మా మాటలు సాగుతుండగానే కార్తిక్ తడి మట్టితో కార్తిక దేవుడి ముఖాన్ని రూపొందిస్తూ, తన నిపుణమైన చేతులతో ఆ ముఖాన్ని తీర్చిదిద్దుతున్నారు. ఆయన ఒక రంగులద్దే కుంచెను, వెదురును చేతితో మెరుగుపెట్టి తయారుచేసిన చియారి అనే ఒక బొమ్మలు చెక్కే పరికరాన్ని ఉపయోగిస్తున్నారు.
దగ్గరలోనే ఉన్న మరో కార్యశాలలో, ఒక మట్టి దేహనిర్మాణంపై చర్మం వంటి ఆకృతినిచ్చే ఒక సన్నని తువ్వాలు వంటి పదార్థాన్ని అంటించేందుకు గోపాల్ పాల్ జిగురును సిద్ధం చేశారు. గోపాల్ కొల్‌కతాకు ఉత్తరాన 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న నదీయా జిల్లాలోని కృష్ణనగర్‌కు చెందినవారు. ఇక్కడి చాలామంది కార్మికులు - అందరూ పురుషులే - ఒకే జిల్లాకు చెందినవారు; చాలామంది అదే ప్రాంతంలో కార్యశాల యజమానులు ఏర్పాటుచేసిన క్వార్టర్లలో ఉంటారు. సీజన్ ముమ్మరమయ్యే నెలరోజులకు ముందే కూలీలను పనిలోకి తీసుకుంటారు. వారు ఎనిమిది గంటల షిఫ్టులలో పని చేస్తారు. కానీ శరత్కాల పండుగకు ముందు ఈ కళాకారులు రాత్రిపూట కూడా పని చేస్తారు, ఎక్కువ గంటలు పనిచేసినందుకు డబ్బు పొందుతారు.
కుమార్‌టులిలోని మొదటి తరం కుమ్మరులు కృష్ణనగర్ నుంచి సుమారు 300 ఏళ్ళ క్రితం వలసవచ్చినవారు. వాళ్ళు బాగ్‌బజార్ ఘాట్‌కు సమీపంలో అప్పుడే కొత్తగా ఏర్పడుతోన్న కుమార్‌టులికి వచ్చి కొన్ని నెలలపాటు ఉన్నారు. అక్కడ ఉంటే నది నుండి మట్టిని సులభంగా తెచ్చుకోవచ్చు. వారు జమీందార్ల ఇళ్ళలో పనిచేశారు. దుర్గాపూజ పండుగకు ముందు వారాల తరబడి ఠాకుర్‌దాలాన్ (జమీందార్ల నివాస ప్రాంగణంలో మతపరమైన పండుగల కోసం కేటాయించిన ప్రదేశాలు) లలో విగ్రహాలను తయారుచేశారు.
1905లో బెంగాల్ విభజన సమయంలోనూ, అంతకు ముందు కూడా బంగ్లాదేశ్‌లోని ఢాకా, బిక్రమ్‌పూర్, ఫరీద్‌పూర్‌ల నుండి నిపుణులైన కళాకారులు కుమార్‌టులికి వచ్చేవారు. భారతదేశానికి స్వతంత్రం వచ్చాక జమీందారీ వ్యవస్థ క్షీణించిపోవటంతో, సర్బొజనీన లేదా సాముదాయక పూజ ప్రాచుర్యం పొందింది. ఇదంతా దుర్గామాత ఇరుకైన ఠాకూర్‌దాలన్ల నుంచి బయటకు వచ్చి, ఆమెతో పాటు ఇతర దేవతలకు కూడా విస్తృతమైన, విభిన్నమైన నేపథ్యాలను సృష్టించి వీధుల్లో ఏర్పాటుచేసిన విశాలమైన పండాళ్ళ లోకి వచ్చినప్పుడు జరిగింది.