"వానాకాలం రాకముందే మనం గ్రామ సభ భవనానికి మరమ్మత్తులు చేయించుకోగలిగితే బాగుంటుంది," లుపూంగ్పాఠ్ గ్రామస్థులతో మాట్లాడుతూ అన్నారు సరితా అసుర్.
కొంతసేపటి క్రితం గ్రామం ప్రధాన వీధిలో నిలబడి డోలు వాయిస్తూ ఒక వ్యక్తి సభ జరుగుతుందని ప్రకటించిన తర్వాత, గ్రామ సభ ఇప్పుడే మొదలయింది. స్త్రీ పురుషులంతా తమ ఇళ్ళ నుండి బయటకు వచ్చి గ్రామ సభ సచివాలయం ముందుకు చేరుకున్నారు. ఈ రెండు గదుల భవనం మరమ్మత్తుల కోసమే సరిత నిధుల కోసం అడుగుతున్నారు.
ఝార్ఖండ్ రాష్ట్రం, గుమ్లా జిల్లాలోని ఈ గ్రామ ప్రజలు సరిత ప్రతిపాదనకు వెంటనే తమ ఆమోదం తెలిపారు.
"మా సమస్యలను పరిష్కరించుకోవాల్సిన బాధ్యత మాదేననీ, గ్రామ సభ ఊరిని అభివృద్ధి చేస్తుందనీ మాకిప్పుడు తెలుసు. ఇది మాకు, ప్రత్యేకించి మహిళలకు, శక్తినిచ్చింది," అని మాజీ జాతీయ స్థాయి హాకీ క్రీడాకారిణి అయిన సరిత ఆ తర్వాత ఈ రిపోర్టర్‌తో చెప్పారు.










