తెర వెనుక ఒక యువకుడు సరిగ్గా సమయానికి దూసుకువెళ్ళి దియా (దీపం) మలిగిపోకుండా ఆపుతాడు. ఒక గంటపాటు జరిగే ప్రదర్శనలో అతను ఈ విధంగా చాలాసార్లు చేయవలసివుంటుంది. అక్కడి సామగ్రికి కానీ తనతోపాటు పనిచేసేవారికి కానీ ఏమాత్రం ఇబ్బంది కలగకుండా అతను ఇదంతా చేస్తాడు.
వీరంతా తమ ప్రేక్షకుల కంటపడకుండా ప్రదర్శననిచ్చే తోల్పావకూత్తు బొమ్మలాట ఆడించే కళాకారులు.
తోలు బొమ్మలను చేతపట్టుకొని ఈ బొమ్మలాట ఆడించేవారు తెల్లని నూలు తెర వెనుక నిర్విరామంగా తిరుగుతూనే ఉంటారు. వారి పాదాల వద్ద వరసగా ఉపయోగించడానికి వీలుగా 50-60 తోలుబొమ్మలు సిద్ధంగా ఉంటాయి. స్పీకర్లలో కథను వినిపిస్తూ, నీడల ద్వారా కథను చూపిస్తుంటారు.
ఈ కళ స్వభావం ఎలాంటిదంటే, నిజమైన ప్రదర్శనకు గుర్తింపు ఉండదు. 2021లో తోలుబొమ్మలాట కళాకారుడు రామచంద్ర పులవర్కి దేశంలో నాల్గవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మశ్రీ లభించినప్పుడు, అది వేడుకచేసుకోవటానికి కారణమయింది, అది ఈ కళ గుర్తింపు పొందిన సమయం కూడా. ఈ సందర్భంగా ఆ తోల్పావకూత్తు కళాకారుడు తన ప్రసంగంలో ఇలా అన్నారు: "ఈ గుర్తింపు... తోలుబొమ్మల నాటకరంగం మనుగడ కోసం సంవత్సరాలుగా మొత్తం బృందం చేసిన సమష్టి కృషికి చెందుతుంది."
పులవర్, ఆయన బృందానికి లభించిన ఈ విజయం అంత తేలికగా వచ్చిందేమీ కాదు. ఈ కళను ఒక వ్యాపారంగా మార్చారని విమర్శకులూ భక్తులూ వారిపై నిందారోపణులు చేశారు. ఈ విమర్శను రామచంద్ర పెద్దగా పట్టించుకున్నది లేదు. "మా తిండికీ, మేం బ్రతకటానికీ ఇది ఒక వ్యాపారమే కావాలి," అంటారాయన. "నటులూ, నృత్యకారులూ వారు చేసినదానికి డబ్బులు తీసుకుంటున్నప్పుడు అదే పని తోలుబొమ్మలాట ఆడించేవారు ఎందుకు చేయకూడదు?"




