ఉదయం 9 గంటల సమయం. ముంబైలోని ఆజాద్ మైదాన్ సరదాగా వారాంతపు ఆటకు సిద్ధమవుతోన్న యువ క్రికెటర్లతో సందడిగా ఉంది. ఆట సాగుతున్నప్పుడు ఆనందంతోనూ, వేదనతోనూ వేసే కేకలు తరచుగా వినవస్తున్నాయి.
అక్కడికి కేవలం 50 మీటర్ల దూరంలో, 5,000 మంది పాల్గొంటున్న మరో ‘ఆట నిశ్శబ్దంగా సాగుతోంది. ఇది చాలాకాలంగా కొనసాగుతోన్న ఆట. ముంబైలోని ఆజాద్ మైదాన్‌లో గత నెలలో వేలాదిమంది అధీకృత సామాజిక ఆరోగ్య కార్యకర్తలు (ఆశాలు) - ఆరోగ్య పరిరక్షణ కార్యకర్తలు - చేసే నిరసనలకు కనుచూపుమేరలో ముగింపు ఉన్నట్టుగా కనపడటంలేదు. ఫిబ్రవరి 9న ప్రారంభమైన ఈ ఆందోళనలో మొదటి వారంలోనే 50 మందికి పైగా మహిళలు ఆసుపత్రుల పాలయ్యారు.
రద్దీగా ఉన్న రహదారిని ఒక కంట కనిపెడుతూ, 30 ఏళ్ళు దాటిన ఒక ఆశా నేలపై కూర్చునివున్నారు. ఆమె ఇబ్బందిగా తన చుట్టూ చూస్తూ, దారినపోయే వ్యక్తుల చూపులను తప్పించుకుంటున్నారు. ఒక మహిళల బృందం ఆమె చుట్టూ గుమిగూడి, ఆమె త్వరత్వరగా బట్టలు మార్చుకునేటందుకు వీలు కల్పిస్తూ ఆమెను తమ దుపట్టాలతోనూ, ఒక చాదర్ (దుప్పటి)తోనూ కప్పారు.
కొన్ని గంటల తర్వాత, మధ్యాహ్నపు భోజనం సమయంలో, దహించివేస్తోన్న మధ్యాహ్నపు ఎండలో, ఆశాలు తమ సహోద్యోగి రీటా చావ్రే చుట్టూ గుమిగూడారు. వారిలో ప్రతి ఒక్కరూ ఖాళీ టిఫిన్ డబ్బాలు, పళ్ళేలు, కొంతమంది మూతలు కూడా పట్టుకున్నారు. 47 ఏళ్ళ వయసున్న రీటా తన ఇంట్లో తయారుచేసిన ఆహారాన్ని వారికి అందిస్తున్నందున వారు ఓపికగా తమ వంతు కోసం వేచి ఉన్నారు. "నేను ఇక్కడ నిరసన తెలుపుతోన్న దాదాపు 80-100 మంది ఆశాలకు ఆహారం అందించగలుగుతున్నాను," అన్నారు రీటా. ఈమె ఠాణే జిల్లాలోని తిస్‌గాఁవ్ నుండి ఆజాద్ మైదాన్‌కు 17 మంది ఇతర ఆశాలతో కలిసి ప్రతిరోజూ రెండు గంటల పాటు ప్రయాణం చేసి వస్తున్నారు.
“ఏ ఒక్క ఆశా కూడా ఆకలితో ఉండకుండా చూసుకోవడానికి మేం వంతులు వేసుకుంటున్నాం. కానీ ఇప్పుడు అనారోగ్యానికి గురవుతున్నాం, మేం అలసిపోయాం,” అని ఫిబ్రవరి 2024 చివరిలో PARIతో మాట్లాడుతూ అన్నారు రీటా
21 రోజుల తర్వాత, " ఆశా చి నిరాశా సర్కార్ కర్నార్ నాహీ [ఆశాలను ప్రభుత్వం నిరాశపరచదు]" అని ముఖ్యమంత్రి ప్రకటించిన తర్వాత మార్చి 1న ఆశాలు ఎట్టకేలకు తమ ఇళ్ళకు తిరిగి వెళ్ళారు. అంతకుముందు మహారాష్ట్ర రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిండే మాట్లాడారు.
ఆశాలు 70 కంటే ఎక్కువ ఆరోగ్య సంరక్షణ సేవలను అందించే మొత్తం మహిళలతో కూడిన శ్రామిక శక్తి. అయినప్పటికీ, వారిని సమగ్ర శిశు అభివృద్ధి సేవా కార్యక్రమం (ICDS), దేశీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ (NRHM) కింద 'వాలంటీర్లు'గా మాత్రమే వర్గీకరించారు. అందువల్ల, ఆరోగ్య సంరక్షణ సేవలను అందించడం కోసం వారు స్వీకరించే చెల్లింపును 'గౌరవ వేతనం'గా సూచిస్తారు తప్ప వేతనంగా లేదా జీతంగా కాదు.
గౌరవ వేతనం కాకుండా, వారు PBP (పనితీరు ఆధారిత చెల్లింపు లేదా ప్రోత్సాహకాలు) పొందేందుకు అర్హులు. యూనివర్సల్ ఇమ్యూనైజేషన్, రీప్రొడక్టివ్ & చైల్డ్ హెల్త్ (RCH) సేవలను, ఇతర కార్యక్రమాలను ప్రోత్సహించడం కోసం ఆశాలు వారి పనితీరు ఆధారంగా ప్రోత్సాహకాలను పొందుతారని NRHM పేర్కొంది.
ఆశాలలో ఒకరైన రమా మనాత్కర్ చెప్పినట్లుగా డబ్బు మాత్రమే సరిపోదు, “ బిన్ పగారీ, ఫుల్ అధికారి [డబ్బు ఉండదు, కేవల బాధ్యతలు మాత్రమే]! మేం అధికారుల్లా పని చేయాలని వారు ఆశిస్తారు, కానీ మాకు డబ్బు చెల్లించడానికి మాత్రం ఇష్టపడరు."
ముఖ్యమంత్రి ఇటీవల ఇచ్చిన హామీ - గత కొన్ని నెలల్లో ఇచ్చిన అనేక అధికారిక హామీలలో ఒకటి - ఈ కథనాన్ని ప్రచురించే సమయానికి ప్రభుత్వ తీర్మానం (GR)గా రాలేదు. ఎన్ని ప్రదర్శనలు చేసినా, ఆశాలు వాగ్దానాలు మాత్రమే పొందగలుగుతున్నారు.
నిరసన తెలుపుతున్న వేలాదిమంది ఆశాలు మహారాష్ట్ర ప్రభుత్వం తమకు మొదట అక్టోబర్ 2023లో ఇచ్చిన హామీ గురించి - జీతాల పెంపును అమలు చేస్తూ GR జారీ చేసేలా - ఒత్తిడి పెట్టాలని నిశ్చయించుకున్నారు.
“ప్రజలు తమ కుటుంబం కంటే ఆశాలను ఎక్కువగా విశ్వసిస్తారు! ఆరోగ్య శాఖ మాపై ఆధారపడి ఉంది,” అట్టడుగు వర్గాలకు ఆరోగ్య సంరక్షణ సేవలను సులభతరం చేయడం తమ పనిలో ఒక ప్రాథమిక అంశంగా పేర్కొంటూ వనశ్రీ ఫుల్‌బంధే చెప్పారు. “కొత్తగా డాక్టర్ల నియామకం జరిగినప్పుడల్లా వాళ్ళు ఇలా అడుగుతారు: ఆశా ఎక్కడ ఉన్నారు? మాకు ఆమె నంబర్ దొరుకుతుందా?"
వనశ్రీ 14 ఏళ్ళుగా ఆశాగా ఉన్నారు. "నేను రూ. 150తో ప్రారంభించాను... ఇది వన్‌వాస్ లాంటిది కాదా? 14 ఏళ్ళ తర్వాత శ్రీరాముడు అయోధ్యకు వచ్చినప్పుడు ఆయనకు స్వాగతం పలికారు, కాదా? మాకు స్వాగతాలు పలకాల్సిన పనిలేదు. కనీసం గౌరవం, నిజాయితీతో జీవించడానికి అనుమతించే మాన్‌ధన్ [గౌరవ వేతనం] అందించండి చాలు," అంటారామె.
మరొక డిమాండ్ కూడా ఉంది: వారు కూడా అందరిలాగా ప్రతి నెలా వారి జీతాలను సకాలంలో పొందలేరా? ప్రతిసారీ మూడు నెలల ఆలస్యం తర్వాత కాకుండా.
"మాకు చెల్లింపులు ఆలస్యంగా అందుతూ ఉంటే, మేం ఎలా ఇల్లు గడుపుకోవాలి?" యవత్మల్ జిల్లా ఉపాధ్యక్షురాలుగా ఉన్న ఆశా, ప్రీతి కర్మన్కర్ అడుగుతున్నారు. “ఆశా ఒక సేవను అందిస్తుంది, కానీ ఆమె తన సొంత కడుపు నింపుకోవడం కోసం కూడా పనిచేస్తుంది. ఆమెకు జీతం ఇవ్వకపోతే, ఆమె ఎలా జీవిస్తుంది?"
ఆరోగ్య శాఖ నిర్వహించే, వారు తప్పనిసరిగా హాజరుకావలసిన వర్క్‌షాపులకు, జిల్లా సభలకు రావలసిన ప్రయాణ భత్యాలు కూడా మూడు నుంచి ఐదు నెలల పాటు ఆలస్యమవుతున్నాయి. "ఆరోగ్య శాఖ ఒప్పగించిన కార్యక్రమాలకు కూడా 2022 నుంచి మాకు చెల్లింపులు అందలేదు," అన్నారు యవత్మల్‌లోని కళంబ్ నుంచి వచ్చిన అంతకలా మోరే. "డిసెంబర్ 2023లో మేం సమ్మెలో ఉన్నాం. కానీ కుష్టువ్యాధికి సంబంధించిన ఒక సర్వేను నిర్వహించేందుకు వాళ్ళు మమ్మల్ని సమ్మె విరమించేలా చేశారు. కానీ ఇప్పటికీ వారు మాకు చెల్లింపులు చేయలేదు," అన్నారామె. "పోయిన ఏడాది జరిగిన పోలియో, హత్తీ రోగ్ (బోదకాలు), జంత్-నాశక్ (పొట్టలోని పురుగులను నిర్మూలించటం) కార్యక్రమాలకు కూడా మాకు ఇంతవరకూ చెల్లింపులు అందలేదు," మాట కలుపుతూ అన్నారు ప్రీతి.
*****
రీటా 2006లో రూ. 500 వేతనంపై ఆశాగా చేరారు. "ఈ రోజు నాకు నెలకు 6,200 రూపాయలు వస్తున్నాయి. అందులో రూ. 3000 కేంద్ర ప్రభుత్వం ద్వారా, మిగిలినవి మునిసిపల్ కార్పొరేషన్ ద్వారా వస్తాయి."
మహారాష్ట్రలోని 80,000 మంది ఆశాలు, 3,664 మంది గట్ ప్రవర్తకులు (గ్రూప్ ప్రమోటర్లు) వరుసగా రూ. 7,000, రూ. 6.2000 ఇంక్రిమెంట్లతో పాటు దీపావళి బోనస్‌గా ఒక్కొక్కరికీ రూ. 2000 అందుకుంటారని నవంబర్ 2, 2023న రాష్ట్ర ఆరోగ్య శాఖా మంత్రి తానాజీరావు సావంత్ ప్రకటించారు .
" దివాళీ హొవున్ ఆతా హోళీ ఆలీ [దీపావళి వెళ్ళిపోయింది, ఇప్పుడిది హోలీ సమయం], కానీ మా చేతుల్లో ఒక్క పైసా లేదు," మమత కోపంగా అన్నారు. "మేం ఏడు వేలో, పదివేలో ఇంక్రిమెంట్ ఇవ్వమని అడగలేదు. అదనంగా వచ్చిపడిన ఆన్‌లైన్ పనికి వ్యతిరేకంగా మేం అక్టోబర్‌లో మొదటిసారి సమ్మె చేశాం. ప్రధాన్ మంత్రి మాతృ వందన యోజన (PMMVY) కింద ప్రతిరోజూ 100 మంది గ్రామస్తులను నమోదు చేయాలని మాకు చెప్పారు."
ఈ పథకం అధికారిక వెబ్‌సైట్ ప్రకారం, “గర్భధారణ సమయంలో జరిగే వేతన నష్టానికి బదులుగా పాక్షిక పరిహారంగా నగదు ప్రోత్సాహకాన్ని అందిస్తుంది.” గర్భిణీలు, పిల్లల టీకా రికార్డులను నిల్వ చేయడానికి ఉద్దేశించి కొత్తగా ప్రారంభమైన U-Win యాప్‌కు కూడా ఇదే విధమైన లక్ష్యాన్ని ఇచ్చారు.
అంతకుముందు ఫిబ్రవరి 2024లో, 10,000 మందికి పైగా ఆశాలు శాహాపూర్ నుండి 52 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఠాణే జిల్లా కలెక్టర్ కార్యాలయానికి కవాతు చేశారు. “ చాలున్ అలోయ్, తంగడ్యా తుటల్యా [ఈ దూరమంతా మేం నడిచే వెళ్ళాం, మా కాళ్ళు ఇక పనిచేయటం మానేశాయి]. రాత్రంతా ఠాణే వీధుల్లో గడిపాం," అని మమత గుర్తు చేసుకున్నారు.
నెలల తరబడి సాగుతున్న ఆందోళనలు వారిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. “మొదట్లో ఆజాద్ మైదాన్‌లో 5,000 మందికి పైగా ఆశాలు ఉండేవారు. వారిలో చాలామంది గర్భిణులు, మరికొంతమంది తమ నవజాత శిశువులతో కూడా వచ్చారు. ఇక్కడ బహిరంగ ప్రదేశంలో నివసించడం వారికి కష్టంగా మారటంతో, వారిని ఇళ్ళకు తిరిగి వెళ్ళమని మేం అభ్యర్థించాం,” అని ఉజ్వల పడల్వార్ చెప్పారు. ఆమె సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ (సిఐటియు) రాష్ట్ర కార్యదర్శి, ఈ ఆందోళనల నిర్వాహకుల్లో ఒకరు. చాలామంది మహిళలు ఛాతీ నొప్పి, కడుపు నొప్పి గురించి ఫిర్యాదు చేశారు, మరికొందరు తలనొప్పి, డీహైడ్రేషన్‌లతో బాధపడ్డారు, వారు ఆసుపత్రిలో చేరవలసి వచ్చిందని ఆమె అన్నారు.
డిశ్చార్జ్ అయిన వెంటనే ఆశాలు మళ్ళీ రంగం మీదికి వచ్చి, ఏకకంఠంతో ఇలా నినాదమిచ్చారు: “ ఆతా ఆమ్చా ఏకచ్ నారా, జిఆర్ కాఢా! [మాది ఒకే ఒక నినాదముంది! GRని విడుదల చేయండి!]."
*****
పేరుకు, ప్రతి ఒక్కరికీ ప్రజారోగ్య సేవలను అందించడం వరకే ఆశా పాత్ర అనిపించినప్పటికీ, వాస్తవానికి ప్రజలతో సంవత్సరాల తరబడి పనిచేసిన తర్వాత, ఆమె సేవలను అందించడాన్నీ, సహాయం చేయడాన్నీ దాటి వెళతారు. ఉదాహరణకు ఆశా మమతనే తీసుకోండి; సెప్టెంబర్ 2023లో బదలాపూర్‌లోని సోనివలీ గ్రామానికి చెందిన గర్భిణీగా ఉన్న ఒక ఆదివాసీ మహిళను ఇంట్లో ప్రసవించడానికి బదులుగా ఆసుపత్రిలో ప్రసవించేలా ఆమె ఒప్పించగలిగారు.
ఆమె ఇలా గుర్తుచేసుకున్నారు: “ఆ స్త్రీ భర్త ఆమెతో పాటు రావడానికి నిరాకరించటమే కాక, ‘నా భార్యకు ఏదైనా జరిగితే నీదే బాధ్యత’ అని స్పష్టమైన మాటల్లో చెప్పాడు.” తల్లి ప్రసవ వేదన పడుతున్నప్పుడు, "నేనే ఆమెను బదలాపూర్ నుండి ఉల్హాస్‌నగర్‌కు తీసుకెళ్లాను," అన్నారు మమత. ప్రసవం వరకు తల్లి బతకలేదు. బిడ్డ కూడా కడుపులోనే చనిపోయింది.
మమత వివరిస్తూ, “నాకు భర్త లేడు, చనిపోయాడు. ఆ సమయంలో నా కొడుకు 10వ తరగతి చదువుతున్నాడు. నేను ఉదయం 6 గంటలకు ఇంటి నుండి బయలుదేరాను, రాత్రి 8 గంటలకు తల్లి మరణించింది. నన్ను అర్ధరాత్రి 1:30 గంటల వరకు ఆసుపత్రి వరండాలో వేచి ఉండమని అడిగారు. పంచనామా పూర్తయిన తర్వాత, 'ఆశా తాయ్ ! ఇప్పుడు మీరు వెళ్ళవచ్చు,' అన్నారు. దీడ్ వాజ్తా మీ ఏకటీ జావూ ? [నేను తెల్లవారుజామున 1:30 గంటలకు ఒంటరిగా ఇంటికి వెళ్లాలా]?”
మరుసటి రోజు ఆమె రికార్డులను అప్‌డేట్ చేయడానికి గ్రామాన్ని సందర్శించినప్పుడు, మరణించిన మహిళ భర్తతో సహా కొందరు వ్యక్తులు ఆమెను దుర్భాషలాడారు, మరణానికి ఆమే కారణమని నిందించారు. ఒక నెల తర్వాత, మమతను జిల్లా సమితి విచారణకు పిలిచింది. "వారు నన్ను 'తల్లి ఎలా చనిపోయింది, ఆశా తాయి ఏ పొరపాటు చేసింది?' అని అడిగారు. ఏం జరిగినా ప్రతిదాన్నీ చివరికి మా తలపైనే వేసేటప్పుడు, మా మాన్‌ధన్ (గౌరవ వేతనం)ని ఎందుకు పెంచకూడదు?" అని ఆమె అడుగుతున్నారు.
కరోనా ముమ్మరంగా ఉన్న కాలమంతటా, ప్రభుత్వం ఆశా కార్యకర్తలను ప్రశంసించింది. రాష్ట్రవ్యాప్తంగా మారుమూల గ్రామాలకు మందులు పంపిణీ చేయడం, వైరస్ సోకిన రోగులను గుర్తించడంలో వారు పోషించిన కీలక పాత్ర వలన వారిని "కరోనా యోధులు" అని ప్రశంసించింది. అయినప్పటికీ, వైరస్ నుండి తమను తాము రక్షించుకోవడానికి వారికి ఎటువంటి భద్రతా సామగ్రిని అందించలేదు.
కల్యాణ్‌లోని నందివలి గాఁవ్‌కు చెందిన మందా ఖతాన్, శ్రద్ధా ఘోగ్లేలు కోవిడ్ సమయంలోని తమ అనుభవాలను పంచుకున్నారు, "గర్భవతిగా ఉన్న ఒక మహిళకు ప్రసవం అయిన తర్వాత కోవిడ్ పాజిటివ్ వచ్చింది. తనకు వైరస్ సోకిందని తెలియగానే ఆమె భయపడిపోయి ఆసుపత్రి నుంచి [అప్పుడే పుట్టిన తన బిడ్డతో సహా] పారిపోయింది."
"తననీ, తన బిడ్డనూ పట్టుకొని చంపేస్తారని ఆమె భయపడింది," అన్నారు శ్రద్ధ. వైరస్ చుట్టూ అటువంటి భయాలూ అపోహలూ అల్లుకొని ఉండేవి.
“ఆమె తన ఇంట్లో దాక్కుందని ఎవరో మాకు చెప్పారు. మేం ఆమె ఇంటికి వెళ్ళాం, కానీ ఆమె తలుపులు లోపలి నుండి వేసుకొని ఉంది,” అని మందా చెప్పారు. ఆమె ఏదైనా అఘాయిత్యానికి పాల్పడుతుందేమో అనే భయంతో వారు తెల్లవారుజామున 1:30 గంటల వరకు ఆమె ఇంటి బయటనే నిలబడ్డారు. “మేం ఆమెను అడిగాం, 'నువ్వు నీ బిడ్డను ప్రేమిస్తున్నావా లేదా?' అని. ఆమె తన బిడ్డను అలాగే దగ్గరకు హత్తుకొని ఉంటే, చివరకు వైరస్ బిడ్డకు సోకుతుందనీ, శిశువు జీవితాన్ని అది ప్రమాదంలో పడేస్తుందనీ ఆమెకు చెప్పాం."
మూడు గంటల పాటు కౌన్సెలింగ్ ఇచ్చిన తర్వాత, తల్లి తలుపులు తెరిచింది. "ఆంబులెన్స్ సిద్ధంగా ఉంది. మేం ఇద్దరం తప్ప మరే ఇతర వైద్యాధికారులు కానీ, గ్రామ సేవకులు కానీ లేరు." నీళ్ళు నిండిన కళ్ళతో మందా ఇలా వివరించారు: "వెళ్ళిపోయే ముందు తల్లి నా చేతిని పట్టుకొని, 'నేను నా బిడ్డని నీ మీద నమ్మకంతో విడిచిపెట్టి వెళ్తున్నాను. దయచేసి నా బిడ్డాను బాగా చూసుకో.' ఆ తర్వాత ఎనిమిది రోజులపాటు ఆ బిడ్డకు సీసా పాలు పట్టేందుకు మేం ఆమె ఇంటికి రోజూ వెళ్ళేవాళ్ళం. తల్లికి వీడియో కాల్ చేసి బిడ్డను చూపెట్టేవాళ్ళం. ఇప్పటికి కూడా ఆమె మాకు కాల్ చేసి తన కృతజ్ఞతలు చెప్తుంటుంది.
"మేం ఏడాది పాటు మా సొంత పిల్లలకు దూరంగా ఉన్నాం," అన్నారు మందా. "కానీ మేం ఇతరుల పిల్లలను రక్షించాం." ఆ సమయంలో మందా బిడ్డ 8వ తరగతి చదువుతుండగా, శ్రద్ధ బిడ్డ వయసు ఐదేళ్ళే.
తన గ్రామంలోని ప్రజలు తమను చూసి తలుపులు మూసుకున్న సంఘటనను శ్రద్ధా గుర్తు చేసుకున్నారు. "మమ్మల్ని వ్యక్తిగత రక్షణ పరికరాల (పిపిఇ) కిట్‌లలో చూసిన వారు, మేమం వారిని పట్టుకోవడానికి వచ్చామని భావించి పారిపోయేవారు." అంతే కాదు, “మేం రోజంతా కిట్‌లను ధరించే ఉండేవాళ్ళం. ఒక్కోసారి ఒకే రోజులో నాలుగింటిని మార్చాల్సి వచ్చేది. గంటల తరబడి వాటిని ధరించి ఉండటం వల్ల మా ముఖం నల్లగా మారిపోయింది. మేం వాటితోనే ఎండలో నడిచేవాళ్ళం. అది దురదపెట్టేది, చర్మం మీద మండుతున్నట్టుగా అనిపించేది.”
మందా మధ్యలో కల్పించుకొంటూ, "పిపిఇలు, మాస్కులు ఆ తర్వాత ఎప్పుడో వచ్చాయి. వైరస్ ముమ్మరంగా ఉన్న సమయంలో మేం మా పైట కొంగులను , దుపట్టాలను చుట్టుకొని తిరుగుతూ ఉండేవాళ్ళం," అన్నారు.
“అంటే, అప్పుడు [కోవిడ్ సమయంలో] మా ప్రాణాలకు విలువ లేదా?” అని మమత అడుగుతారు, “కరోనాతో యుద్ధం చేయడానికి మీరు మాకు వేరే కవచ్ [రక్షణ] ఏదైనా ఇచ్చారా? వైరస్ విజృంభణ ప్రారంభమైనప్పుడు మీరు [ప్రభుత్వం] మాకు ఏమీ ఇవ్వలేదు. మా ఆశా తాయి లకు కోవిడ్ రావడం ప్రారంభించినప్పుడు, వారు కూడా మిగిలిన రోగుల పరిస్థితినే ఎదుర్కొన్నారు. టీకాలు ఇంకా ప్రయోగాల దశలో ఉన్నప్పుడు కూడా, ఆశాలు మాత్రమే స్వచ్ఛందంగా ముందుకొచ్చారు."
తన జీవితంలో ఒకానొక సమయంలో, వనశ్రీ ఫుల్‌బంధే ఆశాగా ఉండటాన్ని దాదాపుగా వదిలేయాలని నిర్ణయించుకున్నారు. "అది నా మానసిక, శారీరక ఆరోగ్యంపై ప్రభావం చూపడం ప్రారంభించింది," అని ఆమె చెప్పారు. 42 ఏళ్ళ వనశ్రీ నాగ్‌పూర్ జిల్లాలోని వాడోదా గ్రామంలో 1,500 మందికి పైగా ప్రజల ఆరోగ్య సంరక్షణను చూస్తున్నారు. “ఒకప్పుడు నా మూత్రపిండాలలో రాళ్ళు ఉన్న కారణంగా విపరీతమైన నొప్పికి లోనయ్యేదాన్ని. నడుముకి గుడ్డ కట్టుకుని పనిచేసేదాన్ని, ఇంకా చేస్తూనే ఉన్నాను."
ఒక పేషెంట్, ఆమె భర్త వనశ్రీ ఇంటికి వచ్చారు. “ఆమె మొదటిసారి తల్లి కాబోతోంది. వారు కంగారుపడుతున్నారు. నేను ఏమీ చేయలేని స్థితిలో ఉన్నానని వారికి వివరించాను, కాని వారు బిడ్డ పుట్టే సమయంలో నేను ఉండాలని పట్టుబట్టారు. ‘నో’ చెప్పడం కష్టం కాబట్టి వాళ్ళ వెంట వెళ్ళాను. పాప పుట్టే వరకు హాస్పిటల్‌లో ఆమెతో పాటు రెండు రోజులు ఉన్నాను. నా నడుముకు గుడ్డ కట్టి ఉండడం చూసి ఆమె బంధువులు, 'ఇది పేషెంట్ ప్రసవమా, నీదా!' అని సరదాగా అడిగేవారు."
లాక్‌డౌన్ సమయంలో ఆమె తన ఆశా విధులను పూర్తి చేసిన తర్వాత, ఏకాంతవాసంలో ఉన్న రోగులకు ఆహారాన్ని అందించినప్పటి తన దినచర్యను గుర్తుచేసుకున్నారు. "అది చివరకు నా ఆరోగ్యాన్ని దెబ్బతీసింది. చాలా రోజుల పాటు నా రక్తపోటు చాలా ఎక్కువగా ఉండేది, నేనిక ఈ ఉద్యోగాన్ని మానేయాలని అనుకున్నాను." కానీ వనశ్రీ పిన్ని "నేను చేసేది పుణ్య [పుణ్యం] అనీ, రెండు జీవితాలు [తల్లి, బిడ్డ] నాపై ఆధారపడి ఉన్నాయనీ నాకు గుర్తు చేసింది. నేనెప్పుడూ ఈ ఉద్యోగాన్ని వదులుకోను."
ఇలా మాట్లాడుతూనే వనశ్రీ అప్పుడప్పుడూ తన ఫోన్ వైపు చూస్తున్నారు. "నేను ఇంటికి ఎప్పుడు తిరిగి వస్తానో అని మా కుటుంబం అడుగుతూ ఉంటుంది. నేను రూ. 5,000తో ఇక్కడికి వచ్చాను. నా దగ్గర ఇప్పుడు కేవలం రూ. 200 మాత్రమే ఉన్నాయి," అన్నారామె. డిసెంబర్ 2023 నుండి ఆమె తన నెలవారీ గౌరవ వేతనాన్ని అందుకోలేదు.
నాగ్‌పూర్‌లోని పంధుర్నా గ్రామానికి చెందిన పూర్ణిమ వాసే ఒక ఆశా. “నేను ఒక ఎచ్ఐవి పాజిటివ్ మహిళ అంబులెన్స్‌లో ప్రసవించేటపుడు సహాయం చేశాను. ఆసుపత్రిలో ఉన్న వ్యక్తులు ఆమె ఎచ్‌ఐవి పాజిటివ్ అని తెలుసుకోగానే, అది చాలా పెద్ద విషయంలాగా ప్రవర్తించారు. ‘ఆశాని అయిన నేను చేతి తొడుగులు, నా స్వంత తువ్వాలు తప్ప మరే ఇతర పరికరాలు లేకుండా ప్రసవానికి సహాయం చేసినప్పుడు, మీరెందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు?’ అని నేను వారిని అడిగాను," అని 45 ఏళ్ళ ఈ ఆశా చెప్పారు.
2009 నుండి ఆశాగా ఉన్న పూర్ణిమ 4,500 మంది కంటే ఎక్కువమంది జనాభాను చూసుకుంటారు. "నేనొక పట్టభద్రురాలిని," అన్నారామె. “నాకు చాలా ఉద్యోగావకాశాలు వచ్చాయి. కానీ, ఆశా కావాలనేది నా నిర్ణయం, నేను నా జీవితమంతా ఆశాగానే కొనసాగుతాను. నాకు డబ్బు వచ్చినా రాకపోయినా, అగర్ ముఝే కర్నీ హై సేవాతో మర్తే దమ్ తక్ ఆశా కా కామ్ కరూంగీ [సేవ చేయాలనేది నా కోరిక కాబట్టి, నా మరణం వరకు ఆశాగా కొనసాగుతాను].”
ఆజాద్ మైదాన్‌లో క్రికెట్ ఆట కొనసాగుతూనే ఉంది. ఇంతలో ఆశాలు తమ పోరాటాన్ని ఆ మైదానం నుండి మార్చారు
అనువాదం: సుధామయి సత్తెనపల్లి