"ఇదంతా ఒకే ఒక దారంతో మొదలై ఒకే ఒక దారంతో పూర్తవుతుంది," సన్నగా నవ్వుతూ అంటారు రేఖా బెన్ వాఘేలా. ఆమె గుజరాత్‌లోని మోటా టింబ్లా గ్రామంలోని తన ఇంటిలో ఒక సింగిల్ ఇక్కత్ పటోలును నేస్తూ తన చేనేత మగ్గం ముందు కూర్చునివున్నారు. "మొదట్లో మేం బాబిన్‌లోకి ఒక దారాన్ని చుడతాము, మళ్ళీ చివరిలో ఇప్పుడు అద్దకం వేసిన దారాన్ని బాబిన్‌లోకి పంపిస్తాం," పేక దారాలు సిద్ధం కావటానికీ, పడుగు దారాన్ని మగ్గంలోకి అమర్చడానికీ ముందు, పటోలా తయారీలో చోటుచేసుకునే అనేక ప్రక్రియలను గురించి వివరిస్తూ అన్నారు రేఖా బెన్.
ఆమె నివసించే సురేంద్రనగర్ జిల్లాలోని ఈ గ్రామానికి చెందిన వణ్‌కర్‌వాసులలో చాలామంది పటోలు అని పిలిచే ప్రసిద్ధ పట్టు చీరల తయారీకి సంబంధించిన ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉంటారు. కానీ ఈనాడు లీంబడీ తాలూకాలో సింగిల్, డబుల్ ఇక్కత్ పటోలా నేస్తున్న ఏకైక దళిత మహిళ, 40 ఏళ్ళ వయసున్న రేఖా బెన్. (చదవండి: రేఖా బెన్ జీవితపు పడుగూ పేకా...)
సురేంద్రనగర్‌కు చెందిన పటోలాను ' ఝాలావాడి’ పటోలా అంటారు. ఇవి పాటణ్‌లో తయారయ్యే వాటికంటే చవకైనవి. సహజంగా సింగిల్ ఇక్కత్ పటోలా నేతకు పేరొందిన ఝాలావాడ్‌లోని వణ్‌కర్లు (నేతకారులు) ఇప్పుడు డబుల్ ఇక్కత్ వస్త్రాన్ని కూడా నేస్తున్నారు. "సింగిల్ ఇక్కత్‌లో డిజైన్ పేక పోగులపైనే ఉంటుంది. డబుల్ ఇకత్‌లో డిజైన్ పడుగూ పేకా రెండింటిలోనూ ఉంటుంది," అన్నారు రేఖా బెన్, రెండు రకాల పటోలాల మధ్య ఉన్న తేడాను వివరిస్తూ.
నేత ప్రక్రియను జటిలం చేసేది డిజైన్. రేఖా బెన్ మరోసారి వివరించే ప్రయత్నం చేస్తున్నారు. "ఒక సింగిల్ ఇక్కత్ పటోలుకు 3500 పడుగు దారాలు, 13750 పేక దారాలు ఉంటాయి. అదే డబుల్ ఇక్కత్‌కు 2220 పడుగు దారాలు, 9870 పేక దారాలు ఉంటాయి," నాడెలోకి పేక దారం ఉన్న బాబిన్‌ను జారవిడుస్తూ చెప్పారామె.



























