ఆమె పరుగెత్తగలదు. ఆయన శిక్షణ ఇవ్వగలరు.
అందుకనే, జయంత్ తాండేకర్ తన రెండు గదుల అద్దె ఇంటిని తెరచి ఆమెను తన రెక్కల కిందకు తీసుకున్నారు.
తాండేకర్ తన ఆశ్రితురాలైన ఎనిమిదేళ్ళ ఊర్వశి ద్వారా తన కలను సాకారం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఇది ధనం లేకపోయినా సంకల్పం ఎక్కువగా ఉన్న ఒక గ్రామీణ బాలిక, ఆమె తల్లిదండ్రులు, ఒక యువ క్రీడా శిక్షకుడు పెద్ద పెద్ద కలలు కనడానికి ప్రయత్నిస్తోన్న కథ.
రెండేళ్ళ క్రితం తాండేకర్ వద్దకు వచ్చినపుడు ఊర్వశి నింబార్తేకు ఎనిమిదేళ్ళు. భండారా నగర శివార్లలో ఒక చిన్న అద్దె ఇంట్లో నివసిస్తోన్న అతని ఇంటికి ఊర్వశి తన వస్తువులన్నిటినీ తీసుకొని వచ్చింది; ఇప్పుడామెకు అతనే తల్లీ తండ్రీ. ఊర్వశి తల్లిదండ్రుల వద్ద డబ్బు లేదు. వారు భండారా నగరానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉండే దవ్వా గ్రామానికి చెందిన చిన్న రైతులు. అయితే ఆ బాలిక తల్లి మాధురి మాత్రం తన కుమార్తె ఏదైనా సాధించాలంటే తాను ఆ యువకుడిని, తన కూతురి కోసం అతను కనే కలలను విశ్వసించాలని భావించారు.










