బడ్జెట్ గురించి తెలుసుకోవటం మగవాళ్ళ పని అని అంజనా దేవి నమ్ముతారు.
"మరద్ లోగ్ హీ జాన్తా హై యే సబ్, లేకిన్ వో తో నహీఁ హైఁ ఘర్ పర్ [దీని గురించి మగవాళ్ళకు మాత్రమే తెలుస్తుంది, కానీ నా భర్త ఇంట్లో లేడు]," అన్నారామె. అయితే వారి ఇంట్లో, కుటుంబ బడ్జెట్ను నడిపేది మాత్రం ఆమే. అంజనా షెడ్యూల్డ్ కులాల సముదాయానికి చెందిన ఒక చమార్.
"బజ్జట్ [బడ్జెట్]!" తానేమైనా కొత్త ప్రకటనలు విన్నదేమో అని గుర్తు చేసుకుంటూ అన్నారామె. "ఊ సబ్ హమ్ నహీఁ సునే హైఁ [నేను దాని గురించి వినలేదు]." కానీ, "ఈ సబ్ [బడ్జెట్] పైసా వాలా లోగ్ కే లియే హై [ఇదంతా పైసలున్న వారి కోసం],” బిహార్లోని వైశాలి జిల్లా, సోంధో రత్తీ గ్రామంలో నివసించే ఈ దళిత మహిళ అన్నారు.
అంజన భర్త, 80 ఏళ్ళ శంభు రామ్ - మేం వారిని కలవడానికి వెళ్ళినప్పుడు భక్తి గాయకుడిగా ప్రదర్శన ఇచ్చేందుకు బయటకు వెళ్ళారు - తమ ఇంట్లోనే ఒక రేడియోలు బాగుచేసే కార్యశాలను నిర్వహిస్తున్నారు. కానీ బాగుచేయించుకునేవాళ్ళు తక్కువ. "మేం కష్టమ్మీద వారానికి 300-400 రూపాయలు సంపాదిస్తాం," అని ఆమె చెప్పారు. వార్షిక ఆదాయం ప్రకారం చూసుకుంటే అది గరిష్టంగా రూ.16,500. లేదా స్వతంత్ర వ్యక్తులకు ఇచ్చే 12 లక్షల పన్ను మినహాయింపు పరిమితిలో 1.37 శాతం. పెంచిన పరిమితి గురించి చెప్పినప్పుడు ఆమె నవ్వేశారు. “కొన్నిసార్లు మేం వారంలో 100 రూపాయలు కూడా సంపాదించలేం. ఇది మొబైల్ ఫోన్ల యుగం. ఇక రేడియో వినేవారే లేరు,” అని ఆమె ఫిర్యాదు చేశారు.





