కృష్ణాజీ భరిత్ సెంటర్‌లో పని చేయకుండా ఖాళీగా ఉండే చేతులు కనిపించవు.
మధ్యాహ్న భోజనం లేదా రాత్రి భోజనం, అలాగే జళగావ్ రైల్వే స్టేషన్‌లో ముఖ్యమైన రైళ్ళు ఆగడానికి కొన్ని గంటల ముందు కూడా, ప్రతిరోజూ వంకాయలతో చేసే దాదాపు 300 కిలోల భరిత్‌ను వండి, వడ్డిస్తారు; అలాగే ప్యాక్ చేసి పంపించేందుకు సిద్ధం చేస్తారు. ఇది జళగావ్ నగరంలోని పాత బిజె మార్కెట్ ప్రాంతంలో ఉన్న ఒక చిన్న దుకాణం. పారిశ్రామికవేత్తల నుంచి కార్మికుల వరకు, ఔత్సాహిక పార్లమెంటు సభ్యుల నుంచి అలసిపోయిన పార్టీ కార్యకర్తల వరకు దీని ఖాతాదారులు.
వేడిగా ఉండే ఏ సాయంత్రమైనా, రాత్రి భోజన సమయానికి ముందు, కృష్ణాజీ భరిత్ లోపలి భాగంలో - శుభ్రం చేయటం, తరగడం, పొడి కొట్టడం, పొట్టు తీయడం, కాల్చడం, వేయించడం, వంటకాన్ని తిప్పుతుండటం, వడ్డించడం, ప్యాకింగ్ చేయటం వంటివన్నీ అస్పష్టంగా కనిపిస్తుంటాయి. రెస్టరెంట్ వెలుపల ఉన్న మూడు స్టీలు రెయిలింగ్‌ల వెంట ప్రజలు క్యూలో నిలబడి ఉంటారు. ఒకప్పటి పాత సింగిల్-స్క్రీన్ సినిమా హాళ్ళ బయట సినిమా టిక్కెట్ల కోసం వేచి ఉండేవారి వరుసలా ఈ క్యూ కనిపిస్తూ ఉంటుంది.
ఇక్కడ ప్రధాన పాత్ర 14 మంది మహిళలది.









