“ఓసబ్ వోట్-టోట్ ఛడో. సంధ్యా నమార్ ఆగే అనేక్ కాజ్ గో...[ఏంటీ వోటూ గీటూ! చీకటి పడేలోగా పూర్తిచేయాల్సినవి వెయ్యిన్నొక్క పనులున్నాయి...] రా, ఈ కంపు భరించగలిగితే వచ్చి మాతో కూర్చో," తన పక్కనే ఉన్న నేలను చూపిస్తూ అన్నారు మాలతి మాల్. వేడినీ ధూళినీ లెక్కచేయకుండా, ఒక పెద్ద ఉల్లిపాయ గుట్ట చుట్టూ కూర్చుని పని చేస్తూన్న మహిళల సమూహంలోకి వచ్చి చేరమని ఆమె నన్ను ఆహ్వాని స్తున్నారు. నేను దాదాపు వారం రోజులుగా గ్రామంలోనే తిరుగుతూ, ఈ మహిళలను వెంబడిస్తూ, రాబోయే ఎన్నికల గురించి వారికి ప్రశ్నలు వేస్తున్నాను.
అది ఏప్రిల్ నెల ప్రారంభం. పశ్చిమ బెంగాల్, ముర్షిదాబాద్‌లోని ఈ ప్రాంతంలో పాదరసం ప్రతిరోజూ 41 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంటోంది. సాయంత్రం 5 గంటలకు కూడా ఈ మాల్ పహాడియా గుడిసెలో వేడిగా ఉంది. చుట్టుపక్కల ఉన్న కొద్దిపాటి చెట్లకున్న ఆకు కూడా కదలటంలేదు. బరువుగా, ఘాటుగా ఉన్న తాజా ఉల్లిపాయల వాసన గాలిలో తేలాడుతూ ఉంది.
తాత్కాలికంగా నిర్మించుకున్న తమ ఇళ్ళకు 50 మీటర్ల దూరంలో ఉన్న ఆ బహిరంగ ప్రదేశం మధ్యలో ఉన్న ఉల్లిపాయల గుట్ట చుట్టూ ఈ మహిళలు అర్ధచంద్రాకారంలో కూర్చునివున్నారు. కొడవలితో కాడల నుండి ఉల్లిపాయలను వేరు చేయడంలో వారు నిమగ్నమై ఉన్నారు. పెరిగిపోతోన్న మధ్యాహ్నపు వేడిలో వారు పడుతోన్న శ్రమ, పచ్చి ఉల్లిపాయల ఆవిరితో కలిసి వారి ముఖాలకొక ప్రకాశాన్నిస్తోంది.
"ఇది మా దేశ్ [స్వగ్రామం] కాదు. గత ఏడెనిమిదేళ్ళుగా మేం ఇక్కడకు వస్తున్నాం," 60 ఏళ్ళ వయసు దాటిన మాలతి అన్నారు. ఆమెతో సహా ఆ బృందంలోని మహిళలంతా మాల్ పహాడియా ఆదివాసీ సముదాయానికి చెందినవారు. అధికారికంగా రాష్ట్రంలో షెడ్యూల్డ్ తెగగా జాబితా చేసివున్న ఈ సముదాయం అత్యంత దుర్బలమైన ఆదివాసీ సమూహాలలో ఒకటిగా పేరుపొందింది.
"మా ఊరు గొవాస్ కాళికాపూర్‌లో మాకు పనులు లేవు," అన్నారామె. ముర్షిదాబాద్ జిల్లా రాణినగర్ 1 బ్లాక్‌లోని గొవాస్‌కు చెందిన 30కి పైగా కుటుంబాలు ఇప్పుడు బిషుర్‌పుకూర్ గ్రామం అంచుల వద్ద నిర్మించుకున్న తాత్కాలిక గుడిసెల సమూహంలో నివసిస్తూ, స్థానికుల పొలాల్లో పని చేస్తున్నాయి.
మే 7న జరగనున్న లోక్‌సభ ఎన్నికలలో ఓటు వేయడానికి వారు తమ గ్రామానికి తిరిగి వెళ్ళాల్సి ఉందని వారు నాతో చెప్పారు. గొవాస్ కాళికాపూర్ బిషుర్‌పుకూర్ కుగ్రామానికి 60 కిలోమీటర్ల దూరంలో ఉంది.




























