“బిజు (కొత్త సంవత్సరం పండుగ) సమయంలో, మేమంతా ఉదయానే లేచి పూలు కోయడానికి బయటకు వెళ్తాం. ఆ పూలని నదిలో విడిచి, అక్కడే స్నానం చేస్తాం. ఆ తర్వాత, గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్ళి, అందరినీ కలిసి పలకరిస్తాం,” అన్నారు జయ. యాభై ఏళ్ళకు పైగా గడిచినా, ఆనాటి జ్ఞాపకాలు ఇంకా మసకబారలేదు.
“ప్రతి ఇంట్లో మేం గుప్పెడు బియ్యపు గింజలను (అదృష్టానికి ప్రతీకగా)బహుమతిగా ఇస్తాం. బదులుగా ప్రతి ఇంటివారు మాకు లాంగి (బియ్యంతో తయారయ్యే మద్యం) ఇస్తారు. ప్రతి ఇంట్లో కొన్ని గుక్కలు మాత్రమే తాగినప్పటికీ, అందరిళ్ళకీ వెళ్ళి ఇలా తాగేసరికి చివరకు మాకు బాగా మత్తెక్కిపోతుంది," అన్నారామె. ఇదే కాకుండా, "ఆ రోజు గ్రామంలోని యువకులందరూ పెద్దల పట్ల తమకున్న గౌరవాన్ని చాటేందుకు నది నుండి తెచ్చిన నీటితో వారికి స్నానం చేయిస్తారు.” ఈ వార్షిక వేడుకల జ్ఞాపకాలను నెమరు వేసుకుంటున్న జయ ముఖం వెలిగిపోతోంది.
తన ఇంటి నుండి కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో, అంతర్జాతీయ సరిహద్దుకు అవతల ఉన్న ఆమెకు, లాంగి జ్ఞాపకాలు ఇంకా వెన్నాడుతూనే ఉన్నాయి; ఎంతోమంది శరణార్థులను వారి చక్మా సముదాయానికి చెందిన సంప్రదాయాలతో, ఆచారాలతో ముడివేసే బంధం ఈ పానీయం. “ఇది మా సంస్కృతిలో అంతర్భాగం," బంగ్లాదేశ్‌లోని రంగమతిలో పెరిగిన జయ చెప్పారు. ఈ ప్రాంతంలో నివసించే ఇతర తెగలు కూడా తమ ఆచారాలలో, నైవేద్యాలలో లాంగిని ఉపయోగిస్తారు.
“నా తల్లిదండ్రులు చేసేది చూస్తూ నేను దీని (లాంగి) తయారీ నేర్చుకున్నాను. పెళ్ళయ్యాక, నా భర్త సురేన్, నేను కలిసి దీన్ని తయారుచేయడం మొదలుపెట్టాం,” ఆమె తెలిపారు. ఈ జంటకు మరో మూడు రకాల మద్యాలను - లాంగి, మోద్, జొగొరా - తయారుచేయడం కూడా తెలుసు.
చైత్ర మాసపు మొదటి రోజున (బెంగాలీ క్యాలెండర్లో చివరి నెల), జొగొరా తయారీకి సన్నాహాలు మొదలవుతాయి. దీన్ని కూడా బియ్యంతోనే తయారుచేస్తారు. “ఇందుకోసం మేం బిరోయిన్ చాల్ (నాణ్యమైన జిగురు ఎక్కువగా ఉండే బియ్యం)ను ఉపయోగిస్తాం. స్వేదనం (distill) చేయటానికి ముందు, కొన్ని వారాలపాటు ఆ బియ్యాన్ని వెదురులో పులియబెడతాం. కానీ, ఇప్పుడు మేం తరచుగా జొగొరా తయారుచేయడం లేదు,” జయ చెప్పారు. ఎందుకంటే, దాని తయారీకి కనీసం ఒక నెల పడుతుంది; పైగా బియ్యం కూడా చాలా ఖరీదైపోయింది. “ఇంతకుముందు మేం ఈ వరిని ఝుమ్ (కొండల సాగు)లో పండించేవాళ్ళం, కానీ అది పండించడానికి ఇప్పుడు మా దగ్గర అంత సాగు భూమి లేదు.”
















