కలిసి ఉన్న రెండు చిగురుటాకులు, ఒక మొగ్గ కోసం రాజిందర్ తీవ్రంగా వెతుకుతున్నారు. వాలుగా ఉన్న కొండపై, ఒకే విధంగా వరుసలుగా నాటిన తేయాకు పొదలను అతని వేళ్ళు సుతారంగా తాకుతున్నాయి. దగ్గరలో అతని భార్య సుమనా దేవి బుట్ట పట్టుకుని సిద్ధంగా నిలబడి ఉన్నారు. హిమాలయాలలోని ధౌలాధార్ శ్రేణిలో ఉన్న ఈ కొండపై దట్టమైన తేయాకు పొదల మీదుగా పెరిగిన ఎత్తైన ఓహీ చెట్ల ముందు మనుషులు మరుగుజ్జులుగా కనిపిస్తారు.
ఇది కోతల సమయం, కానీ ఆకుల కోసం రాజిందర్ సింగ్ ఎంత ఆతురతతో వెతికినా ఫలితం కనపడలేదు. కాంగ్రా జిల్లాలోని టాండా గ్రామంలోని వారి పొలానికి అతను ప్రతిరోజూ వస్తుంటారు. ఆయనతో పాటు భార్య సుమన, లేదా వారి 20 ఏళ్ళ కుమారుడు ఆర్యన్ ఉంటారు. ఏప్రిల్, మే నెలలు తేయాకులు కోసే సమయం, దీనిని మొదటి ' ఫ్లష్' (తాజా పంట) అంటారు. కానీ ఇప్పుడు కోద్దామంటే ఆయనకేమీ దొరకలేదు.
"వాతావరణం వేడిగా అనిపిస్తోంది, వర్షం జాడ తెలియడంలేదు!" హిమాచల్ ప్రదేశ్‌లోని పాలమ్‌పుర్ తహసీల్ లో ఉన్న తన తేయాకు పొదలు ఎండిపోతుండటం చూసి ఆయన ఆందోళనగా అన్నారు.
గత రెండేళ్ళుగా కురిసిన వర్షపాతాన్ని గమనిస్తే రాజిందర్ ఆవేదనను అర్థం చేసుకోవచ్చు. 2016 ఎఫ్ఎఒ అంతర-ప్రభుత్వాల ఒక నివేదిక , "టీ తోటల నష్టానికి అస్థిర వర్షపాత మే కారణం" అని పేర్కొంది. ఫిబ్రవరి నుండి ఏప్రిల్ నెలల మధ్య ప్రత్యేకించి వర్షం కురవాల్సిన అవసరం ఉన్న తేయాకుపై వాతావరణ మార్పుల ప్రభావాన్ని గురించి ఈ నివేదిక అధ్యయనం చేస్తుంది. ఆ తరువాత ఏప్రిల్‌లో మొదటగా కోసే పంటకు అత్యధిక ధర కిలో రూ. 800 వరకూ పలుకుతుంది, అప్పుడప్పుడు రూ.1,200 వరకూ కూడా.
మరో రెండు హెక్టార్ల తోటను గుత్తకు తీసుకున్న రాజిందర్‌కు 2022 సంవత్సరం ప్రత్యేకమైనదిగా ఉండాల్సింది. "నా ఆదాయం పెరుగుతుందని అనుకున్నాను," అని ఆయన చెప్పారు. మొత్తం తోట విస్తీర్ణం ఇప్పుడు మూడు హెక్టార్లు ఉండటంతో, సీజన్ ముగిసే సమయానికి 4,000 కిలోల వరకు తేయాకును పండించగలనని ఆయన ఎదురుచూశారు. గుత్త కింద ఆయన రూ. 20,000 ఖర్చుచేశారు. కాగా, తేయాకు ఉత్పత్తి ఖర్చులలో 70 శాతం వరకు కూలి ఖర్చులు, వేతనాలు ఉంటాయని ఆయన అన్నారు. "తోటను నిర్వహించాలంటే చాలా శ్రమతో పాటు అధిక ఖర్చులు (పెట్టుబడి) ఉంటాయి," అని ఆయన పేర్కొన్నారు. ఆపై తేయాకులను పొడిగా తయారుచేయడానికి అయ్యే అదనపు ఖర్చులు కూడా ఉంటాయి.
వారి కుటుంబం హిమాచల్ ప్రదేశ్‌లోని ఇతర వెనుకబడిన తరగతుల (ఒబిసి) జాబితాలో ఉన్న లబానా సముదాయానికి చెందినది. "[నా కుటుంబంలోని] మునుపటి తరాలవారు ఈ పనిలో స్థిరపడ్డారు," అని రాజిందర్ చెప్పారు. దీర్ఘకాల అనారోగ్యం కారణంగా తన తండ్రి మరణించిన తర్వాత కుటుంబానికి చెందిన వ్యవసాయ భూమి అతని స్వాధీనంలోకి వచ్చేటప్పటికి అతనికి 15 ఏళ్ళు మాత్రమే. నలుగురు తోబుట్టువులలో పెద్దవాడు కాబట్టి తోట నిర్వాహణను తన బాధ్యతగా భావించిన రాజిందర్ చదువు మానేశారు.
తోట సంరక్షణలోను, పానీయంగా వినియోగించే చివరి ఉత్పత్తి అయిన తేయాకు పొడి తయారీ వరకు జరిగే అన్ని ప్రక్రియలలోనూ మొత్తం కుటుంబం పాల్గొంటుంది. అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ చదువుతోన్న అతని కూతురు ఆంచల్ కలుపు తీయడం, ప్యాకింగ్ చేయడంలో సహాయపడుతుంది. కలుపు తీయడం మొదలుకొని ఆకులు కోయడం, ఆరబెట్టడం, ప్యాకింగ్ చేయడం వరకు వారి కొడుకు ఆర్యన్ అన్ని పనులూ చేస్తాడు. 20 ఏళ్ళ ఈ యువకుడు గణితంలో డిగ్రీ చదువుతూ పార్ట్‌టైమ్‌గా బోధిస్తున్నాడు.
కాంగ్రాలోని తేయాకు తోటలు నల్ల (బ్లాక్ టీ), పచ్చ (గ్రీన్ టీ) రకాలను ఉత్పత్తి చేస్తాయి. ఈ రెండు రకాలను అక్కడి ఇళ్ళలో ఎక్కువగా వాడతారు. “మీకు ఇక్కడ టీ దుకాణం కనిపించదు, బదులుగా మీకు ప్రతి ఇంట్లో చాయ్‌తో స్వాగతం పలుకుతారు. మేం మా టీలో పాలు, చక్కెర వేయం. ఇది మాకు ఔషధం లాంటిది,” అని సుమన చెప్పారు. ఆమె గ్రేడింగ్, ప్యాకేజింగ్ పనులు కూడా చేస్తారు. రాజిందర్ వంటి చాలామంది తేయాకు పెంపకందారులు తాజా ఆకులను రోల్ చేయడానికి, వేయించడానికి అవసరమైన యంత్రాలతో పాటు మిగిలిన ప్రక్రియల కోసం ఒక చిన్న గదితో తాత్కాలిక ఏర్పాటు చేసుకుంటారు. వారు ఇతర సాగుదారులకు కూడా కిలోకు రూ. 250 చొప్పున ఆకులను ప్రాసెస్ చేసి చేస్తారు.
1986లో ఆయన మరణించడానికి కొద్దికాలం ముందు, రాజిందర్ తండ్రి తన కుటుంబం తాజా ఆకులను ప్రాసెస్ చేయడానికి 8 లక్షల రూపాయల విలువైన యంత్రాలను కొనుగోలు చేసేందుకు రుణం తీసుకుని, భూమిని విక్రయించారు. ఆ రుణం ఇంకా చెల్లించవలసే ఉంది.
ఇక్కడ కాంగ్రా జిల్లాలో, రాష్ట్రంలోని తేయాకు పండే భూమిలో రాజిందర్ వంటి చిన్న పెంపకందారులదే ఆధిపత్యం - 96 శాతం మంది రెండు హెక్టార్ల కంటే తక్కువ భూమిని కలిగి ఉన్నారని 2022లో ప్రచురించబడిన రాష్ట్ర వ్యవసాయ శాఖ నివేదికలో పేర్కొన్నారు. సగానికి పైగా తోటలు పాలమ్‌పుర్ తహసీల్ లో ఉన్నాయి, మిగిలినవి బైజ్‌నాథ్, ధర్మశాల, దేహరా తహసీల్‌లలో విస్తరించాయి.
"హిమాచల్‌లోని కొన్ని జిల్లాలలో మాత్రమే తేయాకు పండించే అవకాశం ఉంది, ఎందుకంటే దానికి కావలసిన ఆమ్లాధార నేలలు, అవసరమైన PH స్థాయి 4.5 నుండి 5.5 వరకు ఉన్న నేలలు అక్కడే ఉంటాయి," అని డాక్టర్ సునీల్ పటియాల్ అభిప్రాయపడ్డారు. ఆయన రాష్ట్ర వ్యవసాయ శాఖలో తేయాకు సాంకేతిక అధికారి.
కాంగ్రాలోని తేయాకు తోటలు, పర్వతాలతో నిండిన భూభాగాలు బాలీవుడ్ చిత్రాలలో విస్తృతంగా కనిపిస్తుంటాయి. అతీంద్రియ అంశాల చుట్టూ అల్లిన కథతో తీసిన కొత్త చిత్రం భూత్ పోలీస్ ఇందుకు తాజా ఉదాహరణ. "చాలా మంది పర్యాటకులు తమ కెమెరాలను తీసి మా తోటలను చిత్రీకరిస్తారు, కానీ తోటల గురించి వారికి తెలిసింది చాలా తక్కువ," అని రాజిందర్ అన్నారు..
*****
హిమాచల్ ప్రదేశ్‌లోని తేయాకు తోటలు పూర్తిగా పర్వతప్రాంత అవపాత వర్షపాతంపై ఆధారపడి ఉంటాయి - వేడి పెరిగినప్పుడు సాధారణంగా వర్షాలు కురిసి, తేయాకు పొదలకు ఉపశమనం కలిగిస్తాయి. “వర్షపాతం లేకుండా ఉష్ణోగ్రతలు పెరగడం పెద్ద సమస్య. తేయాకు మొక్కలకు గాలిలో తేమ అవసరం, కానీ ఇప్పుడు [2021, 2022] వేడిగా ఉంది," అని పటియల్ వివరించారు.
భారత వాతావరణ శాఖ (ఐఎమ్‌డి) డేటా ప్రకారం, 2022 మార్చి, ఏప్రిల్ నెలలలో కాంగ్రా జిల్లాలో వర్షపాతం 90 శాతానికి పైగా లోటును చూపించింది. ఫలితంగా, 2022 ఏప్రిల్, మే నెలలలో తేయాకులు కోసి పాలమ్‌పుర్ సహకార తేయాకు కర్మాగారానికి పంపగా, 2019లో అదే నెలలో పంపిన తేయాకులో పావు వంతుకు, అంటే లక్ష కిలోలకు, తగ్గినట్టుగా లెక్కలు చెప్తున్నాయి.
రాజిందర్ కూడా ఈ సమస్యను ఎదుర్కొన్నారు. మే 2022 చివరిలో PARI అక్కడికి వెళ్ళినప్పుడు, తాను కేవలం 1,000 కిలోల తేయాకును మాత్రమే కోయగలిగానని ఆయన చెప్పారు. అందులో సగాన్ని స్థానికంగా అమ్మటం కోసం ఇంట్లోనే ప్రాసెస్ చేసేందుకు ఆ కుటుంబమే ఉంచుకోగా, మిగిలిన సగాన్ని ప్రాసెసింగ్ కోసం పాలమ్‌పుర్ లోని కర్మాగారానికి పంపారు. “నాలుగు కిలోల పచ్చి ఆకులతో ఒక కిలో తేయాకు తయారవుతుంది. మేం అమ్మటం కోసం ఒక్కొక్కటి కిలో ఉండేలా 100 ప్యాకెట్లను తయారుచేశాం,” అని రాజిందర్ కుమారుడు ఆర్యన్ చెప్పాడు. ఒక కిలో బ్లాక్ టీని రూ. 300కు, గ్రీన్ టీని రూ. 350కి అమ్ముతారు.
తేయాకును అస్సామ్, పశ్చిమ బెంగాల్, తమిళనాడులోని నీలగిరులలో ఎక్కువగా పండిస్తారు. 2021-22లో, భారతదేశం 1,344 మిలియన్ కిలోల తేయాకును ఉత్పత్తి చేసిందనీ, అందులో దాదాపు 50 శాతం తేయాకును చిన్న సాగుదారులే ఉత్పత్తి చేశారని భారతదేశ తేయాకు బోర్డు తమ వెబ్‌సైట్‌లో పేర్కొంది. కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ క్రిందకు వచ్చే ఈ సంస్థ, "చిన్న ఉత్పత్తిదారులు చాలా అసంఘటితంగా ఉండటం వల్ల, వారి భూములు చిన్నచిన్నవిగా, చెల్లాచెదురుగా ఉన్న కారణంగా వారు పండించే తేయాకు విలువ చాలా తక్కువ పలుకుతుంది." అని తమ వెబ్‌సైట్‌లో పేర్కొంది.
హిమాచల్‌లోని తేయాకు ఇతర ప్రాంతాలలో పండే తేయాకుతో పోటీపడుతుంది. "రాష్ట్రంలో యాపిల్ పెంపకందారులకు ప్రాధాన్యం ఇస్తారు, [స్థానిక] పరిపాలకులు కూడా వారిపైనే మరింత శ్రద్ధ చూపుతారు,” అని డాక్టర్ ప్రమోద్ వర్మ అభిప్రాయపడ్డారు. పాలమ్‌పుర్‌లోని హిమాచల్ ప్రదేశ్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో తేయాకు సాంకేతిక నిపుణులుగా ఉన్న ఆయన దశాబ్ద కాలంగా తేయాకుపై పరిశోధనలు చేస్తున్నారు..
తేయాకు పండించే ప్రాంతం కుంచించుకుపోవడం కూడా తేయాకు ఉత్పత్తి తగ్గడానికి ఒక కారణం. కాంగ్రా జిల్లాలో 2,110 హెక్టార్లలో తేయాకు తోటలు వేయగా, ఇందులో సగం విస్తీర్ణంలో, అంటే 1096.83 హెక్టార్లలో మాత్రమే చురుకుగా సాగవుతోంది. మిగిలినవాటిని పట్టించుకోకపోవటమో, వదిలివేయటమో, లేదా నివాసాలుగా మార్చడమో జరిగింది. ఇందులో ఆఖరిది (నివాసాలుగా మార్చడం) హిమాచల్ ప్రదేశ్ సీలింగ్ ఆన్ ల్యాండ్ హోల్డింగ్స్ 1972 చట్టాన్ని ఉల్లంఘిస్తోంది. తేయాకు సాగు కోసం ఉన్న భూమిని విక్రయించడం లేదా మరే ఇతర ప్రయోజనాల కోసం ఉపయోగించరాదని ఈ చట్టం చెబుతోంది.
“కొన్ని సంవత్సరాల క్రితం నా పొలానికి వెనుకనే తేయాకు తోటలు ఉండేవి. ఇప్పుడా స్థానంలో మీరు ఇళ్ళను చూస్తున్నారు,” అని టాండా గ్రామంలో రాజిందర్ పొరుగున ఉండే జాట్ రామ్ బాహ్మన్ చెప్పారు. అతను, అతని భార్య అంజాజ్ఞా బాహ్మన్ వారి 15-కనాల్‌ల (హెక్టారులో ముప్పావు వంతు) తోటలో తేయాకు సాగు చేస్తున్నారు.
చుట్టూ పుష్కలంగా ఉండే తోటలు లాభాలను ఆర్జించిన రోజుల్ని గురించి 87 ఏళ్ళ జాట్ రామ్ గుర్తుచేసుకున్నారు. మొదటి మొలకలు 1849లో నాటారు. 1880ల నాటికి కాంగ్రాలో తయారైన తేయాకు లండన్, ఆమ్‌స్టర్‌డామ్ మార్కెట్‌లలో బంగారు, వెండి పతకాలను గెలుచుకుంది. 2005లో కాంగ్రా తేయాకుకున్న ప్రత్యేక రుచికి గుర్తింపుగా భౌగోళిక సూచిక (జిఐ) ట్యాగ్‌ను అందుకుంది..
"అవి బంగారు రోజులు" అని టాండా గ్రామంలో 10 కనాల్‌ల (సుమారు అర హెక్టార్) తేయాకు తోటకు యజమాని అయిన 56 ఏళ్ళ జస్వంత్ బాహ్మన్ గుర్తుచేసుకున్నారు. “మేం ఆకులను మా ఇళ్ళలోని యంత్రాల (సంప్రదాయ)తో ప్రాసెస్ చేసి అమృత్‌సర్‌లో అమ్మేవాళ్ళం. అది చాలా పెద్ద మార్కెట్,” అని ఆయన చెప్పారు.
స్థానిక తేయాకు బోర్డు చెప్పినదాని ప్రకారం 1990లలో కాంగ్రా సంవత్సరానికి 18 లక్షల టన్నుల వరకు తేయాకును ఉత్పత్తి చేసేది. ఇక్కడ ఈ విషయాన్నే బాహ్మన్ ప్రస్తావిస్తున్నారు. తయారైన తేయాకును రోడ్డు మార్గంలో అమృత్‌సర్ మార్కెట్‌లకు - 200 కిలోమీటర్లకు పైగా ప్రయాణం - పంపేవారు. అక్కడి నుండి ఆ తేయాకు అంతర్జాతీయ వేలానికి చేరేది. ప్రస్తుతం ఆ మొత్తంలో సగం కంటే తక్కువ - 8,50,000 టన్నులు - తేయాకును కాంగ్రా ఉత్పత్తి చేస్తోంది.
“[మాకున్న ఒక హెక్టారు తోటలో] మేం మంచి మొత్తాన్నే సంపాదించగలిగాం. తేయాకును సిద్ధంచేసిన వెంటనే మేం సంవత్సరంలో చాలాసార్లు తిరిగేవాళ్ళం. ఒక్క ట్రిప్పులో నేను రూ. 13,000-35,000 దాకా సంపాదించగలిగాను,” అని PARIకి పాత బిల్లులను చూపిస్తూ రాజిందర్ చెప్పారు.
ఆ బంగారు కాలం ఎక్కువ రోజులు నిలవలేదు. " అమృత్‌సర్ మే భోత్ పంగా హోనే లగా [అమృతసర్‌లో మాకు ఇబ్బందులు మొదలయ్యాయి]," అని జస్వంత్ చెప్పారు. కాంగ్రా తేయాకు తోటల యజమానులు భారతదేశంలోని ప్రధాన తేయాకు వేలం కేంద్రమైన కొల్‌కతాకు మారడం ప్రారంభించారు. చాలామంది పెంపకందారులు ఇంటి వద్ద ప్రాసెసింగ్ చేయడాన్ని ఆపివేసి ప్రభుత్వ కర్మాగారాలు నేరుగా కొల్‌కతాలోని కర్మాగారాలతో వ్యవహరిస్తాయనే కారణంతో పాలమ్‌పుర్, బీర్, బైజ్‌నాథ్, సిద్ధబారీలలోని కర్మాగారాలకు మారారు. అయితే ఈ కర్మాగారాలు కూడా మూతపడటం ప్రారంభమై, స్థానిక సాగుదారులు స్థానిక ప్రభుత్వ మద్దతును కోల్పోయారు. ఈ రోజున ఒకే ఒక సహకార కర్మాగారం మాత్రమే పనిచేస్తోంది.
కొల్‌కతా వేలం కేంద్రం కాంగ్రా నుండి దాదాపు 2,000 కి.మీ దూరంలో ఉండటంతో, ఇది అధిక రవాణా ఖర్చులు, అధిక గిడ్డంగి ఛార్జీలు, పెరిగిన కూలీ ఖర్చులకు దారితీసింది. దీని వలన అస్సామ్, పశ్చిమ బెంగాల్, నీలగిరులకు చెందిన ఇతర భారతీయ తేయాకులతో పోటీపడటం కష్టంగా మారింది. అందువల్ల కాంగ్రా తేయాకు ఉత్పత్తిదారుల లాభాలు గణనీయంగా తగ్గిపోయాయి.
“కాంగ్రా తేయాకును కాంగ్రా తేయాకుగా కాకుండా దానిని కొనుగోలు చేసినవారు వేర్వేరు పేర్లతో, వ్యాపారి కంపెనీ పేరుతో ఎగుమతి చేస్తారు. కొల్‌కతా వేలం కేంద్రం వీరి తేయాకును తక్కువ ధరకు తీసుకుని, తాను మంచి ధరకు అమ్ముకుంటుంది. అంతేకాక వారికి మంచి ఎగుమతి ఆధారం కూడా ఉంది,” అని వర్మ పేర్కొన్నారు.
*****
"తోట కోసం నాకు సుమారు 1,400 కిలోల ఎరువు కావాలి, దీనికి దాదాపు రూ. 20,000 ఖర్చవుతుంది," అని రాజిందర్ చెప్పారు. గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఎరువుపై 50 శాతం సబ్సిడీ ఇచ్చిందని, అయితే గత ఐదేళ్ళుగా అది ఆగిపోయిందని, అలా ఎందుకు ఆపేశారో రాష్ట్ర శాఖ వారితో సహా ఎవరికీ అర్థం కావడం లేదని ఆయన అన్నారు.
తేయాకు తీవ్ర శ్రమతో కూడుకున్న పంట. ఏప్రిల్ నుండి అక్టోబరు వరకు ఆకులు కోయటానికి, ఆ తరువాత నవంబర్ నుండి కొమ్మలు కత్తిరించడానికి కార్మికుల అవసరం ఉంటుంది. కొమ్మలు కత్తిరించడానికి గవర్నమెంట్ యంత్రాలను ఇచ్చింది. కూలీ ఖర్చులను ఆదా చేయడం కోసం రాజిందర్, ఆయన కుమారుడు దానిని ఉపయోగిస్తారు. అయితే వారు పెట్రోల్ కోసం ఖర్చు చేయవలసి వస్తోంది.
గత సంవత్సరం ఈ కుటుంబం ముగ్గురు కూలీలను రోజుకు రూ. 300 చొప్పున కూలీ ఇచ్చి పనిలోకి తీసుకుంది. "కానీ కోయటానికి ఆకులేమీ లేనప్పుడు వారిని(కూలీలను) ఉంచుకోవటంలో ఉపయోగం ఏముంది? మేం కూలీ ఖర్చులు మాత్రం ఎలా ఇవ్వగలం," అని రాజిందర్ వారిని ఎందుకు పంపేయాల్సి వచ్చిందో వివరించారు. 2022 ఏప్రిల్ నుండి అక్టోబరు వరకు పంట కోతల సమయంలో సాధారణంగా కార్మికులతో నిండి ఉండే ఆ కొండ ప్రాంతాలలో ఇప్పుడు ఎవరూ కనపడటం లేదు.
లాభాలు తగ్గిపోవడం, ప్రభుత్వ మద్దతు లేకపోవడం యువతకు ఇక్కడ భవిష్యత్తు లేకుండా చేస్తోంది. జాట్ రామ్ తమ పిల్లలకు ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయని చెప్పారు. ఆయన భార్య అంజాజ్ఞా, "మా తర్వాత [తోటను] ఎవరు చూసుకుంటారో నాకు తెలియట్లేదు" అని అన్నారు.
రాజిందర్ కొడుకు ఆర్యన్ కూడా అక్కడ ఉండేందుకు ఇష్టపడటం లేదు. “వారు [అతని తల్లిదండ్రులు] జీవనోపాధి కోసం కష్టపడడాన్ని నేను చూశాను. ప్రస్తుతానికి, నేను నా తల్లిదండ్రులతో కలిసి పని చేస్తున్నాను, కానీ ఇది ఎక్కువ కాలం సాగదు.” అని ఆర్యన్ అన్నాడు.
సంవత్సరాంతానికి, చాలావరకు అక్టోబరులో తేయాకు సీజన్ ముగిసేనాటికి, తాము రూ. 2.5 లక్షలు సంపాదించినట్లు రాజేందర్ అంచనా వేశారు. ఈ మొత్తం నుండి వారు అద్దె, పెట్టుబడి, ఇతర ఖర్చులను తీసివేస్తారు.
2022లో తమ కుటుంబం పొదుపు చేసిన సొమ్ముపై ఆధారపడలేకపోయిందని రాజిందర్ చెప్పారు. తమ రెండు ఆవులు ఇచ్చే పాలను అమ్మడం, ఇతర చిన్న తోటలవారికి ఆకులను ప్రాసెస్ చేసివ్వడం, బోధన ద్వారా ఆర్యన్‌కు వచ్చిన రూ. 5,000 ఆదాయంతో వారు కాలం గడిపారు.
పేలవమైన రాబడుల కారణంగా 2022లో రాజిందర్, సుమనలు తాము గుత్తకు తీసుకున్న రెండు హెక్టార్ల తోటలను తిరిగి ఇచ్చేశారు.
అనువాదం: నీరజ పార్థసారథి