ముదురు నీలం రంగు కుర్తా, ఎంబ్రాయిడరీ చేసిన లుంగీ, కొప్పు చుట్టూ చుట్టిన సువాసనల మల్లెపూల దండతో, ఎం.పి. సెల్వి తాను నడుపుతోన్న పెద్ద వంటగది - కరుంబుకడై ఎం.పి. సెల్వి బిర్యానీ మాస్టర్ - లోకి ప్రవేశించారు. ఆమె క్యాటరింగ్ యూనిట్‌లో పనిచేస్తోన్న సిబ్బంది తలలు పైకెత్తి చూశారు, అక్కడక్కడా వినిపిస్తోన్న కబుర్ల సందడి సద్దుమణిగింది. ఒక శ్రామికుడు వచ్చి ఆమెను పలకరించి, ఆమె చేతిలోని సంచి తీసుకున్నారు.
'బిర్యానీ మాస్టర్' సెల్వి అంటే 60 మందికి పైగా పనిచేస్తోన్న ఆ పెద్ద వంటగదిలో అందరికీ ఎనలేని గౌరవం. కొన్ని నిమిషాలలోనే వాళ్ళు మళ్ళీ తమ పనుల్లో మునిగిపోయారు. చాలా వేగంగా, నేర్పుగా అటూ ఇటూ తిరిగే వారు, మంటల నుంచి వచ్చే పొగను, నిప్పురవ్వలను పట్టించుకోరు.
చాలా పేరొందిన ఈ బిర్యానీని సెల్వి, ఆమె తోటి వంటవాళ్ళు మూడు దశాబ్దాలుగా తయారుచేస్తున్నారు. దమ్ మటన్ బిర్యానీని మాంసం, బియ్యాన్ని కలిపి వండుతారు. ఇతర బిర్యానీలలో ఈ రెండు ప్రధాన దినుసులను విడివిడిగా వండుతారు.
"నేను కోయంబత్తూరు దమ్ బిర్యానీ స్పెషలిస్టుని," అని 50 ఈ ఏళ్ళ ట్రాన్స్ మహిళ చెప్పారు. “నేను దీన్నంతా ఒంటరిగా నిర్వహిస్తాను. నాకు అన్నీ గుర్తుంటాయి. చాలాసార్లు, మమ్మల్ని ఆరు నెలలు ముందుగానే బుక్ చేసుకుంటారు.’’
ఆమె మాతో మాట్లాడుతుండగానే, బొట్లు బొట్లుగా బిర్యానీ మసాలా కారుతోన్న సట్టువం (పెద్ద గరిటె)ను ఆమెకు అందించారు. సెల్వి ఆ మసాలాను రుచి చూసి, “సరిపోయింది” అన్నట్లు తల ఊపారు. అది వంటకంలో చివరి, అత్యంత ముఖ్యమైన రుచి పరీక్ష. ప్రధాన వంటపెద్ద (చెఫ్) ఆ వంటకాన్ని ఆమోదించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
“అందరూ నన్ను ‘సెల్వి అమ్మా’ అని పిలుస్తుంటారు. ఒక ‘తిరునంగై’ [ట్రాన్స్‌మహిళ]కి ‘అమ్మా’ అని పిలిపించుకోవడంలో చాలా ఆనందం ఉంటుంది,” ఆమె సంతోషంగా నవ్వుతూ అన్నారు.























