబితా చేసివున్న మాల్ సముదాయానికి చెందినది; రంజిత్ తన జీవితమంతా దేవుల్‌పుర్ లోనే జీవించారు.
తన ఇంట్లో 'మాదుర్' గడ్డితో అల్లిన చాప మీద కూర్చుని ఉన్న రంజిత్, పాత వార్తాపత్రికల నుంచి, పత్రికల వ్యాసాల నుంచి సేకరించిన తన విలువైన సంపదను తిరగేస్తున్నారు. "ఈ ప్రపంచంలో ఎక్కడైనా మీకు లుంగీ కట్టుకొని పోలో బంతులు తయారుచేస్తున్న మనిషి బొమ్మ కనిపించిందంటే, అది నాదే!" అంటారాయన సగర్వంగా.
సుభాస్ బాగ్‌కు చెందిన కర్మాగారంలో టేప్ రికార్డర్‌లో మొహమ్మద్ రఫీ పాటలను వింటూ పని చేసుకుంటున్న ఒక సాధారణ పనిదినాన్ని గుర్తుచేసుకుంటారు రంజిత్. "నేను చాలా పెద్ద రఫీ భక్తొ (అభిమానిని). అయన పాటలు కేసెట్‌లుగా కూడా నా దగ్గర ఉన్నాయి," అంటారాయన నవ్వుతూ. కలకత్తాలోని ఫోర్ట్ విలియమ్ నుండి పోలో ఆడే సైనిక అధికారులు బంతులను కొనుగోలు చేయడానికి వచ్చేవారు. " గాన్ శునే పొచొందొ హొయ్ గేఛిలొ. సొబ్ కేసెట్ నియె గెలో (ఆ అధికారులు ఆ పాటలు విని ఇష్టపడేవారు. ఆ తర్వాత ఆ కేసెట్లన్నీ వారితో పట్టుకుపోయేవారు)," గుర్తుచేసుకుంటారు రంజిత్.
దేవుల్‌పుర్ గువాదువా వెదురు సులభంగా దొరికే ప్రదేశంగా పేరెన్నికగన్నది. స్థానికంగా ఘొడో బాఁశ్ గా పిలిచే ఈ వెదురు హౌరా జిల్లాలోని ఈ ప్రదేశంలో సమృద్ధిగా లభిస్తుంది. గువాదువా వెదురు గుబురుగా పెరుగుతూ, నేల లోపల ధృడమైన పొడవైన దుంపలు పెరిగేలా చేస్తుంది, వీటినుంచే పోలో బంతులను తయారుచేస్తారు.
"ప్రతి వెదురు జాతిలోనూ పోలో బంతుల తయారీకి సమతూగే బరువు, పరిణామం కల దుంపలు ఉండవు," వివరించారు రంజిత్. భారత పోలో అసోసియేషన్ ప్రమాణాల ప్రకారం, ప్రతి బంతి సరిగ్గా 70-90 మిల్లీమీటర్ల వ్యాసం, 150 గ్రాముల బరువు కలిగి ఉండాలి.
1990ల వరకు, అన్ని పోలో బంతులను ఈ పదార్థంతోనే చేసేవారు. "క్రమంగా ఆర్జెంటీనా నుండి వచ్చిన ఫైబర్‌గ్లాస్ బంతులు వీటి (వెదురు బంతులు) స్థానాన్ని ఆక్రమించేశాయి," అంటారు ఈ అనుభవజ్ఞుడైన నిపుణుడు.
ఫైబర్‌గ్లాస్ బంతులు వెదురు బంతుల కన్నా మన్నికైనవి, చాలా ఖరీదైనవి కూడా. కానీ "పోలో ఆట ప్రొచూర్ ధనీ లోక్ (అత్యంత ధనవంతుల) ఆటగానే కొనసాగుతోంది కాబట్టి బంతుల కొనుగోలుపై ఎక్కువ డబ్బు ఖర్చుపెట్టడం వారికి పెద్ద పనేమీ కాదు," అంటారు రంజిత్. విపణిలో వచ్చిన ఈ మార్పు దేవుల్‌పుర్‌కు చెందిన ఈ కళను నాశనంచేసింది. "2009కి ముందు ఇక్కడ 100-150 మంది బంతి తయారీ కళాకారులు ఉండేవారు," అంటారాయన. "2015 వచ్చేసరికి, పోలో బంతులు తయారుచేసేవాడిని నేనొక్కడినే మిగిలాను." కానీ కొనేవాళ్ళే లేరు.
*****
కొడవలి చేతపట్టుకొని, నన్నూ రంజిత్‌నూ వెంటబెట్టుకొని మినొతి తమ బాఁశ్-ఏర్ బాగాన్ (వెదురు తోపు)కు బయలుదేరారు. ఈ జంటకు వారి ఇంటి నుండి 200 మీటర్ల అవతల ఆరు కాఠాల భూమి ఉంది. ఆ భూమిలో వీరు తమ కుటుంబ వినియోగం కోసం పండ్లు, కూరగాయలు పండిస్తారు, మిగిలిన పంటను స్థానిక వ్యాపారులకు అమ్ముకుంటారు.
"ఒకసారి వెదురు బొంగును నరికాక, భూమి లోపలి నుంచి వెదురుమూలాన్ని వెలికితీయాలి," వెదురు మూలాన్ని బయటకు తీసే ప్రక్రియను గురించి చెప్పారు మినొతి. ఈ పనిని ప్రధానంగా దేవుల్‌పుర్‌కు చెందిన సర్దార్ సముదాయం చేస్తుంది. రంజిత్ వారి నుంచి వెదురు దుంపను తీసుకుంటారు - 2-3 కిలోల బరువుందే దుంపను రూ. 25-35కు అమ్ముతారు.
ఆ దుంపలను దాదాపు నాలుగు నెలల పాటు ఎండలో ఎండబెట్టాల్సి ఉంటుంది, " నా శుక్లే, కాచా అబొస్థా-తే బాల్ చిట్-కె జాబే. తేఢా బేకా హొయ్ జాబే (సరిగా ఎండకపోతే, బంతి ప గిలిపోతుంది, ఆకారాన్ని కోల్పోతుంది)," వివరిస్తారు రంజిత్.
దీని తరువాత, వాటిని 15-20 రోజుల పాటు చెరువులో నానబెడతారు. " రాద్-ఎ-పాకా (ఎండకు ఎండిన) దుంప మెత్తబడడానికి ఇలా నానబెట్టడం సహాయపడుతుంది. లేకుంటే ఈ దుంపను కోయడం కుదురదు," అంటారు ఆరితేరిన ఈ కళాకారుడు. "మళ్ళీ 15-20 రోజుల పాటు ఎండబెడతాం. అప్పుడే ఈ దుంప బంతి తయారీకి సిద్ధమవుతుంది."
దుంపను కాటారి (కొడవలి) లేదా కురుల్ (చేతి గొడ్డలి)తో చెక్కడం నుంచి కరాత్ (చేరంపం) ఉపయోగించి ఎగుడుదిగుడుగా ఉన్న దుంపను స్థూపాకారంలో కోయడం వరకు, "ప్రతి పనినీ కాలి మడమల మీద కూర్చుని చేయాల్సివుంటుంది," అంటారు, ప్రస్తుతం దీర్ఘకాల వెన్ను నొప్పితో బాధపడుతూ, మెల్లగా మాత్రమే నడవగలుగుతోన్న రంజిత్. "పోలో ఆట మా వంటి శిల్పకారుల వీపుల మీద ఆడే ఆట," అంటారాయన.
వేరుమూలం (దుంప) నుంచి ఒకసారి సుమారుగా స్థూపాకారంగా ఉండే ముక్కలను కోశాక, ఉలిని రాయితో కొడుతూ, వాటిని సమంగా గోళాకారంలోకి చెక్కాల్సి ఉంటుంది. "దుంప పరిమాణాన్ని బట్టి ఒక దుంప నుంచి రెండు, మూడు, లేదా నాలుగు బంతులను కూడా చెక్కుతాం," అంటారు రంజిత్. చేతిలో పట్టుకునే ర్యాఁదా (ఆకురాయి)తో రాపిడిచేస్తూ బంతిని నునుపుగా చెక్కుతారు.
స్థానికంగా ఘొడో బాఁశ్‌గా పిలిచే గువాదువా వెదురు సులభంగా దొరికే ప్రదేశంగా దేవుల్‌పుర్ పేరెన్నికగన్నది. ఈ వెదురు హౌరా జిల్లాలోని ఈ ప్రదేశంలో సమృద్ధిగా లభిస్తుంది
ఒక పాత బంతిని తీసుకుంటూ మినొతి దాన్ని మెరిపించే ప్రక్రియను చూపించారు: "ఇంటిపనుల మధ్యలో, శిరిశ్ పేపర్ నియె బాల్ ఆమి మాజ్‌తాం (సాండ్ పేపర్‌ని ఉపయోగించి బంతిని మృదువుగా రుద్ది మెరుగుపెట్టేదాన్ని). ఆ తర్వాత బంతికి తెలుపు రంగు వేయాలి. కొన్నిసార్లు దానిపైన ముద్ర కూడా వేస్తాం," వివరించారామె..
ఒక్కో బంతిని పూర్తిచేయడానికి 20-25 నిముషాలు పడుతుంది. "ఒక రోజులో మేమిద్దరం కలిసి 20 బంతులను తయారుచేసి 200 రూపాయలు సంపాదించేవాళ్ళం," అంటారు రంజిత్.
నైపుణ్యంతో పాటు, పని తెలిసివుండటం, ప్రతి వివరంపైనా శ్రద్ధ అవసరమైన ఈ పనిలో రంజిత్ సంవత్సరాలు గడిచేకొద్దీ లాభం చూసింది చాలా తక్కువ. కార్ఖానా (కర్మాగారం)లో పోలో బంతులు తయారుచేయడం మొదలుపెట్టినప్పుడు ఆయన ఒక్కో బంతికి కేవలం 30 పైసలు సంపాదించేవారు. 2015 నాటికి, బంతి ధర 10 రూపాయలకు మాత్రమే పెరిగింది.
"దేవుల్‌పుర్ నుంచి ఒక్కో బంతి రూ.50కి అమ్ముడుపోయేది," అంటారాయన. ఒకసారి కలకత్తా పోలో క్లబ్ వెబ్‌సైట్ వర్తక విభాగంలో చూసినట్టయితే, శిల్పకారుల శ్రమ నుంచి భారీ లాభాలను ఆర్జించినట్టుగా తెలుస్తుంది.
ఈ బంతులను "పశ్చిమ బెంగాల్ గ్రామీణ పరిశ్రమలో ప్రత్యేకంగా తయారుచేసిన వెదురు బంతులు"గా వెబ్‌సైట్‌లో అభివర్ణించారు. ప్రస్తుతం ఒక్కో బంతి ధర రూ.150 పలుకుతోంది. ఇది ఒక్కో బంతి తయారుచేసినందుకు రంజిత్ సంపాదించే దానికన్నా 15 రెట్లు ఎక్కువ.
"ఒక పోలో ఆటకు 25-30 వెదురు బంతులు అవసరమవుతాయి. దుంప సహజమైనది కాబట్టి, బరువు మారుతూ ఉంటుంది. దీని ఆకారం కూడా త్వరగా మారిపోతుంది, లేదా పోలో ఆట జరుగుతున్నపుడు పదే పదే మాలెట్‌తో కొట్టడం వల్ల బంతిపై పగుళ్ళు ఏర్పడతాయి." ఇంత ఎక్కువగా బంతులు కావలసిరావటం గురించి వివరిస్తూ అన్నారు రంజిత్. మరోవైపు ఫైబర్‌గ్లాస్ బంతులు ఎక్కువ కాలం మన్నుతాయి: "ఇవైతే ఒక్కో ఆటకు మూడు నాలుగు బంతులు సరిపోతాయి," అంటారు రంజిత్.
దేవుల్‌పుర్‌కు 30 కిలోమీటర్ల దూరంలో 1860లలో స్థాపించిన కలకత్తా పోలో క్లబ్ దేవుల్‌పుర్‌లో పోలో బంతుల పరిశ్రమను ప్రోత్సహించింది. కానీ ఈ బంతులకు గిరాకీ తగ్గిపోవడంతో ఈ క్లబ్‌వాళ్ళు 2015కల్లా వెదురు బంతులను కొనుగోలు చేయడాన్ని ఆపేశారు.
*****
క్రీడలకు, క్రీడాస్ఫూర్తికి రంజిత్ కొత్తవారేమీ కాదు. గ్రామంలోని దేవుల్‌పుర్ ప్రగతి సంఘ క్రీడల క్లబ్ తరఫున ఆయన ఫుట్‌బాల్, క్రికెట్ ఆడేవారు. ఆ క్లబ్బుకు ఈయనే మొదటి కార్యదర్శి కూడా. " ఖూబ్ నామ్ థా హమారా గాఁవ్ మే (మా ఊరిలో నాకు చాలా పేరుంది), ఫాస్ట్ బౌలర్‌గానూ డిఫెండర్‌గాను," అని ఆయన గుర్తుచేసుకుంటారు.
ఆయన మొదట పనిచేయటం ప్రారంభించింది, సుభాస్ బాగ్‌కు చెందిన కార్ఖానాలో. పోలో బంతుల తయారీ కళను దేవుల్‌పుర్‌కు పరిచయం చేసిన ఘనత సుభాస్ తాతగారిదే. ప్రస్తుతం పోలోకు, దేవుల్‌పుర్‌కు మధ్య ఏకైక లంకెగా ఉన్న 55 ఏళ్ళ వయసున్న సుభాస్, ఇప్పుడు పోలో మాలెట్‌ల తయారీకి మారిపోయారు.
అర్ధ శతాబ్దం క్రితం, పోలో బంతుల తయారీ దేవుల్‌పుర్ నివాసులు చేపట్టిన అనేక జీవనోపాధి పనులలో ఒకటిగా ఉండేది. " జరీ-ర్ కాజ్ (లోహపు దారాలతో చేసే ఎంబ్రాయిడరీ), బీడీ బాఁధా (బీడీలు చుట్టడం) నుంచి పోలో బంతుల తయారీ వరకు, మేం మా జీవనాన్ని కొనసాగించడానికి, మా ముగ్గురు పిల్లలను పెంచడానికి అన్ని విధానాలను ప్రయత్నించాం," అంటారు మినొతి. " సొబ్ అల్పొ పొయిసా-ర్ కాజ్ ఛిలో. ఖూబ్ కొష్టో హొయె ఛిలో (ఇవన్నీ అధిక శారీరక శ్రమ, తక్కువ సంపాదనతో కూడుకున్న పనులు. మేం చాలా కష్టపడ్డాం)," అంటారు రంజిత్.
"ఇప్పుడు 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న ధూలాగఢ్ చౌరస్తా చుట్టుపక్కల చాలా పరిశ్రమలు వచ్చేశాయి," ప్రజలకు మంచి ఉద్యోగావకాశాలు అందుబాటులోకి రావడం పట్ల రంజిత్ సంతోషంగా ఉన్నారు. "ఇప్పుడు ప్రతి ఇంటి నుంచి కనీసం ఒక మనిషి జీతం వచ్చే ఉద్యోగం చేస్తున్నారు. కానీ కొంతమంది ఇంకా ఇంట్లో జరీ-ర్ కాజ్ పని చేస్తున్నారు," అన్నారు మినొతి. దేవుల్‌పుర్‌కు చెందిన 3,253 మంది ప్రజలు కుటీర పరిశ్రమల్లోనే పనిచేస్తున్నారు (2011 జనగణన).
ఈ జంట ప్రస్తుతం తమ చిన్న కొడుకు సౌమిత్(31), కోడలు సుమనలతో కలిసి జీవిస్తున్నారు. సౌమిత్ కొల్‌కతాకు దగ్గరలో ఉన్న ఒక సిసిటివి కెమెరా కంపెనీలో పనిచేస్తున్నారు. పట్టభద్రురాలు అవ్వగానే ఉద్యోగం వస్తుందన్న ఆశతో సుమన డిగ్రీ చదువుకుంటోంది.
*****
"నాలాంటి శిల్పకారులు ఈ కళకే అన్నీ అంకితం చేశారు, కానీ పోలో ఆటగాళ్ళ నుంచి కానీ, ప్రభుత్వం నుంచి కానీ మేం తిరిగి పొందినదేమీ లేదు," అంటారు రంజిత్.
సాంప్రదాయిక కళలను, నైపుణ్యాలను అభివృద్ధిపరచడానికి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం 2013లో యునెస్కోతో చేయికలిపి గ్రామీణ క్రాఫ్ట్ హబ్ ప్రాజెక్టులను మొదలుపెట్టింది. ప్రస్తుతం మూడవ దశలో ఉన్న ఈ భాగస్వామ్యం రాష్ట్రవ్యాప్తంగా 50,000 మంది లబ్దిదారులకు సహాయపడుతోంది, కానీ వారిలో వెదురు పోలో బంతులను తయారుచేసే కళాకారులు ఒక్కరు కూడా లేరు.
"మా కళ అంతరించిపోకుండా చర్యలు తీసుకోవాలని అడగడానికి మేం 2017-18లో నబాన్నా (రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యాలయం)కు వెళ్ళాం. మా పరిస్థితిని వివరించి, దరఖాస్తులు చేశాం, కానీ ఏం లాభం లేకపోయింది," అంటారు రంజిత్. "మా ఆర్ధిక పరిస్థితి ఏం కావాలి? మేం ఏం తినాలి? మా పని, జీవనోపాధి ఇక చచ్చిపోయాయని మేం వాళ్ళని అడిగాం."
"బహుశా పోలో బంతులు చూడడానికి కంటికి ఇంపుగా ఉండవనేమో, వాటిని పట్టించుకోరు," అంటూ రంజిత్ ఒక్క క్షణం ఆగి, "...మా గురించి ఎవరూ ఎప్పుడూ ఆలోచించటంలేదు."
కొద్ది దూరంలో మధ్యాహ్న భోజనం కోసం బాటా చేప (మంచినీటి చిన్న గండుచేప)ను శుభ్రంచేస్తూ, రంజిత్ మాటలను వింటోన్న మినొతి, "మన దీర్ఘకాల శ్రమకు గుర్తింపు వస్తుందని నాకింకా నమ్మకంగానే ఉంది," అన్నారు.
ఏదేమైనా, రంజిత్ అంత ఆశతో ఏం లేరు. "కొద్ది సంవత్సరాల క్రితం వరకు కూడా పోలో ప్రపంచం మా తయారీదారుల మీదే ఆధారపడి ఉండేది. కానీ చాలా త్వరగా వాళ్ళు మారిపోయారు," అన్నారాయన. "ప్రస్తుతం అంతరించిపోయిన కళకు నేనొక రుజువును మాత్రమే.”
అనువాదం: మైత్రి సుధాకర్