"యే బారా లాఖ్‌వాలా నా? ఇసీ కి బాత్ కర్ రహే హై నా?" ఒక వాట్సాప్ సందేశాన్ని నా కళ్ళ ముందుకు తెస్తూ అడిగారు 30 ఏళ్ళ షాహిద్ హుస్సేన్. అది ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని రూ. 12 లక్షలకు పెంచటం గురించి. షాహిద్ బెంగళూరు మెట్రో లైన్ పైన పనిచేస్తోన్న నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీకి చెందిన ఒక క్రేన్‌ను నడిపిస్తారు.
"మేం ఈ 12 లక్షల పన్ను లేని బడ్జెట్ గురించి చాలా వింటున్నాం," అని అదే ప్రదేశంలో పనిచేస్తోన్న బృజేష్ యాదవ్ వెక్కిరింపుగా అన్నారు. "ఇక్కడ ఎవరూ సంవత్సరానికి 3.5 లక్షల [రూపాయిలు] కంటే ఎక్కువ సంపాదించరు." 20 ఏళ్ళ వయసు దాటిన బృజేష్ ఉత్తరప్రదేశ్‌లోని దేవరియా జిల్లా, డుమరియా గ్రామానికి చెందిన అనిపుణ వలస కార్మికుడు.
“ఈ పని పూర్తయ్యే సమయానికి, మేం నెలకు సుమారు రూ. 30,000 వరకూ సంపాదిస్తాం," అన్నారు బిహార్‌లోని కైమూర్ (భభువా) జిల్లాలోని బివుర్‌కు చెందిన షాహిద్. "ఈ పని పూర్తయిన వెంటనే, కంపెనీ మమ్మల్ని వేరే ప్రదేశానికి పంపుతుంది, లేదా మేమే రూ. 10-15 ఎక్కువ సంపాదించే అవకాశం ఉన్న వేరే పని కోసం చూస్తాం."






