జాషువా బోధినేత్ర కవితలను చదవటాన్ని వినండి


తన సబూజ్ సాథీ సైకిల్ దొంగతనం జరిగినప్పటి నుంచి, ఆమెకు బడికి వెళ్ళటం ఒక సవాలైపోయింది. ప్రభుత్వ పాఠశాలల్లో 9,10 తరగతులు చదివే విద్యార్థుల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకంలో భాగంగా ఆ మహా ఘనమైన యంత్రాన్ని అందుకున్న రోజును సరస్వతి గుర్తుచేసుకుంది. ఓహ్! టెర్రకోట ఎరుపు రంగులోని సూర్యుని కింద అది ఎంతగా మిలమిలలాడిపోయిందో!

ఈ రోజు ఆమె మరో కొత్త సైకిల్ కోసం అర్జీ తీసుకొని, ఆశతో గ్రామ్‌ప్రధాన్ దగ్గరకు వచ్చింది. " సైకిల్ తో పేయే జాబీ రే ఛుడీ, కింతు తోర్ ఇస్కూల్-టా ఆర్ కొద్‌దిన్ థక్‌బే సెటా ద్యాఖ్ ఆగే [నీకు మరో సైకిల్ దొరకొచ్చు బుజ్జీ, కానీ మీ బడి ఇంకా ఎంతోకాలం ఇక్కడ ఉండదు]," బలవంతపు నవ్వుతో భుజాలెగరేస్తూ చెప్పాడు సర్పంచ్ . సరస్వతికి తన కాళ్ళ కింది భూమి కదిలిపోయినట్లనిపించింది. గ్రామ్‌ప్రధాన్ చెప్తోన్న మాటలకు అర్థమేమిటి? బడికి వెళ్ళడానికి 5 కిలోమీటర్ల దూరం సైకిల్ తొక్కుకుంటూ వెళ్ళేది. ఇప్పుడా దూరం 10 లేదా 20 కిలోమీటర్లు లేదా అంతకు మించి ఉంటే, ఆమె నాశనమైనట్టే. ఆమెకు పెళ్ళిచేసి పంపాలనే గట్టి నిర్ణయంతో ఉన్న తండ్రితో పోరాటానికి ఏడాదికి కన్యాశ్రీ పథకం కింద వచ్చే ఒక వెయ్యి రూపాయలు సరిపోవు.

సైకిల్

బడికి పద చిన్నారీ బడికి పద
సర్కారీ సైకిల్ పై మొహుల్‌ ను దాటి...
ఉక్కు నాగలి లాగా బలంగా,
బడా బాబులకు భూమిపై మనసయ్యింది
బడి మూతపడితే మాత్రమేమీ?
చిన్నారీ మొహమెందుకు చిట్లించావు?

*****

ఫుల్కీ టుడు కొడుకు బుల్‌డోజర్ వదిలివెళ్ళిన జాడల గుర్తుల మీద ఆడుకుంటున్నాడు.

ఆశ అనేది ఆమె భరించలేని ఒక భోగం. కోవిడ్ తర్వాత అనే కాదు. చాప్-ఘుగ్నీ (మసాలా పూర్ణం నింపిన బజ్జీ - బఠాణీ/శనగలతో వండిన కూర) అమ్మే ఆమె చిన్న గుమ్టీ ని (దుకాణం) ప్రభుత్వం బుల్‌డోజర్‌తో నేలమట్టం చేసిన తర్వాత అసలే కాదు. అదే ప్రభుత్వం ఫాస్ట్ ఫుడ్‌ను, పకోరా (పకోడీ)లను మన పారిశ్రామిక శక్తికి మూలస్తంభంగా కొనియాడుతుంది. మొట్టమొదటిసారి దుకాణాన్ని పెట్టాలనుకున్నప్పుడు ఆమె పొదుపు చేసుకున్న మొత్తాన్ని దోచుకున్న అదే వ్యక్తులు, ఇప్పుడు ఆక్రమణల వ్యతిరేక దందాని నడుపుతున్నారు

పెరిగిపోతున్న అప్పులను తీర్చడానికి ఆమె భర్త నిర్మాణ స్థలాలలో రోజు కూలీ పని కోసం వెతుక్కుంటూ ముంబై వెళ్ళారు. "ఈ పార్టీ 'మేం నెలకు రూ. 1200 ఇస్తాం,' అంటుంది. ఆ పార్టీ 'మేం ఏకంగా దేవుడినే ఇస్తాం,' అంటుంది. ఈ అమానుషమైన లొక్ఖీర్ భండార్ (లక్ష్మీర్ భండార్-ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు చెందిన మహిళలకు నెలకు వెయ్యి రూపాయల ఆర్థిక సాయం అందించే పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ పథకం)నయినా, మొందిర్-మొస్జిద్ (మందిరం-మసీదు)నయినా నేనెందుకు లెక్కచేయాలి?" అంటూ గొణుగుతున్న ఫుల్కీ అక్క, ఒక్కసారిగా కోపంతో మండిపడుతూ, " హొతోభగార్ దొల్, ఆగే అమార్ 50 హజార్ టాకార్ కట్-మనీ ఫిరోత్ దే [నీచుల్లారా! ముందు నేను లంచంగా చెల్లించిన 50 వేల రూపాయలను తిరిగి నాకు ఇచ్చేయండి]!" అరిచారు.

బుల్‌డోజర్

అప్పుల్లో కూరుకుపోవటం... మన జన్మహక్కు, ఆశల ఊయలూగటం... మన నరకం,
మనం అమ్మే బజ్జీల పిండిలో మనమే మునిగిపోవటం.
లొక్ఖీర్ (లక్ష్మి) భండార్ మీదుగా
బుల్‌డోజర్ నడిచింది,
చెమటతో తడిసిన వెన్నులపై మనం మోసే దేశాలు -
మనకిస్తాననన్న పదిహేను లక్షల మాటేమయింది?

*****

చాలామందికి భిన్నంగా, అతను MGNREGA కింద వందకి వందా స్కోర్ చేశాడు; ఖచ్చితంగా ఇది పండగ చేసుకోడానికి ఒక సందర్భం. అదేంలేదు! లాలూ బాగ్దీ రెండు బండరాళ్ళ మధ్య ఇరుక్కుపోయారు. ఆయన వంద రోజులను పూర్తిచేసింది కేంద్ర ప్రభుత్వ స్వచ్ఛ భారత్ యోజన కిందనా లేక రాష్ట్ర ప్రభుత్వ మిషన్ నిర్మల్ బంగ్లా కిందనా అనేది సర్కారీ బాబు లకు తెలియకపోవడంతో, అతని చెల్లింపులు అధికార సంబంధమైన పీడకలలో నిస్సహాయంగా ఇరుక్కుపోయాయి.

" సబ్ సాలా మకాల్ ఫోల్ [అందరికందరూ పనికిమాలిన వెధవలే]," లాలూ బాగ్దీ కుడి, ఎడమ పార్టీలు రెంటికీ శాపనార్థాలు పెట్టారు. ఊడవటమంటే ఊడవటమే, చెత్త అంటే కేవలం చెత్తే. అవునా కాదా? పథకం పేరులో ఏముంది? కేంద్రమో రాష్ట్రమో, అదంత ముఖ్యమా? సరే అనుకుందాం. దేశంలోని అత్యంత అహంకారి అయిన అవివేకికి చెత్త మీద కూడా పక్షపాతమే.

చెత్త డబ్బా

ఓయ్ నిర్మల్ , ఎలా ఉన్నావు భాయీ?
"జీతాలు అందని స్వీపర్లు బారులుతీరి ఉన్నారు."
ఈ నదుల్లో మృతదేహమేదీ లేదు...
కార్మికుల హక్కులా? ఎప్పుడో మాయమయ్యాయి...
నీకు జయం స్వచ్ఛ్ కుమార్ , ఎలా ఉన్నావు భాయీ?
"నా చెమటేమో కాషాయం, నా రక్తం ఆకుపచ్చ."

*****

ఫరూక్ మండల్‌కు అదృష్టమన్నది లేదు! నెలల తరబడి కరవు తర్వాత వర్షాలు కురిశాయి, పంట చేతికి రాబోతున్న సమయంలో ఆకస్మికంగా ముంచెత్తిన వరదల్లో అతని పొలంపంటంతా కొట్టుకుపోయింది. " హాయ్ అల్లా, హే మా గొంధేశ్వరీ, ఎతో నిఠూర్ కెనే తొమ్రా ? [ఓ అల్లా, ఓ గంధేశ్వరీ మాతా, మీరెందుకు ఇంత క్రూరంగా ఉన్నారు?]" అని అడుగుతున్నారాయన.

జంగల్‌మహల్ - ఎప్పుడూ నీటికి కొరతగానే ఉంటుంది, కానీ వాగ్దానాలు, విధానాలు, ప్రాజెక్టులు మాత్రం పుష్కలం. సజల్ ధార, అమృత్ జల్. ఆ పేరే మత వివాదానికి మూలం, ఇంతకూ జల్ అనాలా, పానీ అనాలా? పైపులు వేశారు, వాడుకగా వచ్చే విరాళాలు ప్రవహిస్తున్నాయి, కానీ సురక్షితమైన త్రాగునీరు ఒక్క చుక్క కూడా లేదు. విసుగు చెందిన ఫరూక్, ఆయన బీబీజాన్ ఒక బావిని తవ్వడం ప్రారంభించారు. ఎర్రటి నేల మరింత పరుపురాయికి దారితీసింది, అయినా నీటి జాడ లేదు. " హాయ్ అల్లా, హే మా గొంధేశ్వరీ, ఎతో పాషాణ్ కెనే తొమ్రా? [ఓ అల్లా, ఓ గంధేశ్వరీ మాతా, నీది ఎందుకంత రాతి హృదయం?]"

దప్పిక

అమృత్ అనాలా, అమ్రిత్ అనాలా? ఏ పదం సరైనది?
మాతృభాషకు నీరుపోస్తామా,
వీడ్కోలు పలుకుతామా?
శాఫ్రాన్ లేదా జాఫ్రాన్ ... సమస్య ఎక్కడ?
కాల్పనిక భూమికి ఓటేయాలా?
లేక దాన్ని ధ్వంసం చేయాలా?

*****

సోనాలీ మహతో, చిన్నారి రాము ఆసుపత్రి గేటు దగ్గర నివ్వెరపోయి నిలబడి ఉన్నారు. మొదట అది బాబా (నాన్న), ఇప్పుడు మా (అమ్మ). ఒకే ఏడాదిలో రెండు ప్రాణాంతక వ్యాధులు.

చేతిలో సర్కారీ ఆరోగ్య బీమా కార్డుతో, వారు దఫ్తర్ (కార్యాలయం) నుండి దఫ్తర్‌ కు పరుగులెత్తారు, అడుక్కున్నారు, వేడుకున్నారు, నిరసన తెలిపారు. స్వాస్థ్య సాథీ హామీ ఇచ్చిన 5 లక్షల సహాయం ఎంతమాత్రం సరిపోలేదు. భూమి లేని, త్వరలోనే ఇల్లు కూడా లేకుండా అయిపోయే వారు ఆయుష్మాన్ భారత్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి ప్రయత్నించారు. కానీ అది సాధ్యమవుతుందా లేదా, సహాయపడుతుందా లేదా అనే సంగతి ఎవరికీ తెలియదు. దాని నుంచి రాష్ట్రం వైదొలిగిందని కొందరు చెప్పారు. మరికొందరు ఇది మార్పిడి (ట్రాన్స్‌ప్లాంట్) శస్త్రచికిత్సలకు వర్తించదని చెప్పారు. ఇంకా మరికొందరు డబ్బులు సరిపోవని చెప్పారు. సమాచారం పేరుతో వారు గందరగోళంలో చిక్కుబడ్డారు.

" ద-ద-దీదీ రే, తొబే జే ఇస్కూలే బ-బ-బోలే సర్కార్ అమాదేర్ ప-ప-పాషే ఆచ్ఛే [అయితే అక్కా, ప్రభుత్వం మనతోనే ఉంటుందని బళ్ళో మనం నేర్చుకున్నాం కదా]?" తన వయసుకు మించిన గమనింపు ఉన్న రాము నట్లుకొడుతూ అడిగాడు. సోనాలీ నిశ్శబ్దంగా చూస్తూ ఉండిపోయింది...

వాగ్దానాలు

ఆశా దీదీ ! ఆశా దీదీ , మాకు సాయం చేయండి!
బాబా కు కొత్త గుండె కావాలి, అమ్మకు కిడ్నీలు.
సత్యంగా అది మీ స్వాస్థ్య్ (ఆరోగ్యం), సాథీ అంటే స్నేహితుడు,
చివరకు భూమిని అమ్మేశాం, శరీర మాంసాన్ని కూడా అమ్మేశాం.
ఆయుష్ , మీరు మాకు ధైర్యాన్నిస్తారా, మా కష్టాన్ని దూరం చేస్తారా?
లేదా మీవన్నీ మాటల మొరుగులేనా, చేతలేమీ లేవా?

*****

స్మితా ఖటోర్‌కు కవి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేయాలనుకుంటున్నారు. ఆమె ఆలోచనలే ఈ ప్రయత్నానికి ప్రధానం.

అనువాదం: సుధామయి సత్తెనపల్లి

Joshua Bodhinetra

जोशुआ बोधिनेत्र यांनी जादवपूर विद्यापीठातून तुलनात्मक साहित्य या विषयात एमफिल केले आहे. एक कवी, कलांविषयीचे लेखक व समीक्षक आणि सामाजिक कार्यकर्ते असणारे जोशुआ पारीसाठी अनुवादही करतात.

यांचे इतर लिखाण Joshua Bodhinetra
Illustration : Aunshuparna Mustafi

Aunshuparna Mustafi studied Comparative Literature at Jadavpur University, Kolkata. Her areas of interest include ways of storytelling, travel writings, Partition narratives and Women Studies.

यांचे इतर लिखाण Aunshuparna Mustafi
Editor : Pratishtha Pandya

प्रतिष्ठा पांड्या पारीमध्ये वरिष्ठ संपादक असून त्या पारीवरील सर्जक लेखन विभागाचं काम पाहतात. त्या पारीभाषासोबत गुजराती भाषेत अनुवाद आणि संपादनाचं कामही करतात. त्या गुजराती आणि इंग्रजी कवयीत्री असून त्यांचं बरंच साहित्य प्रकाशित झालं आहे.

यांचे इतर लिखाण Pratishtha Pandya
Translator : Sudhamayi Sattenapalli

Sudhamayi Sattenapalli, is one of editors in Emaata Web magazine. She translated Mahasweta Devi's “Jhanseer Rani“ into Telugu.

यांचे इतर लिखाण Sudhamayi Sattenapalli