భారతదేశ మొదటి న్యాయశాఖా మంత్రి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, కొత్త పార్లమెంట్ భవనంలో జరుగుతోన్న కార్యకలాపాలను సంశయాత్మక దృష్టితో చూసివుండేవారు. ఎందుకంటే, "రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నట్టుగా నాకు అనిపిస్తే, దానిని తగలబెట్టే మొదటి వ్యక్తిని నేనే" అని చెప్పినవారు కదా ఆయన.
పార్లమెంటులో 2023లో ఆమోదం పొందిన పౌరుల రాజ్యాంగ హక్కులకు భంగం కలిగించే ముఖ్యమైన కొత్త బిల్లులను గురించి PARI గ్రంథాలయం సునిశిత పరిశీలన.
అటవీ (సంరక్షణ) సవరణ చట్టం, 2023 విషయాన్నే తీసుకోండి. భారతదేశంలోని అడవులు సరిహద్దులకు సమీపంలో ఉంటే, ఇక వాటిలోకి ఎవరికీ ప్రవేశముండదు. అనేక దేశాలతో అంతర్జాతీయ సరిహద్దులను పంచుకునే ఈశాన్య భారతదేశాన్నే ఉదాహరణగా తీసుకోండి. భారతదేశపు అటవీ ప్రాంతంలో 50 శాతానికి పైగా ఉన్న ఈశాన్య ప్రాంతంలోని 'వర్గీకరించని అడవులు', ఇప్పుడు సవరణ తర్వాత సైనిక, ఇంకా ఇతర అవసరాలకు ఉపయోగించబడతాయి.
డిజిటల్ గోప్యత విషయంలో, ఒక కొత్త చట్టం - భారతీయ నాగరిక్ సురక్ష (రెండవ) సంహిత చట్టం - దర్యాప్తు సమయంలో ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌ల వంటి డిజిటల్ పరికరాలను స్వాధీనం చేసుకోవడాన్ని దర్యాప్తు సంస్థలకు సులభతరం చేస్తుంది. ఈ విధంగా గోప్యతకు సంబంధించి పౌరుల ప్రాథమిక హక్కును సందిగ్ధంలో పడేస్తుంది. అదేవిధంగా టెలికమ్యూనికేషన్ సేవల అధీకృత సంస్థ ద్వారా ధృవీకరించబడిన బయోమెట్రిక్ ఆధారిత గుర్తింపును ఉపయోగించాలని కొత్త టెలికమ్యూనికేషన్స్ చట్టం నిర్దేశిస్తుంది. బయోమెట్రిక్ డేటాను సంగ్రహించి, దానిని చేర్చి పెట్టడం వలన గోప్యత, సైబర్ భద్రతలను గురించిన తీవ్రమైన ఆందోళనలు తలెత్తుతాయి.







