టక్-టక్-టక్
కొడవటిపూడిలో టార్పాలిన్ కప్పిన ఒక గుడిసెలోంచి ఈ లయబద్ధమైన శబ్దాలు వస్తున్నాయి. మూలంపాక భద్రరాజు, కుండలను చక్కటి గుండ్రని ఆకారంలోకి తీర్చిదిద్దే ఒక చిన్న తెడ్డు లాంటి చెక్క సుత్తితో కుండను మెల్లగా తడుతున్నారు.
“మందపాటి చెక్క సుత్తిని కుండ అడుగు భాగాన్ని మూసివేయడానికి వాడుతాం. అడుగు భాగాన్ని మరింత నునుపుగా చేయడానికి ఈ సాధారణ చెక్క సుత్తిని వాడుతాం, మొత్తం కుండను నునుపుగా మార్చడానికి మరింత సన్నటి చెక్క సుత్తిని వాడుతాం,” అవసరాన్ని బట్టి సుత్తిని మార్చుకుంటూ, 70 ఏళ్ళ భద్రరాజు వివరించారు.
సన్నగా, సాధారణ పరిమాణంలో ఉండే చెక్క సుత్తి తాటి చెట్టు (బోరాసస్ ఫ్లెబెల్లిఫెర్) కొమ్మల నుండి, మందపాటి సుత్తి అర్జున చెట్టు (తెల్లమద్ది చెట్టు - టెర్మినాలియా అర్జున) నుండి తయారవుతాయని ఆయన చెప్పారు. చాలా సన్నగా ఉన్న చెక్క సుత్తిని తీసుకుని ఆయన మళ్ళీ పని మొదలుపెట్టగానే అప్పటివరకూ ఎక్కువ స్థాయిలో ఉన్న మోత తక్కువ స్థాయికి చేరింది.
20 అంగుళాల వ్యాసం కలిగిన పెద్ద కుండను తయారుచేయడానికి ఆయనకు 15 నిమిషాలు పడుతుంది. ఇలా చేసేటప్పుడు కుండ ఒక వైపు పగిలినా లేదా చీలిపోయినా, వెంటనే అక్కడ కాస్త మట్టిని మెత్తి కుండను సరిచేసేందుకు మెల్లగా తట్టే ప్రక్రియను మళ్ళీ మొదలుపెడతారు.









